మతరాచారాన్ని ఓ మూఢ నమ్మకంగా కోర్టు నిర్ణయించలేదు  

మతరాచారాన్ని ఓ మూఢ నమ్మకంగా కోర్టు నిర్ణయించలేదు  
మతపరమైన ఆచారాన్ని ఒక మూఢ నమ్మకంగా సెక్యులర్‌కోర్టు నిర్ణయించలేదని బుధవారం సుప్రీంకోర్టుకు కేంద్రం తెలియచేసింది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఇచ్చిన తీర్పును పున సమీక్ష జరుపుతున్న విస్తృత ధర్మాసనం ముందు కేంద్రం తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు.  మతం, ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోనపుడు, ప్రభుత్వం, మతం వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదని చెప్పారు. ఒకవేళ మూఢనమ్మమే ఆచారంగా అమలవుతున్నా అది నిర్ధారించాల్సింది కోర్టు కాదని పేర్కొన్నారు.
25(2)(బి) అధికరణ కింద దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది, సంస్కరణ లతో కూడిన చట్టం చేయాల్సింది చట్టసభలని స్పష్టం చేశారు. ఇలాంటి మూఢాచారాలను పరిష్కరించేలా ఇప్పటికే అనేక చట్టాలు వచ్చాయని చెప్పారు. దీనిపై జస్టిస్‌ అమనుల్లా స్పందిస్తూ, అటువంటి మతాచారాలు మూఢనమ్మకాల కిందకు వస్తాయా? రావా? అనేది న్యాయపరంగా పరిశీలించేందుకు న్యాయస్థానాలకు అధికారం వుంటుందని చెప్పారు. అయితే అంతిమంగా పర్యవసానాలను చట్టసభలకే వదిలివేయవచ్చని తెలిపారు. 

ఇలా వాదోపవాదాలు సాగుతున్న తరుణంలో చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌ జోక్యం చేసుకుంటూ, చేతబడులు, నరమాంస భక్షణ లేదా నరబలి వంటి కొన్ని మూఢాచారాలు న్యాయస్థానం అంతరాత్మను దిగ్భ్రాంతికి గురిచేస్తే కోర్టులు జోక్యం చేసుకోవచ్చని, ప్రజల శాంతి భద్రతలకు, నైతికతలకు లేదా ఆరోగ్యానికి భంగకరమైన వాటిని న్యాయస్థానాలు అడ్డుకోవచ్చని తెలిపారు. 

కొన్ని కీలకమైన మతాచారాలను ప్రత్యేకంగా ఆ మత సిద్ధాంతాలు, ఆచారాల పరిధిలోనే అంచనా వేయగలుగుతామని, వేరే మతం ప్రామాణికాలను ఇక్కడ వర్తింపచేయలేమని జస్టిస్‌ నాగరత్న అభిప్రాయపడ్డారు. దేవాలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిషేధించడాన్ని ఏ భక్తుడూ సవాలు చేసి వుండేవారు కాదని జస్టిస్‌ నాగరత్న వ్యాఖ్యానించారు.  రిట్‌ పిటిషన్‌ వేసినవారు భక్తులు కాదని పేర్కొంటూ ఎవరు వీరు? అని ప్రశ్నించారు.

ఈ దశలో సీనియర్‌ న్యాయవాది రాజీవ్‌ జోక్యం చేసుకుంటూ ఇటువంటి వైఖరి ప్రజా ప్రయోజన వ్యాజ్యం అన్న భావనపై ప్రభావం చూపుతుందని తెలిపారు.  అనేక పిటిషన్లు సమర్ధవంతమైన సంస్థలు దాఖలు చేస్తాయని పేర్కొంటూ ఈ కేసులో యంగ్‌ఇండియన్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ సుప్రీంను ఆశ్రయించిందని తెలిపారు. ఒకవేళ భక్తులు కాని వారు అంటే ఆలయంతో సంబంధం లేనివారు ఈ తీర్పును సవాలు చేసి వుంటే ఈ కోర్టు ఆ రిట్‌ పిటిషన్‌ను స్వీకరించి వుండేదా? ముందుగా ఈ అంశాన్ని పరిష్కరించాల్సి వుందని తెలిపారు. .