* కేరళంలో 78.13, అస్సాంలో 84.42, పుదుచ్చేరిలో 86శాతం
కేరళ, అస్సాం రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో చెదురుమదురు ఘటనలు మినహా గురువారం పోలింగ్ ప్రశాంతంగా, భారీగా ముగిసింది. పుదుచ్చేరిలో 86శాతం, అస్సాంలో 84.42శాతం, కేరళలో 78.13శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అస్సాంలో సాయంత్రం ఐదు గంటలకే పోలింగ్ ముగిసినా, కేరళ, పుదుచ్చేరిల్లో మాత్రం ఆరుగంటల వరకు అనుమతించారు. ఆ సమయానికి క్యూలో వున్న వారికి టోకెన్లు ఇచ్చి ఓటు వేసేందుకు అనుమతిచ్చారు.
కేరళంలోని 140 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ సాఫీగా, సజావుగా సాగింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 76శాతం పోలింగ్ నమోదు కాగా, ప్రస్తుత ఎన్నికల్లో అంతకంటే అధికంగానే నమోదైంది. ఈసారి కోయకోడ్లో అత్యధికంగా 77శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల కమిషన్ పేర్కొంది. తొలిసారి ఓటు వేసిన వారు సెల్ఫీ దిగేందుకు వీలుగా ఏర్పాటు చేసిన జెన్‌జీ పోలింగ్ బూత్ అందరినీ ఆకట్టుకుంది. వారికి ఎన్నికల కమిషన్ ‘స్వీట్ సర్ప్రైజ్’ ఇచ్చింది. ప్రతి జిల్లాలో మొదటిసారి ఓటు వేసిన 200మందికి హల్వా పంచింది.
అస్సాంలోని 126 నియోజకవర్గాల్లో పోలింగ్ చెదురుమదురు ఘటనలతో కొనసాగింది. ఈసారి 84శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల కంటే ఇది అధికం. దల్గావ్లో అత్యధికంగా 94.57శాతం పోలింగ్ నమోదైనట్లు ఇసి వెల్లడించింది. అస్సాంలో జరిగిన ఘర్షణల్లో 30మంది గాయపడ్డారు. ఏడుగురిని అరెస్టు చేశారు. దిబ్రూఘర్ జిల్లాలోని ఖొవాంగ్వద్ద బిజెపి మద్దతుదారులతో జరిగిన ఘర్షణలో అస్సాం జాతీయ పరిషత్ (ఎజెపి)కి చెందిన ముగ్గురు నేతలు గాయపడ్డారు. శ్రీభూమి జిల్లాలో పతార్కండి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పోలింగ్ బూత్‌లోకి అక్రమంగా ప్రవేశించి ప్రిసైడింగ్ అధికారితో వాదన పెట్టుకోవడంతో సమస్య మొదలైంది.
నకిలీ ఓటర్లు వచ్చి అసలైన వారి ఓట్లు వేసేస్తున్నారని ఆయన వాదించారు. అలాంటిదేమీ లేదని ప్రిసైడింగ్ అధికారి అనడంతో అభ్యర్థి ఇవిఎంను విరగ్గొట్టారు. దాంతో బిజెపి, కాంగ్రెస్ మద్దతుదారుల మధ్య ఘర్షణ మొదలైంది. అస్సాంలోని సోనిత్పూర్ జిల్లాలో ఎన్నికల అధికారి దేబెన్ హోరో (45) మరణించి వుండగా కనుగొన్నారు. ఆయన మరణానికి కారణమేంటో ఇంకా నిర్ధారించలేదు.
పోలింగ్ బూత్‌లోకి ఫోన్లు నిషిద్ధం. కేంద్రంలోకి వెళ్లేముందు ఫోన్లు, బ్యాగ్‌లు సహా అన్ని వస్తువులను ఇచ్చి లోపలకు వెళ్లాలని ఇసి స్పష్టంగా పేర్కొంది. అస్సాంలోని కర్బి అనగ్లాంగ్ జిల్లా యంత్రాంగం గురువారం ఇందుకు సంబంధించి ఫోలీసు ఫిర్యాదు చేసింది. ఒక పోలింగ్ స్టేషన్లో పోలింగ్ ప్రక్రియను చూపిస్తున్నట్లుగా వున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిందని అధికారులు తెలిపారు. దిఫూ నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్లో తీసిన వీడియోగా భావిస్తున్నారు. వెంటనే దీనిపై విచారణకు ఆదేశించామని చెప్పారు. ప్రజా ప్రాతినిధ్యచట్టంలోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ను కూడా నమోదు చేశారు.
పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ స్థానాల్లోనూ భారీగా పోలింగ్ నమోదైంది. పుదుచ్చేరిలో ఇంత భారీ స్థాయిలో (86శాతం) ఓటింగ్ నమోదవడం 2006 తర్వాత ఇదే తొలిసారి. వివిప్యాట్ యంత్రంలోని బ్యాటరీ నుండి పొగ వస్తుండడంతో కరైకల్‌లో ఒక పోలింగ్ బూత్‌లో కాసేపు పోలింగ్ ఆగింది. ఆ బ్యాటరీని మార్చి కొత్తది పెట్టిన తర్వాత పోలింగ్‌ను పునరుద్ధరించారు.
మన్నాదిపేట్ అసెంబ్లీ నియోజకవర్గంలో తిరుక్కనూన్ పోలింగ్‌స్టేషన్‌కు సమీపంలో బిజెపి, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. పోలింగ్ స్టేషన్లకు సమీపంలో ప్రచారం చేస్తున్నారంటూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధితో బిజెపి నేత, హోం మంత్రి గొడవ పడ్డారు. దాంతో ప్రజలను చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేశారు.

More Stories
మహిళా, పునర్విభజన బిల్లులపై కాంగ్రెస్ సందిగ్ధత
ఐరోపాతో అమెరికాకు దూరం పెంచిన ట్రంప్ ఇరాన్ యుద్ధం
ఆలయాల్లో కొందరికే అనుమతిస్తే హిందూమతంకే నష్టం