ఏప్రిల్ 10 నుంచి టోల్‌ ప్లాజాల్లో అంతా డిజిటల్లోనే!

ఏప్రిల్ 10 నుంచి టోల్‌ ప్లాజాల్లో అంతా డిజిటల్లోనే!

జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి ఇకపై  టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏప్రిల్ 10 నుంచి టోల్ బూత్‌ల వద్ద నగదు చెల్లింపులను స్వీకరించబోమని ఉత్తర్వులు జారీ చేసింది. ఫీజు చెల్లింపులకు పూర్తిగా డిజిటల్‌ లావాదేవీలను మాత్రమే ఉపయోగించాలని భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)కు చెందిన ఒక సీనియర్ అధికారి సూచించారు. 

టోల్‌ప్లాజాల వద్ద రద్దీని తగ్గించడం, ప్రయాణ సమయాన్ని ఆదాచేయడం, రుసుముల వసూళ్లలో పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. “ఒక వాహనం సరైన ఫాస్టాగ్ లేకుండా టోల్ ప్లాజాలోకి ప్రవేశించిన సందర్భాల్లో వినియోగదారులు ఇప్పటికే యుపిఐ ద్వారా రుసుము చెల్లించవచ్చు. అయితే, ఆ వాహన వర్గానికి వర్తించే సాధారణ రుసుము కంటే 1.25 రెట్లు అధిక మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది” అని తెలిపారు. 

ఒకవేళ వాహన యజమాని లేదా డ్రైవర్ ఈ నియమం కింద నిర్దేశించిన పద్ధతిలో రుసుము చెల్లించడానికి అంగీకరించకపోతే, అటువంటి వాహనంపై నియమం 14 ప్రకారం తగిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు.టోల్ వసూలుకు ఫాస్టాగ్ విధానంగా కొనసాగుతుందని, సరైన ఫాస్టాగ్ లేకుండా వచ్చే వాహనాలకు యుపి ఐ ప్రత్యామ్నాయ చెల్లింపు మార్గంగా ఉపయోగపడుతుందని చెప్పారు. 

టోల్‌ చెల్లింపుల్లో చాలా వరకు ఫాస్టాగ్‌ ద్వారానే జరుగుతున్నాయి. దాదాపు 98 శాతం లావాదేవీలు ఈ రూపంలోనే జరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. అయితే, ఫాస్టాగ్‌ లేకపోవడం, పనిచేయకపోవడం వంటి కారణాలతో టోల్‌ప్లాజా వద్దకు వచ్చే వాహనాల నుంచి చెల్లించాల్సిన మొత్తాన్నికి రెండింతల ఫీజును తీసుకుంటున్నారు. అదే యూపీఐ ఆప్షన్‌ ఎంచుకుంటే 1.25 రెట్లు ఫీజు మాత్రమే వసూలు చేస్తున్నారు. 

ఇంకా నగదు చెల్లింపులకు అవకాశం ఉండటంతో రసీదు జారీ, చిల్లర సమస్య కారణంగా వాహన రాకపోకల సమయంలో జాప్యం జరుగుతోంది. జాతీయ రహదారుల టోల్‌ వ్యవస్థను పూర్తిగా డిజిటల్‌గా మార్చే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ చెప్పింది. ఇటీవల ఫాస్టాగ్ వార్షిక పాస్ విధానంలో 50 లక్షల మంది చందాదారులు నమోదు చేసుకుని అరుదైన మైలురాయిని కూడా  ఎన్‌హెచ్‌ఏఐ  అధిగమించింది. 

ఈ పాస్ ద్వారా వినియోగదారులు సంవత్సరానికి రూ.3,000 చెల్లించి, గరిష్ఠంగా 200 సార్లు టోల్ ప్లాజాలను దాటి ప్రయాణించవచ్చు. ఆగస్టు 15న ప్రారంభమైనప్పటి నుంచి ఈ పాస్‌ల ద్వారా మొత్తం 26.55 కోట్ల లావాదేవీలు జరిగాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా వివిధ జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై 1,150 టోల్‌ప్లాజాలు ఉన్నాయి.