ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ సంపూర్ణమైంది. ఇప్పటికే పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందిన ఈ బిల్లుపై రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు-2026 సోమవారం ఉదయం రాష్ట్రపతి భవన్కు చేరింది. సాయంత్రానికే దీనిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. రాత్రి 10 గంటలకల్లా ‘గెజిట్ నోటిఫికేషన్’ కూడా వెలువడింది.
దీంతో ‘అమరావతి’కి కేంద్ర స్థాయిలో చట్టబద్ధమైన రక్షణ లభించినట్లయింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర అనంతరం భారత ప్రభుత్వ కార్యదర్శి రాజీవ్ మణి ఈ గెజిట్ను విడుదల చేశారు. 2014నాటి రాష్ట్ర పునర్విభజన చట్టంలో ‘పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఆ తర్వాత ఏపీకి ఒక కొత్త రాజధాని ఉంటుంది’ అని పేర్కొనగా, సవరణ చట్టంలో ‘ఏపీకి అమరావతి కొత్త రాజధానిగా ఉంటుంది’ అంటూ స్పష్టమైన వివరణ ఇచ్చారు.
అలాగే సీఆర్డీయే చట్టం-2014 కింద నోటిఫై చేసిన ప్రాంతమంతా ‘అమరావతి’ పరిధిలోకి వస్తుందని మరో సవరణ చేశారు. వెరసి, 2024 జూన్ 2 నుంచే రాజధానిగా అమరావతి అమలులోకి వచ్చినట్లయింది. రాజధాని అమరావతికి చట్టబద్ధమైన రక్షణ కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కేంద్రంతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి.
ఈ ప్రక్రియ మరింత పకడ్బందీగా జరిగేలా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలని కేంద్రం సూచించింది. దీంతో మార్చి 28న శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైంది. 2024 జూన్ 2 నుంచే అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తించేలా చట్ట సవరణ చేయాలంటూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆ మేరకు 2014 చట్టంలోని సెక్షన్ 5లోని సంబంధిత సబ్ సెక్షన్లలో సవరణ చేయాలని కేంద్రాన్ని కోరింది.
ఆ వెంటనే కేంద్రమూ కదిలింది. లోక్సభలో ఈ నెల 1, రాజ్యసభలో 2వ తేదీన చట్ట సవరణ బిల్లుపై ఆమోద ముద్ర పడింది. దాదాపు 4.30 గంటలపాటు ఉభయసభలలో సవరణ బిల్లుపై చర్చ జరిగింది. ఇది సోమవారం రాష్ట్రపతి భవన్ చేరడం, రాత్రికే గెజిట్ నోటిఫికేషన్ జారీ కావడం విశేషం.

More Stories
నౌకాదళంలోకి అణు సామర్ధ్యం గల ఐఎన్ఎస్ అరిదమాన్
ప్రపంచంలో ఉత్తమ రాజధానిగా తీర్చిదిద్దుతాం
అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం