ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. లష్కర్-ఎ-తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్‌తో లాంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాల నేపథ్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 311(2)(సి) ప్రకారం తొలగించినట్లు బుధవారం అధికార వర్గాలు తెలిపాయి. ఫర్హత్ అలీ ఖండే, మహమ్మద్ షఫీ దార్లను ఉద్యోగం నుంచి తొలగించినట్లు చెప్పాయి.
ప్రభుత్వ సంస్థల నుంచి ఉగ్రవాద శక్తులను నిర్మూలించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ‘ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్’ విధానంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ఇప్పటివరకు జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 90 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులను తొలగించారు. రాంబన్ జిల్లా విద్యాశాఖలో క్లాస్-IV ఉద్యోగి ఫర్హత్ అలీ ఖండే హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ కోసం పనిచేస్తున్నాడని అధికారులు గుర్తించారు.
ఆ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలను పునరుద్ధరించడానికి, నెట్‌వర్క్‌ల నిర్మాణానికి తన ప్రభుత్వ పదవిని ఒక ముసుగుగా వాడుకుంటున్నాడని ఆరోపణలు ఉన్నట్లు తెలిపారు. ఉగ్రవాదుల కుటుంబాలకు నిధులు పంపిణీ చేసే హవాలా నెట్‌వర్క్‌పై 2011లో జరిగిన దర్యాప్తులో ఖండే మొదటిసారిగా భద్రతా సంస్థల కంట్లో పడ్డాడు. అదే ఏడాది అతడిని అరెస్టు చేసినప్పటికీ, అతడు ఉగ్రవాద నెట్‌వర్క్‌లతో సంబంధాలు కొనసాగిస్తూ, మధ్యవర్తిగా వ్యవహరించాడని దర్యాప్తులో వెల్లడైంది.
2022లో అతడిపై ప్రత్యేక కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారని పేర్కొన్నారు. మరో ఉద్యోగి బండిపోరాకు చెందిన మహమ్మద్ షఫీ దార్ గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేస్తున్నాడని, అతడిది కారుణ్య నియామకమని అధికారులు తెలిపారు. అతడు లష్కర్-ఎ-తొయిబాకు ఉగ్రవాద సహచరుడిగా వ్యవహరిస్తున్నాడని గుర్తించారు. 2025 ఏప్రిల్‌లో జరిగిన సంయుక్త నాకా తనిఖీలో దార్ పట్టుబడ్డాడు. అతడి వద్ద నుంచి ఏకే-56 రైఫిల్, గ్రెనేడ్‌తో సహా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వర్గాలు తెలిపాయి.
అనంతరం జరిపిన విచారణలో అతడు క్రియాశీల ఉగ్రవాద సహచరుడిగా మారాడని, భద్రతా దళాలపై దాడుల ప్రణాళికలో పాలుపంచుకున్నాడని ఆరోపణలు ఉన్నట్లు తేలింది. ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఉగ్రవాదమనే క్యాన్సర్ అంతం చేసే వరకు తాను విశ్రమించబోనని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఇటీవల వ్యాఖ్యానించారు. భద్రతా సంస్థలు ఉగ్రవాద మహమ్మారిని పూర్తిగా, శాశ్వతంగా అంతం చేస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

More Stories
మతరాచారాన్ని ఓ మూఢ నమ్మకంగా కోర్టు నిర్ణయించలేదు
ఇద్దరు చిన్నారులు మృతితో మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్తత
ఎయిరిండియా బ్లాక్‌బాక్స్ డేటా కోరిన బాధితులు