భారతదేశపు వైద్య విద్య, నిపుణుల నియంత్రణ సంస్థ అయిన జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసి) చట్టబద్ధమైన నిబంధనలు, కోర్టు తీర్పులకు అనుగుణంగా, వైద్య కళాశాలలు, సంస్థలు, విశ్వవిద్యాలయాలు ఎంబిబిఎస్ కోర్సు 4.5 సంవత్సరాల విద్యా కాలానికి మాత్రమే ఫీజులను పరిమితం చేయాలని ఆదేశిస్తూ ఒక బహిరంగ ప్రకటనను జారీ చేసింది.
ఎన్ఎంసి పరిధిలోని కొన్ని వైద్య కళాశాలలు, సంస్థలు లేదా విశ్వవిద్యాలయాలు ఎంబిబిఎస్ విద్యార్థుల నుండి ఐదు సంవత్సరాలు లేదా ఐదున్నర సంవత్సరాల పూర్తి కాలానికి ఫీజులు వసూలు చేస్తున్నట్లు వచ్చిన నివేదికల నేపథ్యంలో ఈ ప్రకటన జారీచేసింది.
ఇటువంటి పద్ధతులు ఎంబిబిఎస్ కార్యక్రమం నిర్దేశిత విద్యా నిర్మాణానికి అనుగుణంగా లేవని, విద్యాపరంగా అందుబాటులో లేని కాలానికి ఫీజులు వసూలు చేయడానికి దారితీస్తాయని కమిషన్ పేర్కొంది. చట్టబద్ధమైన నిబంధనలు, నియమాలు, న్యాయ తీర్పులను ఖచ్చితంగా పాటించాలని ఆదేశిస్తూ, వీటిని పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని కమిషన్ హెచ్చరించింది.
జాతీయ వైద్య కమిషన్ చట్టం, 2019లో పొందుపరిచిన శాసనాత్మక నిబంధనలు, వర్తించే నిబంధనలు, న్యాయస్థానాలు జారీ చేసిన తీర్పులను అన్ని వైద్య కళాశాలలు ఖచ్చితంగా పాటించాలని పేర్కొంటూ వీటిని పాటించని ఏ సందర్భాన్నైనా తీవ్రంగా పరిగణించి, ప్రస్తుత శాసనాత్మక, నియంత్రణ నిబంధనల ప్రకారం కమిషన్ తగిన చర్యలు తీసుకుంటుందని ఆ నోటీసులో హెచ్చరించింది.
గ్రాడ్యుయేట్ వైద్య విద్యా నిబంధనల క్రింద రూపొందించిన సామర్థ్య ఆధారిత వైద్య విద్యా మార్గదర్శకాలు, 2024తో కలిపి చదివినప్పుడు, జాతీయ వైద్య కమిషన్ చట్టం, 2019లోని సెక్షన్ 10, సెక్షన్ 24 ప్రకారం, ఎంబిబిఎస్ కోర్సు వ్యవధిలో 4.5 సంవత్సరాల (54 నెలల) విద్యాభ్యాసం, దాని తర్వాత ఒక సంవత్సరం తప్పనిసరి రొటేటింగ్ ఇంటర్న్షిప్ ఉంటుందని గుర్తు చేసింది.

More Stories
ఉగ్రవాదులతో సంబంధం.. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు
మతాచారాన్ని ఓ మూఢ నమ్మకంగా కోర్టు నిర్ణయించలేదు
ఇద్దరు చిన్నారులు మృతితో మణిపూర్లో మరోసారి ఉద్రిక్తత