భారత ఆర్థిక వ్యవస్థపై గ్లోబల్ పరిస్థితుల ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మరోసారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుందని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. మానిటరీ పాలసీ కమిటీ (ఎంఫీసీ) సమావేశం ఏప్రిల్ 6, 7, 8 తేదీల్లో జరిగింది.
దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులను సమగ్రంగా సమీక్షించిన తర్వాత కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు గవర్నర్ తెలిపారు. ఎంఫీసీ సభ్యులందరూ ఏకగ్రీవంగా రెపో రేటును 5.25 శాతం వద్ద కొనసాగించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్‌డిఎఫ్) రేటు 5 శాతం వద్ద కొనసాగుతుండగా, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) రేటు, బ్యాంక్ రేటు 5.5 శాతంగా కొనసాగుతున్నాయి.
గతంలో ఫిబ్రవరి నెలలో జరిగిన సమీక్షలో కూడా ఆర్‌బీఐ ఇదే విధమైన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలపై ఈఎంఐలు తగ్గే అవకాశాలు తగ్గిపోయాయి. వడ్డీ రేట్లలో కోత కోసం ఎదురుచూస్తున్న సామాన్యులకు ఇది నిరాశ కలిగించే అంశంగా మారింది. అయితే, 2025లో పలు దఫాలుగా వడ్డీ రేట్లలో కోతలు పెట్టింది. ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గించిన ఆర్‌బీఐ, జూన్‌లో 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది.
అనంతరం డిసెంబర్‌లో మరో 25 బేసిస్ పాయింట్ల కోత విధించింది. ఈ చర్యలతో మొత్తం మీద గత ఏడాది రెపో రేటు 1.25 శాతం మేర తగ్గింది. ప్రస్తుత నిర్ణయంపై గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని తెలిపారు. ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, సరఫరా గొలుసుల్లో అంతరాయాలు గ్లోబల్ వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని తెలిపారు.
ఈ నేపథ్యంలో చమురు ధరలు పెరుగుతుండటం ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెంచే అవకాశం ఉందని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 4.6 శాతం ఉండొచ్చని పేర్కొంది. ఇక రూపాయి విలువ పడిపోకుండా నియంత్రించడం కూడా ఆర్‌బిఐ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అదే సమయంలో ద్రవ్యోల్బణాన్ని 2 నుంచి 6 శాతం పరిధిలో (4 శాతం లక్ష్యంతో) నియంత్రించడానికి చర్యలు కొనసాగుతున్నాయి.
అయితే, ఈ సవాళ్ల మధ్య కూడా భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందని ఆర్‌బీఐ గవర్నర్ స్పష్టం చేశారు. 2026-27లో దేశ జీడీపీ వృద్ధి రేటు 6.9 శాతం వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.

More Stories
కాల్పుల విరమణతో 20 శాతం తగ్గిన క్రూడాయిల్ ధరలు
అల్-ఫలాహ్ ఛైర్మన్ రూ. 39 కోట్ల ఆస్తుల జప్తు
ఏప్రిల్ 10 నుంచి టోల్ ప్లాజాల్లో అంతా డిజిటల్లోనే!