ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మరోసారి హింసాత్మకంగా మారింది. మంగళవారం తెల్లవారుజామున మొయిరాంగ్ ట్రోంగ్లాబి ప్రాంతంలో ఒక నివాసంపై అనుమానిత వ్యక్తులు జరిపిన బాంబుదాడిలో ఐదేళ్ల బాలుడు, ఆరు నెలల చిన్నారి మరణించగా, తల్లికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై ఆగ్రహించిన గ్రామస్తులు ఇంఫాల్ సహా పలు ప్రాంతాల్లో ఆందోళన చేపట్టారు. రహదారులను దిగ్బంధించారు.
ఈ ప్రాంతంలో పెట్రోల్ బంక్ సమీపంలోని రెండు ఆయిల్ ట్యాంకర్స్, ట్రక్‌కు నిప్పటించారు. మోయిరాంగ్ పోలీస్ స్టేషన్ సహా ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్ జిల్లాల్లో టైర్లను తగుల బెట్టి నిరసన వ్యక్తం చేశారు. బిష్ణుపూర్ జిల్లాలోని కేంద్ర బలగాల శిబిరంపై దాడి చేశారు. ట్రోంగ్లాయోబికి సుమారు 200 మీటర్ల దూరంలో ఈ శిబిరం ఉంది. ఆగ్రహించిన పోలీసులు వారిపై కాల్పులకు దిగడంతో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో అధికారులు ఇంటర్నెట్ బంద్ చేశారు.
గతంలో ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో బిష్ణాపూర్ జిల్లా కూడా ఒకటి. ఈ ఘటనలో 19 వరకు గాయపడ్డట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలు మరింత చెలరేగకుండా అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బిష్ణుపూర్ జిల్లాలో జరిగిన ఘోరమైన బాంబు దాడిలో ఇద్దరు చిన్నారులు మరణించిన ఘటనకు సంబంధించిన దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగిస్తామని మణిపూర్ ముఖ్యమంత్రి వై. ఖేమ్‌చంద్ సింగ్ ప్రకటించారు. ముఖ్యమంత్రి ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్రంలో నెలకొన్న సున్నితమైన శాంతిని భగ్నం చేయడానికి ప్రయత్నిస్తున్న కొన్ని వర్గాల పనే ఈ దాడి అని పేర్కొన్నారు.
సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ గాలింపు చర్యల కోసం పోలీసులు, అస్సాం రైఫిల్స్, సిఆర్పిఎఫ్ తో సహా పలు భద్రతా దళాలను మోహరించారు. ఈ ఆపరేషన్‌లో హెలికాప్టర్లను కూడా వినియోగిస్తున్నారు. ఈ దాడికి పాల్పడిన వారిని వీలైనంత త్వరగా పట్టుకుంటామని ఆయన తెలిపారు. ప్రజలు సంయమనం పాటించాలని, ప్రస్తుతం జరుగుతున్న గాలింపు చర్యలకు సహకరించాలని సింగ్ విజ్ఞప్తి చేశారు.
తీవ్రమవుతున్న పరిస్థితి దృష్ట్యా, మణిపూర్ ప్రభుత్వం ఇంఫాల్ తూర్పు, ఇంఫాల్ పశ్చిమ, బిష్ణుపూర్, కాక్చింగ్ జిల్లాల్లో నిరవధిక కర్ఫ్యూను విధించింది. జిల్లా మేజిస్ట్రేట్లు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఏప్రిల్ 7 నుండి తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు రావడం నిషిద్ధం. అత్యవసర సేవలు, అత్యవసర విధులు, శాంతిభద్రతల సంస్థలకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు.

More Stories
ఎయిరిండియా బ్లాక్‌బాక్స్ డేటా కోరిన బాధితులు
ఒక్కరోజే యూఏఈ నుంచి భారత్‌కు 90 ప్రత్యేక విమానాలు
హిమాచల్ ప్రవేశ పన్నుపై పంజాబ్ టాక్సీ, ట్రక్ డ్రైవర్లు నిరసన