అస్సాం, పశ్చిమ బెంగాల్‌లలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ గెలుపు అవకాశాలపై సీనియర్ బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గట్టి విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ సమ్మిళిత అభివృద్ధికి కట్టుబడి ఉందని, ఏ మత సమూహానికీ వ్యతిరేకం కాదని ఆయన నొక్కి చెప్పారు. అస్సాంలో ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుండగా, పశ్చిమ బెంగాల్లో ఏప్రిల్ 23, 29 తేదీలలో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
పీటీఐకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, బీజేపీ విధానం ఐక్యత, ప్రగతిపై కేంద్రీకృతమై ఉందని గడ్కరీ స్పష్టం చేశారు. “అస్సాం, పశ్చిమ బెంగాల్ రెండింటిలోనూ మేమే గెలుస్తామని నాకు గట్టి నమ్మకం ఉంది. మతంతో సంబంధం లేకుండా అందరినీ కలుపుకొని పోవడమే బీజేపీ విధానం. మేము చొరబాటుదారులను వ్యతిరేకిస్తాము కానీ ముస్లింలకు వ్యతిరేకం కాదు,” అని గడ్కరీ తెలిపారు.
ముఖ్యంగా ఈశాన్య ప్రాంతంలో పార్టీ ప్రచారంలో అభివృద్ధి కీలక అంశంగా ఉందని ఆయన తెలిపారు. ఆయన ప్రకారం, మౌలిక సదుపాయాల రంగంలో భారీ పెట్టుబడులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి, మరిన్ని ప్రణాళికలో ఉన్నాయి. “అస్సాంతో సహా ఈశాన్య ప్రాంతమంతటా సుమారు రూ. 5 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు అమలు చేస్తున్నాయి. దాదాపు రూ. 1.5 లక్షల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయి. కాగా రూ. 1.5 లక్షల నుంచి రూ. 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు అమలులో ఉన్నాయి. దీనికి అదనంగా, మరో రూ. 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి,” అని ఆయన వివరించారు.
దీర్ఘకాలంగా మౌలిక సదుపాయాల సవాళ్లను ఎదుర్కొంటున్న ఈ ప్రాంతంలో, ముఖ్యంగా రోడ్లు, హైవేలు, లాజిస్టిక్స్ రంగాలలో జరుగుతున్న ఈ ప్రయత్నాలు అనుసంధానాన్ని మెరుగుపరిచి, ఆర్థిక వృద్ధికి తోడ్పడతాయని ఆశిస్తున్నట్లు గడ్కరీ తెలిపారు. హిమంత బిస్వా శర్మ నేతృత్వంలోని అస్సాం ప్రభుత్వం, తమ అభివృద్ధి విజయాలు, సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూ మరోసారి అధికారం చేపట్టాలని చూస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి.
పార్టీ వైఖరిని పునరుద్ఘాటిస్తూ, అందరినీ కలుపుకొని పోవడం తమ ప్రధాన సూత్రమని గడ్కరీ చెప్పారు. “అందరినీ కలుపుకొని పోవడమే బీజేపీ విధానం,” అని ఆయన అన్నారు. తమ పార్టీ వ్యతిరేకత అక్రమ చొరబాట్లకు మాత్రమేనని, ఏ ఒక్క నిర్దిష్ట మత వర్గానికి కాదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల అస్సాంలో జరిగిన ఒక ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి వారసత్వం ఉన్న ప్రజలకు భారతదేశం ఆశ్రయం కల్పించగలిగినప్పటికీ, అడ్డూ అదుపులేని అక్రమ ప్రవేశాన్ని అనుమతించలేదని, అలా చేయడం దేశాన్ని ఒక “ధర్మశాల”గా మారుస్తుందని హెచ్చరించారు.
పశ్చిమ బెంగాల్ విషయానికొస్తే, ఓటర్లలో రాజకీయ మార్పుకు మద్దతు పెరుగుతోందని గడ్కరీ పేర్కొన్నారు. పోటీ తీవ్రంగానే ఉన్నప్పటికీ, బీజేపీ ఘర్షణలకు బదులుగా పాలన, అభివృద్ధిపైనే దృష్టి సారిస్తుందని ఆయన తెలిపారు. ఓటర్ల జాబితా ‘ప్రత్యేక విస్తృత సవరణ’ (ఎస్ఐఆర్)కు సంబంధించి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ఆరోపణలకు స్పందిస్తూ, బీజేపీ జాతీయ ప్రయోజనాలకే అగ్ర ప్రాధాన్యత ఇస్తుందని గడ్కరీ తెలిపారు.
“జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలపై మేము ఎటువంటి రాజకీయాలు చేయదలుచుకోలేదు. దేశ ప్రయోజనాలనే సర్వోన్నతంగా భావిస్తూ, ఎస్ఐఆర్ వంటి అంశాలను మనం పరిశీలించాలి,” అని ఆయన హితవు చెప్పారు.

More Stories
పదవులకోసం పార్టీ మారే వ్యక్తిని కాదు
భారత్ సమీప జలాల్లో చైనా `సర్వే’ నౌకలు!
పశ్చిమ బెంగాల్లో మహా జంగిల్ రాజ్