* రాహుల్ విమర్శలను పట్టించుకోని సీనియర్లు
`ఆపరేషన్ సిందూర్’ తర్వాత ఇరాన్ యుద్ధం, ఎల్పీజీ సరఫరా పరిస్థితి వంటి అంశాలు కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలకు దారితీసినట్లు కనిపిస్తున్నది. మధ్యప్రాచ్య యుద్ధం, భారతదేశంలో ఇంధన సరఫరా పరిస్థితిని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్వహించిన తీరుపై రాహుల్ గాంధీ అభిప్రాయంతో, కమల్ నాథ్, ఆనంద్ శర్మ, శశి థరూర్, మనీష్ తివారీలతో సహా పలువురు సీనియర్ నాయకులు విభేదిస్తున్నారు.
లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ అయిన రాహుల్ గాంధీ, అమెరికా-ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం విషయంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న దౌత్య వైఖరిపై పదేపదే విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు మాత్రం ఆయనతో విభేదిస్తూ, ఈ పరిస్థితిని ప్రభుత్వం ఎదుర్కొంటున్న తీరును పదేపదే ప్రశంసించడం గమనార్హం. యుద్ధం విషయంలో వారు రాహుల్‌తో బహిరంగంగానే విభేదిస్తున్నారు.
విదేశాంగ విధానంలో ప్రధాని మోదీ రాజీ పడ్డారని రాహుల్ ఇటీవల విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుమతి లేకుండా భారత్ ఏ దేశం నుంచీ చమురు కొనలేదని ఎద్దేవా చేశారు. చమురు, గ్యాస్ ఎక్కడ కొనాలో చెప్పడానికి అసలు డొనాల్డ్ ట్రంప్ ఎవరని కేరళ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రశ్నించారు. అయితే, పలువురు కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే రాహుల్ గాంధీకి విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారు. ఈ విషయంలో ప్రధాని మోదీ విధానాలకు మద్దతు వ్యక్తం చేస్తున్నారు.
పశ్చిమాసియా యుద్ధం, ఎల్పీజీ సంక్షోభంపై కనీసం నలుగురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ ప్రకటనలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. వీరిలో కమల్ నాథ్, ఆనంద్ శర్మ, శశి థరూర్, మనీష్ తివారీ ఉన్నారు. ఈ అంశాలపై రాహుల్ గాంధీ నేరుగా ప్రధానిని లక్ష్యంగా చేసుకుంటుండగా, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశ విదేశాంగ విధానాన్ని ప్రశంసిస్తున్నారు.
పశ్చిమాసియా యుద్ధం గురించి ఒక టీవీ న్యూస్ ఛానల్లో మాట్లాడుతూ, కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ, ప్రభుత్వం బహుశా సరైన పనే చేస్తోందని చెప్పారు. గురువారం, కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ భారతదేశ దౌత్య విధానాన్ని పరిణతి చెందినదిగా, నైపుణ్యంతో కూడినదిగా ప్రశంసించారు. మరోవైపు, గ్యాస్ సంక్షోభంపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ మాట్లాడుతూ, అటువంటి కొరత ఏమీ లేదని, కేవలం ఒక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని తెలిపారు.
“సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో భారతదేశం అనుసరించిన దౌత్య విధానం వివేకవంతమైనది. ఇది రాగాల ఇబ్బందులను నివారించింది” అని ఆనంద్ శర్మ ఒక పోస్ట్‌లో రాశారు. ‘అనూహ్యమైన, అస్థిరమైన పరిస్థితి’లో విధాన నిర్ణయాల గురించి రాజకీయ నాయకులకు తెలియజేయడానికి ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని కూడా నిర్వహించిందని ఆయన గుర్తు చేశారు.
ఈ జాతీయ చర్చలు కొనసాగాలని చెబుతూ జాతీయ ఐక్యత, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పరిణతితో స్పందించడం ప్రస్తుత అవసరం అని స్పష్టం చేశారు. ఈ పోస్ట్‌ను బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ కూడా షేర్ చేశారు. ఎల్పిజి కొరతపై వచ్చిన పలు నివేదికలపై కమల్ నాథ్ మాట్లాడుతూ, “అలాంటి కొరత ఏమీ లేదు. కొరత ఉందనే వాతావరణాన్ని సృష్టిస్తున్నారు అంతే” అని పేర్కొన్నారు.
