* హార్మూజ్ జలసంధిలో ఎక్కువగా భారత్ నౌకలే ప్రయాణం
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా భారత నౌకల రాకపోకలు నిరంతరాయంగా సాగుతున్నాయి. తాజాగా ‘గ్రీన్ ఆశా’ అనే భారత ఎల్పీజీ నౌక హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. శనివారం గ్రీన్ శాన్వి ఈ జలసంధిని, దాటగా ఆదివారం గ్రీన్ ఆశా దాటింది. గ్రీన్ శాన్వి హర్మూజ్‌ను దాటిన 8వ భారత నౌక కాగా, గ్రీన్ ఆశా 9వ భారత నౌక కావడం గమనార్హం.
పశ్చిమాసియాలో సంక్షోభం మొదలైనప్పటి నుంచి హర్మూజ్ జలసంధి గుండా నౌకల రవాణాను ఇరాన్ అడ్డుకుంటోంది. భారత్ సహా కొన్ని మిత్రదేశాల నౌకలను మాత్రమే అనుమతిస్తున్నది. ఇలాంటి సమయంలోనూ భారత దేశానికి చెందిన అత్యధిక నౌకలు ఈ జలసంధిని దాటాయి. ఇప్పటి వరకు మొత్తంగా 9 నౌకలు హార్మూజ్ గుండా ప్రయాణించి సురక్షితంగా ప్రయాణించాయి.
ఈ నౌకల సంఖ్య మిగతా దేశాలకు చెందిన నౌకలకంటే ఎక్కువ కావడంతో భారత్ దౌత్య విజయాన్ని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. భారత ప్రభుత్వం ఇరాన్ అధికారులతో జరిపిన నిరంతర చర్చల ఫలితంగా భారత నౌకలకు మార్గం సుగమమైంది. ఇరాన్ ఇప్పటికే అంతర్జాతీయ సముద్రయాన సంస్థ (ఐఎమ్ఓ)కు లేఖ రాస్తూ తమకు శత్రుత్వం లేని దేశాల నౌకలను తమ అధికారులకు సహకరిస్తే అనుమతిస్తామని స్పష్టం చేసింది.
అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాల నౌకలకు అనుమతి లేకపోయినా, భారత్ వంటి మిత్రదేశాలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత ఇంధన అవసరాలకు కీలకమైన ఎల్‌పీజీ, ముడి చమురును మోసుకొస్తున్న నౌకలు ఒక్కొక్కటిగా భారత తీరాలకు సురక్షితంగా చేరుకుంటున్నాయి. మార్చి 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు 92,612 టన్నుల ఎల్‌పీజీతో పైన్ గ్యాస్, జగ్ వసంత్ నౌకలు భారత దేశానికి చేరుకున్నాయి.
అంతకుముందు సుమారు 92,712 టన్నుల ఎల్‌పీజీని తీసుకువస్తున్న ఎంటీ శివాలిక్, ఎంటీ నందాదేవి నౌకలు మార్చి 16వ తేదీన గుజరాత్‌లోని ముంద్రా, మార్చి 17వ తేదీ కాండ్లా పోర్టులకు చేరుకున్నాయి. అలాగే యూఏఈ నుంచి 80,886 టన్నుల ముడి చమురుతో వచ్చిన జగ్ లాడ్కీ మార్చి 18న ముంద్రా పోర్టుకు సురక్షితంగా చేరింది. ఈ వాణిజ్య నౌకలకు ఏదైనా ప్రమాదం వాటిల్లితే తక్షణమే స్పందించేందుకు భారత్ యుద్ధ నౌకలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ రక్షణ కల్పిస్తున్నాయి.

More Stories
ఆర్థిక వృద్ధి అంచనాలను 6 శాతానికి తగ్గించిన మూడీస్
పాక్ ను వెంటనే 3.5 బిలియన్ డాలర్ల అప్పు తీర్చమన్న యూఏఈ
ఆఫ్రికాలో చిన్న దేశం అంగోలా నుంచి భారత్ కు చమురు