రెచ్చగొట్టే వ్యాఖ్యలపై ఖర్గేను అరెస్ట్ చేయండి!

రెచ్చగొట్టే వ్యాఖ్యలపై ఖర్గేను అరెస్ట్ చేయండి!
 
* అస్సాంలో ఆర్ఎస్ఎస్ పై అసభ్యపు వ్యాఖ్యలపై కర్ణాటక బీజేపీ మండిపాటు 
అస్సాంలో జరిగిన ఒక ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆయనను అరెస్టు చేయాలని, ఆయనపై కేసు నమోదు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. కర్ణాటక డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎం.ఎ. సలీంకు రాసిన ఫిర్యాదులో, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలకు తగిన భద్రత కల్పించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.
 
సలీంకు రాసిన తమ లేఖలో, అస్సాంలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ ఖర్గే ఇలా అన్నారని వారు ఆరోపించారు: “నమాజ్ చేసేటప్పుడు విషసర్పం కనిపిస్తే, దానిని చంపాలని ఖురాన్‌లో వ్రాసారు. ఆర్‌ఎస్‌ఎస్/బీజేపీ ఆ విషసర్పం లాంటివి. మీరు దానిని చంపకపోతే, మీరు బ్రతకలేరు.” ఈ వ్యాఖ్య ద్వారా, ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ సభ్యులను చంపమని ఖర్గే ముస్లింలను రెచ్చగొట్టారని వారు ఆరోపించారు. 
 
కాంగ్రెస్ అధ్యక్షుడు ఖురాన్‌ను ఉటంకిస్తూ “హత్యలను సమర్థించడం” ప్రత్యేకంగా ఆందోళన కలిగిస్తోందని, ఇది సమాజంలోని “తీవ్రవాద శక్తులను హింసాత్మక చర్యలకు పాల్పడేలా ప్రోత్సహించవచ్చని” ఆ పార్టీ పేర్కొంది. “లక్షలాది మంది కార్యకర్తలపై హింసను ప్రేరేపించినందుకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను తక్షణమే అరెస్టు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము,” అని ఆ లేఖలో పేర్కొన్నారు.
 
“ఖర్గే రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల తలెత్తిన సున్నితమైన పరిస్థితి దృష్ట్యా, బీజేపీ కార్యకర్తలకు రక్షణ కల్పించేందుకు తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలి,” అని వారు కోరారు. ఈ వ్యాఖ్యను ఖండిస్తూ, బీజేపీ నాయకులు మాట్లాడుతూ, ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఖర్గే అత్యంత బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారని, ఆయన మైనారిటీ వర్గాలతో నిరంతరం మమేకమయ్యే వ్యక్తిగా గుర్తింపు పొందారని తెలిపారు. 
 
ఈ “బాధ్యతారహితమైన, రెచ్చగొట్టే వ్యాఖ్య” దేశవ్యాప్తంగా లక్షలాది మంది బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ సభ్యుల ప్రాణాలను ప్రమాదంలో పడేసిందని వారు ఆరోపించారు. బీజేపీ నాయకుల ప్రకారం, అస్సాంలో ఖర్గే చేసిన రెచ్చగొట్టే ప్రసంగం దేశవ్యాప్తంగా సంఘ్ పరివార్‌పై జరిగిన దాడితో సమానం. ఇటువంటి వ్యాఖ్యల వల్ల దేశవ్యాప్తంగా సంభవించే పరిణామాలను కొట్టిపారేయలేమని స్పష్టం చేశారు. ఇలాంటి కేసుల్లో అధికారిక ఫిర్యాదుల కోసం వేచి చూడకుండా పోలీసులు సుమోటోగా చర్యలు తీసుకోవలసి ఉంటుందని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని కూడా వారు డీజీపీకి గుర్తు చేశారు.
 
గుజరాతీయులపై వాఖ్యలపై దుమారం 
 
మరోవంక, గుజరాతీయులపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే చేసిన వ్యాఖ్యలు సహితం పెద్ద దుమారం రేపాయి. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీనియర్ బీజేపీ నాయకుడు రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, గుజరాతీలు నిరక్షరాస్యులని ఖర్గే చేసిన వ్యాఖ్యలు సిగ్గుమాలినవి, అత్యంత హేయమైనవి అని విమర్శించారు.
 
ఎన్నికలు వస్తూ పోతూ ఉంటాయి కానీ, కాంగ్రెస్ అధ్యక్షుడు అన్ని హద్దులను దాటారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ అక్షరాస్యత రేటు 82 శాతంగా ఉందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇది గణనీయంగా మెరుగుపడిందని ప్రసాద్ తెలిపారు. ఖర్గే గుజరాత్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
కాగా, గుజరాత్ ప్రజలను ‘నిరక్షరాస్యులు’ అని పేర్కొంటూ తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బుధవారం విచారం వ్యక్తం చేశారు. ఆ రాష్ట్ర ప్రజల పట్ల తనకు ఎల్లప్పుడూ అత్యంత గౌరవం ఉందని, భవిష్యత్తులో కూడా అది కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఒక ఎక్స్  పోస్టులో కాంగ్రెస్ అధ్యక్షుడు ఇలా అన్నారు:
 
“కేరళలో ఇటీవల జరిగిన ఎన్నికల ప్రసంగంలో నేను చేసిన కొన్ని వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా తప్పుగా అన్వయిస్తున్నారు. అయినప్పటికీ, నేను నా ప్రగాఢ విచారం వ్యక్తం చేస్తున్నాను. గుజరాత్ ప్రజల మనోభావాలను దెబ్బతీయడం నా ఉద్దేశం ఎన్నడూ కాదు. వారి పట్ల నాకు ఎల్లప్పుడూ అత్యంత గౌరవం ఉంది, ఇకపైనా ఉంటుంది.”  కేరళలో తన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో, గుజరాత్ ప్రజలను “నిరక్షరాస్యులు” అని పిలుస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారిని “మోసం” చేస్తున్నారని ఆరోపించి ఖర్గే వివాదాన్ని రేకెత్తించారు.