రాజకీయ లబ్ధి కోసం కొందరు కావాలనే భయాందోళనలు సృష్టిస్తున్నారని కమల్ నాథ్ ఆరోపించారు. ఈ ప్రకటనపై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా స్పందిస్తూ దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత లేదని కాంగ్రెస్ నాయకులే స్వయంగా అంగీకరిస్తున్నారని ఆయన ఒక పోస్ట్‌లో ఎద్దేవా చేశారు. పశ్చిమ ఆసియా యుద్ధంలో భారతదేశం సంయమనం వ్యూహాత్మక వివేకాన్ని చూపిస్తుందని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక వ్యాసంలో రాశారు. పైగా, ఈ విషయంలో మౌనం పిరికితనం కాదని, మన జాతీయ ప్రయోజనాలు ఈ ప్రాంతంతో ముడిపడి ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలని ఆయన హితవు చెప్పారు.
అయితే, రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “రాబోయే కాలంలో ఇంధనం ఒక పెద్ద సమస్యగా మారబోతోంది, ఎందుకంటే మన ఇంధన భద్రత దెబ్బతింది. తప్పుడు విదేశాంగ విధానం కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు మనం సిద్ధం కావాలి. మనకు ఇంకా కొంచెం సమయం ఉంది, కాబట్టి ప్రభుత్వం, ప్రధానమంత్రి వెంటనే సన్నాహాలు ప్రారంభించాలి. లేకపోతే, కోట్లాది మంది ప్రజలు భారీ నష్టాలను చవిచూడవచ్చు” అని హెచ్చరించారు.
“సమస్య ఏమిటంటే, ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రిలా పనిచేయలేకపోతున్నారు. దీని వెనుక కూడా కారణాలు ఉన్నాయి. ఆయన ఇరుక్కుపోయారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనం” అంటూ పారిశ్రామిక ఇంధన ధరల పెరుగుదలపై రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.
గత ఏడాది ఏప్రిల్‌లో జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో 26 మంది పర్యాటకులను బలిగొన్న ఉగ్రదాడికి ప్రతీకారంగా, 2025 మే 7న భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ ప్రారంభించి పాకిస్థాన్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడి చేసిన తర్వాత కూడా కాంగ్రెస్ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. అప్పుడు శశి థరూర్ పార్టీ ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు.
అదే సమయంలో రాహుల్ గాంధీ ప్రభుత్వ ‘రాజకీయ సంకల్పాన్ని’ విమర్శించారు. ఆపరేషన్ సింధూర్‌పై రాహుల్ గాంధీ, ప్రభుత్వానికి రాజకీయ సంకల్పం కొరవడిందని ఆరోపించారు. ఉగ్రవాదానికి గట్టి దెబ్బ కొట్టడం కోసం కాకుండా, ప్రధాని మోదీ ప్రతిష్టను కాపాడటానికే ఈ దాడులు జరిగాయని కూడా ఆయన పేర్కొన్నారు.
ఈ వైఖరికి భిన్నంగా, థరూర్, తెవారీ ఇద్దరూ ఈ ఆపరేషన్‌ను, భారత సాయుధ దళాల పరాక్రమాన్ని ప్రశంసించారు. వారు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ప్రకటనల నుండి తమను తాము దూరంగా ఉంచుకున్నారు. ఈ పరిణామాల ఫలితంగా, 2025లో ‘ఆపరేషన్ సింధూర్’పై జరిగిన పార్లమెంటరీ చర్చ సందర్భంగా, తెవారీ, థరూర్ ఇద్దరికీ కాంగ్రెస్ పార్టీ మాట్లాడే అవకాశం ఇవ్వలేదు.

More Stories
కొలంబో నుంచి ఇరాన్‌కు మృతదేహాలు, కొచ్చి నుంచి నావికులు
హిందూ పోలీస్ ను చంపిన బంగ్లా విద్యార్థి నేత ఢిల్లీలో పట్టివేత
ఉన్నావ్ అత్యాచార కేసులో సుప్రీంకు సీబీఐ