పశ్చిమాసియా సంక్షోభం కారణంగా దేశంలో నిత్యావసర వస్తువుల ధరల్లో ఎటువంటి అసాధారణ హెచ్చుతగ్గులేమీ లేవని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లలో ధరలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపింది. ప్రజా పంపిణీ వ్యవస్థ అవసరాలకు, అలాగే ఏవైనా అత్యవసర పరిస్థితులకు సరిపడా గోధుమలు, బియ్యం నిల్వలు తమ వద్ద ఉన్నాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి అనుపమ్ మిశ్రా స్పష్టం చేశారు.
“దేశంలో ఆహార భద్రత పరిస్థితిని వినియోగదారుల వ్యవహారాల శాఖ నిశితంగా గమనిస్తోంది. ఆహార పదార్థాల ధరలను పర్యవేక్షిస్తున్నాం. అలాగే ఆహార పదార్థాల నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను నిరోధించడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఉన్న 528 కేంద్రాల నుంచి వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రతిరోజూ 40 రకాల వస్తువుల ధరలను పొందుతుంది” అని తెలిపారు.
“హోల్‌సేల్, రిటైల్ ధరలు మొబైల్ యాప్‌లో అప్టేట్ చేస్తున్నాం. ఇప్పటివరకు మేము గమనించిన వరకు నిత్యావసర వస్తువుల ధరల్లో ఎటువంటి అసాధారణ హెచ్చుతగ్గులు లేవు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పప్పుధాన్యాల ఉత్పత్తి ఎక్కువగా ఉంది. ప్రభుత్వం వద్ద 28 లక్షల టన్నుల పప్పుధాన్యాల బఫర్ స్టాక్ ఉంది. ఉల్లిపాయలు, బంగాళదుంప, టమాటొల ఉత్పత్తి దాదాపు గతేడాది స్థాయిలోనే ఉంది” అని అనుపమ్ మిశ్రా వివరించారు
“ఎల్పీజీ విషయంలో పరిస్థితి మరింత సంక్లిష్టంగా ఉంది. దేశ ఎల్పీజీ దిగుమతుల్లో గణనీయమైన భాగం అంటే సుమారు 60 శాతం గతంలో ఒక నిర్దిష్ట ప్రాంతం నుంచి దిగుమతి అయ్యేది. ప్రస్తుతం ఆ ప్రాంతం భౌగోళిక రాజకీయ అస్థిరతతో ప్రభావితమైంది. దీంతో ఎల్పీజీ దిగుమతుల్లో తగ్గుదల కనిపిస్తోంది. ఇది కొంత ఆందోళన కలిగించే విషయం” అని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ తెలిపారు.

More Stories
భారత ఆర్థిక వ్యవస్థకు మరిన్ని సవాళ్లు
చమురు ధరలతో రిలయన్స్ షేర్లకు సెగ
అరుణాచల్ సీఎం కుటుంభ సంస్థలపై సీబీఐ దర్యాప్తు