నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ పదవి బీజేపీ కైవసం చేసుకుంది. ఘర్షణలతో శనివారం వాయిదా పడిన ఎన్నిక, ఆదివారం రాజకీయ పరిణామాల మధ్య భారతీయ జనతా పార్టీ చేజిక్కించుకుంది. బీజేపీ నుంచి అంకం మౌనిక ఛైర్పర్సన్గా, బీఆర్ఎస్ నుంచి మహ్మద్ షోయబ్ వైస్ ఛైర్మన్గా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి జీవరత్నం ప్రకటించారు.
ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా చేతులు ఎత్తే క్రమంలో కౌన్సిలర్ల మధ్య శనివారం వాగ్వాదం చోటుచేసుకుంది. అధికారులతో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, కాంగ్రెస్ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. మరోవైపు మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు.
ఖానాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 12 కౌన్సిలర్ స్థానాలు ఉన్నాయి. ఇటీవల ఎన్నికల్లో బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3, స్వతంత్రులు ఒకరు గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థి, ఎక్స్ అఫీషియో ఓటుతో కాంగ్రెస్ బలం ఐదుకు చేరింది. ముందుగా ఛైర్పర్సన్ ఎన్నిక వేళ బిజెపి అభ్యర్థి మౌనిక పేరును అధికారులు ప్రతిపాదించారు. దీనిపై ఎమ్మెల్యే బొజ్జు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందుగా బీజేపీ అభ్యర్థి పేరు ఎలా ప్రతిపాదిస్తారంటూ ఆందోళనకు దిగారు.
ఈ గందరగోళం నడమే ఛైర్మన్ ఎన్నికను అధికారులు ఆదివారానికి వాయిదా వేశారు. పోలీసుల భారీ బందోబస్తు నడుమ ఆదివారం మరోసారి ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కాగా, బిజెపి అభ్యర్థి అంకం మౌనికకు అనుకూలంగా బీజేపీ, బీఆర్ఎస్లకు చెందిన ఏడుగురు చేతులెత్తారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిన్నం సత్యానికి అనుకూలంగా ఆరుగురు తమ సంఘీభావం తెలిపారు. దీంతో బీఆర్ఎస్ సాయంతో ఛైర్మన్ పీఠం బీజేపీ కైవసం చేసుకున్నట్లైంది.

More Stories
పదవులకోసం పార్టీ మారే వ్యక్తిని కాదు
ఫీజు రీయింబర్స్ పథకం ఎత్తివేత దిశగా ప్రభుత్వ అడుగులు
జనాభా లెక్కల్లో తెలిసిన భాషగా `సంస్కృతం’ చేర్చండి