పవన్ ఖేడా ఇంటికి అస్సాం పోలీసులు

పవన్ ఖేడా ఇంటికి అస్సాం పోలీసులు
 
అస్సాం అసెంబ్లీ ఎన్నికల వేళ దగ్గర పడుతుండగా రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సతీమణి రిణికి భూయాన్ శర్మ పాస్‌పోర్ట్‌పై కాంగ్రెస్ చేసిన ఆరోపణలు ఇప్పుడు అరెస్టుల వరకు వెళ్లాయి. కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేడా నివాసానికి మంగళవారం అస్సాం పోలీసుల బృందం చేరుకోవడం జాతీయ రాజకీయాల్లో కలకలం రేపింది. 
 
ఇటీవల జరిగిన ఓ విలేకరుల సమావేశంలో పవన్ ఖేడా మాట్లాడుతూ అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సతీమణి రిణికి భూయాన్ శర్మకు మూడు వేర్వేరు దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఆమెకు ఉన్న ఆస్తుల వివరాలను సీఎం తన ఎన్నికల అఫిడవిట్‌లో కావాలనే దాచి పెట్టారని విమర్శించారు. భారత్ లాంటి దేశంలో ద్వంద్వ పౌరసత్వానికే తావు లేదని, అలాంటిది ఒకే వ్యక్తికి మూడు పాస్‌పోర్టులు ఎలా ఉంటాయని ఆయన ప్రశ్నించారు.
 
తనపై వచ్చిన ఆరోపణలను రిణికి భూయాన్ శర్మ తీవ్రంగా ఖండించారు. పవన్ ఖేడా నిరాధారమైన, తప్పుడు ఆరోపణలు చేస్తూ తమ కుటుంబ పరువుకు భంగం కలిగిస్తున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా ఇలాంటి ప్రచారాలు చేస్తోందని ఆమె మండిపడ్డారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన అస్సాం పోలీసులు విచారణ నిమిత్తం నేరుగా ఢిల్లీలోని పవన్ ఖేడా నివాసానికి చేరుకున్నారు. 
అస్సాం నుంచి వచ్చిన ప్రత్యేక పోలీస్ బృందం మంగళవారం ఉదయం ఖేడా నివాసానికి వెళ్లిన సమయంలో ఆయన ఇంట్లో లేరని సమాచారం. దీంతో పోలీసులు ఆయన కోసం అక్కడే వెతికి, వెనక్కు వెళ్లిపోయారు. ఖేడా అందుబాటులోకి వచ్చిన వెంటనే ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  “మేము కేసు నమోదు చేసి ఖేరా కోసం వెతుకుతున్నాము. అతని ఇంటిని సోదా చేయగా, నేరారోపణకు దారితీసే పత్రాలు లభించాయి, వాటిని స్వాధీనం చేసుకున్నాము. అతడిని పట్టుకుంటాము,” అని  పవన్ ఖేరా ఎఫ్‌ఐఆర్ కేసు ఉధృతమవుతున్నట్లు సూచిస్తూ అస్సాం పోలీసు అధికారులు సంఘటనా స్థలంలో తెలిపారు. 
ఇదిలా ఉండగా, పవన్ ఖేరా ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించిన రాజకీయ ఘర్షణను మరింత తీవ్రతరం చేస్తూ, ఖేరా “హైదరాబాద్‌కు పారిపోయాడు” అని హిమంత బిస్వా శర్మ ఎద్దేవా చేశారు. కాగా, “ప్రజా ప్రయోజనాల” కోసం ప్రశ్నలు లేవనెత్తినందుకు ఖేరాను లక్ష్యంగా చేసుకుని పోలీసు బృందాన్ని మోహరించడం, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ “కలత చెందారని, నిరాశకు గురయ్యారని, కలవరపడ్డారని” చూపిస్తోందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేష్ విమర్శించారు. “ఇది చట్టబద్ధమైన ప్రక్రియ కాదు, కక్ష సాధింపు చర్య. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటున్నారు,” అని ఆయన ధ్వజమెత్తారు.
గతంలో కూడా ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ ఖేడాను విమానాశ్రయంలోనే అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు మరోసారి అదే తరహాలో అరెస్టుకు రంగం సిద్ధం కావడంతో ఢిల్లీలో ఉద్రిక్తత  నెలకొంది. అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. పాస్‌పోర్ట్, ఆస్తుల వివాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తుండగా,  చట్టపరమైన చర్యల ద్వారా దీన్ని తిప్పికొట్టాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. చూడాలి మరి ఈ ఎన్నికలు ఎవరు గెలుస్తారనేది.