అమెరికా వైఖరిలో మార్పు రాకపోవడం, ట్రంప్ దూకుడు మాటలు కొనసాగుతుండటం, లెబనాన్‌పై దాడులు చేయకుండా ఇజ్రాయిల్‌ను కట్టడి చేయకపోవడం దీనికి కారణంగా చెబుతున్నారు. మరోవైపు గురువారం నాడు కూడా లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడులు చేసింది. అమెరికా, ఇరాన్ దేశాల నేతలు మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. లెబనాన్‌పై దాడులు ఆపేంతవరకు హర్మూజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ ప్రకటించింది.
జలసంధిని తెరవకపోయినా, పూర్తిస్థాయి ఒప్పందానికి సిద్ధపడకపోయినా మళ్లీ దాడులు చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. తమ బలగాలు ఇప్పటికే ఇరాన్ చుట్టూ మొహరించి ఉన్నాయని, నిజమైన ఒప్పందం జరిగేంత వరకు అవి అక్కడే ఉంటాయని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ కూడా దీనికి దీటుగానే స్పందిస్తూ బెదిరింపులకు భయపడేది లేదని, యుద్ధమో, కాల్పుల విరమణో ఏది కావాలో అమెరికా అధ్యక్షుడే తేల్చుకోవాలని పేర్కొంది.
ఇంకోవైపు లెబనాన్‌తో తాము నేరుగా చర్చలు జరుపుతామని ఇజ్రాయిల్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో హర్మూజ్ జలసంధి, లెబనాన్‌పై దాడుల విషయం తొలిరోజే ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని, అదే జరిగితే చర్చలు ముందుకుసాగడం కష్టమేనన్న అభిప్రాయాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఇస్లామాబాద్‌లో ఇరాన్‌తో శనివారం జరిగే చర్చలకు అమెరికా నుండి అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ హాజరుకానున్నారు.
ఆయన బృందంలో రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త నుండి దౌత్యవేత్తగా మారిన స్టీవ్ విట్కాఫ్ (2025 నుండి మధ్యప్రాచ్యానికి అమెరికా ప్రత్యేక దూత)తో పాటు ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ కూడా ఉన్నారు. విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ ఇరాన్ బృందంలో ఉంటారు. కాగా, ఇరాన్ రాయబారి ఇస్లామాబాద్ చర్చలకు తమ దేశం నుండి ప్రతినిధులు ఈ రాత్రికే చేరుకుంటారని ఎక్స్‌లో ప్రకటించి అనంతరం దాన్ని తొలగించడం కూడా చర్చనీయాంశంగా మారింది.
ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా ఉన్న ఇరాన్ వద్ద ఉన్న శుద్ధిచేసిన యురేనియం నిల్వల గతి ఏమిటి, జలసంధి గుండా నౌకల సాధారణ రాకపోకలు ఎప్పుడు, ఎలా పునఃప్రారంభమవుతాయి, ఈ ప్రాంతంలోని సాయుధ తీవ్రవాద గ్రూపులకు మద్దతు ఇచ్చే ఇరాన్ సామర్థ్యానికి ఏమవుతుంది? అనే విషయాలపై కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
యుద్ధానికి వెళ్లే ముందు ఇరాన్‌లోని శుద్ధి చేసిన యురేనియంను నిర్మూలిస్తామని ప్రకటించిన అమెరికా, ఇజ్రాయెల్ అది సాధించలేకపోవడంతో ఇప్పుడు ఆ శుద్ధి చేసిన యురేనియం గతి ఏమిటన్న ప్రశ్నకు కూడా స్పష్టమైన సమాధానం లేదు. ఇరాన్ ఎన్నటికీ అణ్వాయుధాలను తయారు చేయలేని స్థితిలో ఉండాలని అమెరికా పట్టుబడుతున్నది. అలాగే వాటి తయారీకి ఉపయోగపడే శుద్ధిచేసిన యురేనియం నిల్వలను నిర్మూలించాలని కూడా అమెరికా కోరుతున్నది.
అయితే ఇరాన్ మాత్రం తమ కార్యక్రమం శాంతియుతమైనదని వాదిస్తున్నది. గత ఏడాది అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో భూమిలో పాతుకుపోయిన యురేనియం అణువులను తొలగించేందుకు అమెరికా ఇరాన్‌తో కలసి పనిచేస్తుందని ట్రంప్ బుధవారం చెప్పినప్పటికీ ఇరాన్ దీనిని ధృవీకరించలేదు.

More Stories
బెంగాల్ లో తొలగించిన ఓటర్లలో 63% మంది హిందువులే
ఐరోపాతో అమెరికాకు దూరం పెంచిన ట్రంప్ ఇరాన్ యుద్ధం
అసోం, కేరళ, పుదుచ్చేరిలో ప్రశాంతంగా భారీ పోలింగ్