గల్లంతైన పైలట్‌ను రక్షించాం.. రెస్క్యూ విమానం కూల్చివేత

గల్లంతైన పైలట్‌ను రక్షించాం.. రెస్క్యూ విమానం కూల్చివేత
ఇరాన్‌ తో జరుగుతున్న యుద్ధంలో ఇటీవల కూలిపోయిన యుద్ధ విమానం ‘ఎఫ్-15ఈ స్ట్రైక్‌ ఈగల్‌’ ఘటనలో గల్లంతైన రెండో పైలట్‌ను అమెరికా దళాలు గుర్తించి రక్షించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ప్రకటించారు. దేశ చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్‌ను తమ సైన్యం విజయవంతంగా పూర్తి చేసిందని, ప్రస్తుతం ఆ పైలట్ అమెరికా బలగాల ఆధీనంలోనే సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు.
 
అయితే రెండో పైలట్‌ కోసం చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న  సి-130 అమెరికా విమానాన్ని తాము కూల్చివేశామని ఇరాన్‌ తెలిపింది.  తాము కూల్చిన యుద్ధ విమానం నుంచి గల్లంతైన పైలట్‌ కోసం గాలిస్తున్న అమెరికా రెస్క్యూ విమానాన్ని ఇస్ఫహాన్‌ దక్షిణ ప్రాంతంలో ఐఆర్‌జీసీ దళాలు ధ్వంసం చేశాయని ఇరాన్‌ మీడియా పేర్కొన్నది. 
కూలిపోయిన యుద్ధ విమానానికి చెందిన పైలట్‌ కోసం గాలింపు జరుపుతున్న అమెరికా రెస్క్యూ విమానం సి-130ని ఇస్ఫహాన్‌ దక్షిణ ప్రాంతంలో ఐఆర్‌జిసి ధ్వంసం చేసింది.
ఖతార్‌ మీడియా కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. గాలింపు చర్యలు చేపట్టిన విమానాలకు రీఫ్యూయలింగ్‌ చేయడానికి సి-130 వచ్చింది. అయితే అందులోని సిబ్బంది ఏమైందీ తెలియలేదు. గాలింపు సమయంలో ఇరాన్‌ దళాలు అనేక అమెరికా విమానాలను ధ్వంసం చేశాయి. ఈ సందర్భంగా ఇరాన్‌ దళాలు జరిపిన దాడులలో ఐదుగురు చనిపోయారు. కూల్చివేతకు గురైన వాటిలో సి-130 విమానంతో పాటు రెండు బ్లాక్‌హాక్‌ హెలికాప్టర్లు కూడా ఉన్నాయి.
 
ఇరాన్ కూల్చివేసిన ఎఫ్-15 విమాన సిబ్బందిలో రెండవ వ్యక్తిని తాము రక్షించామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన తర్వాత, దక్షిణ ఇస్ఫహాన్‌లో అమెరికా “తీవ్ర పరాజయం” చవిచూసిందని ఇరాన్ ఖతమ్ అల్-అన్బియా కేంద్ర ప్రధాన కార్యాలయ ప్రతినిధి ఇబ్రహీం జొల్ఫఘారి ఆదివారం పేర్కొన్నారు.  ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న ఒక సి-130 తరగతి విమానాన్ని కూల్చివేసిన తర్వాత ఇరాన్ దీనిని తమ విజయంగా ప్రకటించుకుంది.
జొల్ఫఘారి మాట్లాడుతూ, “దక్షిణ ఇస్ఫహాన్‌లో అమెరికా దురాక్రమణదారులపై ఇరాన్ దళాలు జరిపిన వీరోచిత చర్యలు అమెరికా సైన్యం డొల్లతనాన్ని, దాని దళాల అవమానకరమైన వైఫల్యాన్ని వెల్లడిస్తున్నాయి. ప్రజల్లో గందరగోళం సృష్టించడం ద్వారా ట్రంప్ తన బలహీనమైన సైన్యం  తీవ్ర ఓటమిని సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు” అని తెలిపారు.

కాగా, ఇరాన్‌లోని ప్రమాదకరమైన పర్వతాల్లో అతడిని గుర్తించినట్లు ట్రంప్‌ పేర్కొన్నారు. ఓ వైపు శత్రువులు అతడి కోసం వేట సాగిస్తుంటే మరోవైపు అతడి కమాండర్‌ ఇన్‌ చీఫ్‌, యుద్ధ కార్యదర్శి, జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌, ఇతర అమెరికా యోధులు అతడి లొకేషన్‌ను 24 గంటలూ గమనిస్తూనే ఉన్నారని వెల్లడించారు.  పైలట్‌ను తీసుకురావడానికి తాను డజన్ల కొద్దీ విమానాలను పంపానని, తమ రక్షణ చర్యలకు ఆటంకం కలగకూడదనే ఈ విషయాన్ని బహిర్గతం చేయలేదని పేర్కొన్నారు.

శత్రు భూభాగంలోకి వెళ్లి ఎయిర్‌మెన్‌ రక్షించడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారని చెబుతూ ఏ అమెరికన్ యోధుడిని ఎప్పటికీ ఒంటరిగా వదిలిపెట్టమని ప్రజలకు హామీ ఇచ్చారు.  పైగా, ఇరాన్‌ కూల్చేసిన ఫైటర్ జెట్‌ పైలట్‌ రక్షణ సందర్భంగా రెండు సొంత యుద్ధ విమానాలను ధ్వంసం చేసుకున్నట్లు అమెరికా ప్రకటించింది. అయితే వాటిని తామే కూల్చినట్లు ఆధారాలను ఇరాన్‌ చూపించింది. 

ఇరాన్‌ సీనియర్‌ అధికారులను చంపేశాం

మరోవంక, ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌పై జరిపిన దాడులలో ఆ దేశానికి చెందిన పలువురు సీనియర్‌ సైనికాధికారులు చనిపోయారని ట్రంప్‌ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్‌ సోషల్‌ రాసుకొచ్చారు. దాడికి సంబంధించి ఒక నిమిషం ఏడు సెకన్ల నిడివి కలిగిన వీడియోను కూడా ఆయన షేర్‌ చేశారు. అందులో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. ఆకాశంలో దట్టమైన పొగలు అలముకున్నాయి. అయితే ఈ దాడులు ఎప్పుడు జరిగిందీ ట్రంప్‌ వెల్లడించలేదు. 

తమతో ఒప్పందం చేసుకొని, హర్మూజ్‌ జలసంధిని తెరవని పక్షంలో నరకాన్ని చవిచూడాల్సి ఉంటుందంటూ హెచ్చరిక జారీ చేసిన తర్వాత ట్రంప్‌ ఈ వీడియోను విడుదల చేయడం గమనార్హం. ఇరాన్‌ కూడా ఈ దాడులపై ఇంతవరకూ స్పందించలేదు. ఇదిలావుండగా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్‌ కమాండర్‌ ఖస్సెమ్‌ సోలైమని బంధువుగా గుర్తించిన ఓ మహిళ శాశ్వత నివాస హోదాను అమెరికా రద్దు చేసింది.