తెలంగాణ రాష్ట్రంలో గోరక్షణ చట్టాలను మరింత కఠినంగా, సమర్థవంతంగా అమలు చేయాలని కోరుతూ విశ్వహిందూ పరిషత్ ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కలిసి వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా పరిషత్ నాయకులు మాట్లాడుతూ గోమాత భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ ఆధారిత జీవన విధానానికి ప్రతీక అని పేర్కొన్నారు.
గోవు కేవలం ఒక జంతువు మాత్రమే కాకుండా, భారతీయ జీవన తత్త్వంలో పూజనీయ స్థానం కలిగిన పవిత్ర ఆరాధ్యరూపం అని చెబుతూ ఇటీవల కాలంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గోవుల అక్రమ రవాణా, అక్రమ వధ, చట్టవిరుద్ధ మాంస రవాణా వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గోరక్షణ చట్టాల అమలుపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, గోవుల అక్రమ రవాణాపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను నియమించాలని, సరిహద్దు ప్రాంతాలు, హైవేలు, చెక్‌పోస్టుల వద్ద కఠిన తనిఖీలు చేపట్టాలని, అక్రమ వధశాలలు, అనుమతి లేని మాంస రవాణా కేంద్రాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
గో వధ, అక్రమ రవాణాలో పాల్గొనే వారిపై కఠిన శిక్షలు అమలు చేయాలని, గోశాలలకు ప్రభుత్వ పరిరక్షణ, మౌలిక సదుపాయాలు, ఆర్థిక సహాయం అందించాలని, గోరక్షణపై పోలీసు, రెవెన్యూ, పశుసంవర్ధక శాఖల సమన్వయం పెంచాలని విజ్ఞప్తి చేశారు. గోరక్షణ అనేది కేవలం మతపరమైన అంశం మాత్రమే కాకుండా, సాంస్కృతిక, ఆర్థిక, పర్యావరణ, వ్యవసాయ పరిరక్షణకు సంబంధించిన జాతీయ బాధ్యత అని వారు స్పష్టం చేశారు. విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర నాయకులు పగుడాకుల బాలస్వామి, రమేష్ , సుభాష్ చందర్, స్వామీజీలు దుర్గానంద, సర్వేశ్వర శివయోగి అంబిక, రంగనాథ్ తదితరులు ప్రధాన కార్యదర్శిని కలిసిన వారిలో ఉన్నారు.

More Stories
ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
తారామతిలో బాలీవుడ్ నటుడితో పాటు ఓ జంటకు పాజిటివ్
పదవులకోసం పార్టీ మారే వ్యక్తిని కాదు