ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతమైన నెల్లూరు, ఒంగోలు, బాపట్ల జిల్లాల్లో తమిళనాడు రాష్ట్రానికి చెందిన మత్స్యకారుల ఆగడాలు పెరుగుతున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఆందోళన వ్యక్తం చేశారు. కడలూరు, కారేకల్ ప్రాంతాల నుంచి స్పీడ్ బోట్లలో వచ్చి అక్రమంగా ఆంధ్ర తీరప్రాంతంలోకి ప్రవేశిస్తూ స్ధానిక మత్స్యకారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఇటీవల నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ప్రాంతంలో అక్రమంగా సంచరిస్తూ దౌర్జన్యానికి పాల్పడుతున్న తమిళనాడు బోట్లను స్ధానిక మత్స్యకారులు నిర్బంధించిన ఘటన ఉద్రిక్తతకు దారితీసిందని గుర్తు చేశారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం స్పందన ఆశించినంతగా లేదని మత్స్య కారులు భావిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు.
గత వారం నిర్బంధించిన బోట్లను రాత్రికి రాత్రే విడుదల చేసి తమిళనాడుకు పంపించడం అనేక అనుమానాలకు తావిస్తోందని చెబుతూ దాడులకు పాల్పడుతున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల స్ధానిక మత్స్యకారుల్లో తీవ్ర అభద్రతా భావం నెలకొందని ఆయన తెలిపారు. తీరప్రాంత మెరైన్ పోలీస్ స్టేషన్లను ఆధునీకరించి పటిష్టం చేయాలని, స్ధానిక మత్స్యకారులను హోం గార్డులుగా భాగస్వామ్యం చేయాలని మాధవ్ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంకు సూచించారు. కోస్టల్ గార్డ్ సహకారంతో మెరైన్ పర్యవేక్షణను బలోపేతం చేయాలని చెప్పారు.

More Stories
అమరావతే రాజధాని.. చట్టబద్ధ రక్షణ ప్రక్రియ సంపూర్ణం
నౌకాదళంలోకి అణు సామర్ధ్యం గల ఐఎన్ఎస్ అరిదమాన్
ప్రపంచంలో ఉత్తమ రాజధానిగా తీర్చిదిద్దుతాం