* తెలంగాణను డ్రగ్స్ అడ్డాగా మార్చిన కాంగ్రెస్ సర్కార్!
వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం రాయపర్తి మండలంలో ఓ యువతిపై సామూహిక అత్యాచారం, హత్య జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఆడబిడ్డల భద్రత పూర్తిగా గాలికొదిలేశారు అనడానికి ఈ ఘటనే నిదర్శనం అని బిజెపి తెలంగాణ మహిళా మోర్చా అధ్యక్షురాలు డా. మేకల శిల్పారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
గంజాయి మత్తులో కొందరు మృగాళ్లు ఒక యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమె ప్రాణాలు తీయడం సభ్య సమాజం తలదించుకోవాల్సిన విషయం అంటూ ఈ ఘోరం తెలంగాణలో మహిళల భద్రత పూర్తిగా సమాధి అయిందనడానికి సజీవ సాక్ష్యం అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో పోలీసుల వ్యవహారశైలి అత్యంత హేయంగా ఉందని చెబుతూ కన్నబిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చాల్సింది పోయి, పోలీసులు అధికార పార్టీకి తొత్తుల్లా మారి బాధితులనే అవమానించడం దారుణం అంటూ ఆమె మండిపడ్డారు.
యువతి శరీరంపై రక్తపు గాయాలు స్పష్టంగా కనిపిస్తుంటే గంజాయి మత్తులో మృగాళ్లు అఘాయిత్యం చేశారని ఆరోపణలు వస్తుంటే . ‘ఆమెను చీమలు కరవడం వల్లే రక్తం వచ్చి చనిపోయిందంటూ బాధ్యతారహితంగా పోలీసులు చెబుతున్న సమాధానాలు వింటుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏ స్థాయిలో దిగజారాయో అర్థమవుతోందని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా హోంమంత్రి పదవిలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో నేరాలు అదుపులోకి రాకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు పరాకాష్ట అని ఆమె విమర్శించారు.
నిందితుల పేర్లు బయటకు వచ్చినా పోలీసులు తక్షణమే స్పందించకపోవడం వెనుక ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయి? అని శిల్పా రెడ్డి ప్రశ్నించారు. నేరం జరిగాక కళ్లు తెరవడం కాదని, అసలు ఇలాంటి దారుణాలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? అని ఆమె నిలదీశారు. గంజాయి, డ్రగ్స్ నెట్‌వర్క్‌ను పెకిలించడం మీ వల్ల కాకపోతే తక్షణమే హోంమంత్రి పదవి నుంచి తప్పుకోండని ఆమె డిమాండ్ చేశారు.
ఈ దారుణానికి గంజాయి మత్తు ప్రధాన కారణమనే ఆరోపణల పట్ల కలవరం వ్యక్తం చేస్తూ గల్లీ గల్లీలో గంజాయి, డ్రగ్స్ ఏరులై పారుతున్నాయని ఆమె తెలిపారు. తెలంగాణను ‘డ్రగ్స్ ఫ్రీ స్టేట్’ చేస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు మాఫియా ముందు మోకరిల్లిందా? అని ఆమె ప్రశ్నించారు. ఈ మాఫియా వెనుక ఉన్న పెద్ద తిమింగలాలను ఎందుకు పట్టుకోవడం లేదు? అంటూ ఆమె విస్మయం వ్యక్తం చేశారు.
యువత భవిష్యత్తును బుగ్గిపాలు చేస్తూ, మహిళల మానప్రాణాలతో ఆడుకుంటున్న ఈ గంజాయి ముఠాలపై ఉక్కుపాదం మోపాల్సిందే అని స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణలో మహిళల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని, రోజుకు సగటున 10 అత్యాచారాలు, 4 కిడ్నాప్‌లు, 3 హత్యలు జరుగుతున్నాయని డా. శిల్పా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రెండున్నర గంటలకు ఒక మహిళపై అఘాయిత్యం జరుగుతోందని ఆమె చెప్పారు.
హైదరాబాద్ లాంటి విశ్వనగరంలో కూడా పట్టపగలే కత్తులతో దాడులు, తుపాకీ కాల్పులు జరుగుతుంటే ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాలా? ఇది ప్రజా పాలన కాదు.. కాంగ్రెస్ నీడలో నడుస్తున్న “గూండాల రాజ్యం” అంటూ ఆమె విమర్శించారు.
ఇప్పటికైనా వర్ధన్నపేట ఘటనలో నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి, కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించాలని డా. శిల్పా రెడ్డి డిమాండ్ చేశారు. మహిళల మానప్రాణాలను కాపాడలేని ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే హక్కు లేదని ఆమె స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు బిజెపి మహిళా మోర్చా తరపున తమ పోరాటం ఆగదని తెలిపారు.

More Stories
పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టులో మధ్యంతరం బెయిల్
తెలంగాణ వ్యాప్తంగా సూర్యుడి భగభగలు
బెంగాల్ లో తొలగించిన ఓటర్లలో 63% మంది హిందువులే