అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమాఖండూ కుటుంబానికి చెందిన సంస్థలపై సుప్రీంకోర్టు సోమవారం సీబీఐ విచారణకు ఆదేశించింది. రెండువారాల్లోగా లిఖితపూర్వక నివేదికను సమర్పించాలని జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి.అంజారియాలతో కూడిన ధర్మాసనం సిబిఐని ఆదేశించింది. 2015 జనవరి నుండి 2025 డిసెంబర్ మధ్య కాలానికి సంబంధించి ప్రజా పనులు, ఒప్పందాలు, కాంట్రాక్టుల అమలును ప్రాథమిక విచారణ పరిధిలోకి తీసుకోనుంది.
సిబిఐకి పూర్తి సహకారం అందించాలని, ప్రత్యేక నోడల్ అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. రికార్డులు ధ్వంసం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. 16 వారాల్లోగా దర్యాప్తుపై స్టేటస్ రిపోర్ట్‌ను సమర్పించాలని సిబిఐని కోరింది. ప్రభుత్వ కాంట్రాక్టులు, టెండర్లను ముఖ్యమంత్రి తన భార్య, తల్లి, మేనల్లుడికి చెందిన సంస్థలకు కేటాయించారంటూ ‘సేవ్ మాన్ రీజియన్ ఫెడరేషన్’, ‘వాలంటరీ అరుణాచల్ సేన’ పిటిషన్లు దాఖలు చేశాయి.
పేమా ఖండుకు సన్నిహితంగా ఉండే వ్యక్తులకు -ముఖ్యంగా భార్యతో సంబంధం ఉన్న నిర్మాణ సంస్థ మిసెస్ బ్రాండ్ ఈగల్స్ కు పక్షపాతంగా కీలకమైన టెంటర్లను కేటాయించారంటూ ఈ సంస్థలు 2024లో సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. తవాంగ్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే, మిసెస్ అలయన్స్ ట్రేడింగ్ కో యజమాని అయిన పేమా మేనల్లుడు సెరింగ్ తాషికి నిబంధనలు ఉల్లంఘిస్తూ పనుల కాంట్రాక్టులను కేటాయించారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
విచారణ సందర్భంగా, ఆ కాలంలో రాష్ట్రంలో కేటాయించిన మొత్తం కాంట్రాక్టుల్లో ఈ ఒప్పందాలు సుమారు మూడు శాతాన్ని మాత్రమే కలిగి ఉన్నాయని పిటిషనర్లు పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి విచారణ నిష్పక్షపాతంగా ఉండకపోవచ్చని, స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు. సుమారు రూ. 1,245 కోట్ల విలువైన పనులు టెండర్ల ద్వారా కేటాయించారని, అదనంగా రూ. 25 కోట్ల విలువైన పనులకు వర్క్ ఆర్డర్లు జారీ చేసినట్లు పిటిషనర్లు పేర్కొన్నారు.

More Stories
‘హర్మూజ్’ దాటిన భారత 9వ ఎల్పీజీ నౌక ‘గ్రీన్ ఆశా’
ఆర్థిక వృద్ధి అంచనాలను 6 శాతానికి తగ్గించిన మూడీస్
పాక్ ను వెంటనే 3.5 బిలియన్ డాలర్ల అప్పు తీర్చమన్న యూఏఈ