పదవులకోసం పార్టీ మారే వ్యక్తిని కాదు 

పదవులకోసం పార్టీ మారే వ్యక్తిని కాదు 
పదవుల కోసం తాను పార్టీలు మారే వ్యక్తిని కాదని బీజేపీ ఎంపీ, పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. తాను, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ పార్టీ మారుతున్నట్లు కరీంనగర్‌లో పోస్టర్లు వేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  పార్టీలు మారకూడదని తానే సందేశం ఇచ్చానని గుర్తు చేస్తూ “పార్టీలు మారడం, దుస్తులు మార్చుకున్నంత తేలిక కాదు. నా గురించి తెలంగాణ సమాజానికి తెలుసు. అయినా, కొంతమంది వెకిలి ప్రయత్నాలు చేస్తున్నారు” అని తీవ్రంగా విమర్శించారు.
 
అయితే, 25 ఏళ్లు ఉన్నా కాబట్టి అత్యధికంగా పరిచయం ఉన్నవారు, అభిమానించే వారు బిఆర్ఎస్ లో ఉన్నారని, అందుకనే ఇటువంటి ఊహాగానాలు వస్తున్నాయని తెలిపారు.  `ఈటలను పోగొట్టుకొని కేసీఆర్ తప్పు చేశారని ప్రజలు అంటున్నారు.. పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మళ్ళీ వీళ్లందరూ కెసిఆర్ తో కలుస్తారు అని చర్చ జరుగుతుంది’ అని పేర్కొంటూ ఇలాంటి పిచ్చి ప్రచారాలు చేయద్దని ఆయన అభ్యర్ధించారు.
 
“దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ మంత్రి పదవి కావాలో కోరుకో రాజేంద్రా.. ఇస్తా.. అని పేర్కొంటూ కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినా. అదీ నా చిత్తశుద్ధి” అని తెలిపారు.  “కేసీఆర్‌, నన్ను మెడలు పట్టి బీఆర్‌ఎస్‌ నుంచి బర్తరఫ్‌ చేసి ఐదేళ్లవుతుంది. నా వ్యక్తిత్వ హననానికీ పాల్పడ్డారు. తనకున్న అధికార బలంతో రాత్రికిరాత్రి నా వ్యాపార షెడ్‌లను కూలగొట్టించారు. భూములు లాక్కున్నారు. అలాంటి నాయకుడి పార్టీలోకి తిరిగి వెళతానా?” అని ఈటల ప్రశ్నించారు. 
 
 “నాతో పాటు రాజగోపాల్‌రెడ్డి, వివేక్‌, పొంగులేటి, తుమ్మల, జూపల్లి, జితేందర్‌రెడ్డి అంతా కూడా కేసీఆర్‌ బాధితులే. ఆయన్ను ఓడించేందుకు 2023లో ఒక వేదిక ఏర్పాటు చేసుకోవాలనుకున్నాం. అయితే, ఆ వేదిక, కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు సరిపోదని భావించాం” అని గుర్తు చేశారు.  “అందుకే వారంతా కాంగ్రెస్‌లోకి వెళ్లారు. నేను కూడా వెళ్లాల్సి ఉన్నా వెళ్లలేదు. ఒకవేళ పదవి కోసమే అయితే వారితో పాటు వెళ్తే, ఈపాటికి డిప్యూటీ సీఎం లేదా మంత్రిని అయ్యేవాడిని కదా” అని ఈటల ప్రశ్నించారు. సోషల్‌ మీడియా వేదికగా తాను బీఆర్‌ఎ్‌సలోకి వెళుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు 
 
న్యాయపరంగా తనకున్న భూములు, ఆస్తులపై బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెరబట్టిందని పేర్కొంటూ, దీనిపై మీ అభిప్రాయమేంటో చెప్పాలని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి లేఖ రాస్తానని ఈటల వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అబద్ధాల పునాదు మీదనే గెలిచారని, అబద్ధపు పునాదులపైనానే ఆయన పాలన కొనసాగిస్తున్నారని స్పష్టం చేశారు.  గత ప్రభుత్వం లో దోచుకున్నది అంతా కక్కిస్తా అని అప్పుడు రేవంత్ రెడ్డి అన్నారని గుర్తు చేస్తూ, ఇప్పుడు ఎందుకు కక్కించడం లేదని ఈటెల ప్రశ్నించారు.