ప్రొఫెసర్ సూరేపల్లి సుజాతతో ప్రాణహాని.. రక్షణ కల్పించండి 

ప్రొఫెసర్ సూరేపల్లి సుజాతతో ప్రాణహాని.. రక్షణ కల్పించండి 
* కేంద్ర మంత్రి బండి సంజయ్ కు శాతవాహన విశ్వవిద్యాలయం పరిశోధన విద్యార్థి వినతి 
 
శాతవాహన విశ్వవిద్యాలయంలోని మావోయిస్టు భావజాలంతో పనిచేస్తున్న  సోసియాలజీ  ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, ఆమె మద్దతుదారులు తనను వేధిస్తున్నారని, వారి నుండి తనకు ప్రాణహాని ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తూ, తనకు రక్షణ కల్పించాలని  ఎకనామిక్స్ పరిశోధక విద్యార్థి నైతం మహేష్ తో పాటు ఆ విశ్వవిద్యాలయానికి చెందిన పలువురు విద్యార్థులు విజ్ఞప్తి చేశారు.
 
ఆ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.  2017-19లో సోషియాలజీలో విద్యార్థిగా చేరి, అనేక రెచ్చగొట్టే నిరసన కార్యక్రమాలు ఉద్దేశపూర్వకంగా చేసిన మావోయిస్టు నిషేధిత సంస్థలతో సంబంధం కలిగి టివీవీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా, తెలంగాణ ప్రజా ఫ్రంట్ కార్యకర్తగా పనిచేసిన కరిక మహేష్ పై తాము ఫిర్యాదు చేస్తే ఆమె తమను బెదిరిస్తున్నారని వారు తెలిపారు. 
 
అదే వ్యక్తి తిరిగి ఆరు సంవత్సరాల తర్వాత 2025లో విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ విభాగంలో చేరి మళ్లీ అదే రకమైన కార్యక్రమాలు చేస్తూ వ్యక్తిగతంగా, ప్రైవేటు జీవితాలను కూడా ఇబ్బందులకు గురి చేస్తూ, విద్యార్థులను మావోయిస్టు భావజాలంతో రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తుండటంతో అతనిపై విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు. 
 
దానితో,  ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత గిరిజన విద్యార్థి అయినా తనను  లక్ష్యంగా చేసుకుంటూ `ఫిర్యాదు చేస్తావా? ఎవరు నువ్వు? నీ సంగతి చెప్తా? తమాషా చేస్తున్నావ్, నువ్వు ఏ సామాజిక వర్గం’ అంటూ తనను వ్యక్తిగతంగా దూషిస్తూ, బెదిరించిందని సైతం మహేష్ పేర్కొన్నారు. ఈ సంఘటన వల్ల తాను చాలా భయభ్రాంతులకు, మానసిక ఒత్తిడికి గురవుతున్నానని చెప్పారు. 
 
“ఆమె వల్ల, ఆమె సంబందించిన కరిక మహేష్ తదితర కార్యకర్తల వల్ల నాకు ప్రాణ భయం ఉంది. ఇలాంటి వ్యక్తుల మీద చట్టపరమైన ఉపా వంటి చర్యలు తీసుకోవాలి.  విశ్వవిద్యాలయం నుంచి వెంటనే వీరి అడ్మిషన్లను రద్దు చేయడం ద్వారా విశ్వవిద్యాలయానికి, విద్యార్థులకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను” అని కేంద్ర సహాయమంత్రిని కోరారు. 
శాతవాహన విశ్వవిద్యాలయం పేద, దళిత, గిరిజన, బలహీన, మైనార్టీ ప్రతిభగల విద్యార్థుల కోసం ఉన్నత విద్య, పరిశోధక విద్య అందించడానికి ఏర్పాటు చేసిన విద్యా సంస్థ అని గుర్తు చేశారు. అలాంటి విశ్వవిద్యాలయంలో కొందరు మావోయిస్టు భావజాలంతో అధ్యాపకులుగా, విద్యార్థులుగా ప్రవేశించి ఏదో రకంగా అలజడులు సృష్టిస్తూ, విశ్వవిద్యాలయం  ప్రశాంత వాతావరణం దెబ్బతీయడం వల్ల ఇది విశ్వవిద్యాలయం విద్యార్థుల మీద, సిబ్బంది మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నదని సైతం మహేష్ ఆందోళన వ్యక్తం చేశారు. 
 
అంతేకాకుండా, డాక్టర్ సూరేపల్లి సుజాత 2019లో కొందరు విద్యార్థులను చత్తీస్గడ్ అడవుల్లో మావోయిస్టు దళసభ్యులలను కలిసినట్లు అప్పటి సీపీ కమలహాసన్ రెడ్డి  తెలిపారని గుర్తు చేశారు. ఆపరేషన్ సింధూర్ మీద సైనికుల  త్యాగాలను, దేశభక్తిని కించపరిచే విధంగా, అమాయక ప్రాణాలను తూలనాడడంపై ఫిర్యాదులు కూడా ఈమెపై వచ్చాయని తెలిపారు. 
 
అదేవిధంగా నిషేధిత మావోయిస్టు సంస్థలైన తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ), తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టిపిఎఫ్), డెమొక్రటిక్ స్టూడెంట్ యూనియన్ (డిఎస్.యూ) వంటి సంస్థల్లో పనిచేస్తున్న కార్యకర్తలను విద్యార్థులుగా చేర్చి మావోయిస్టు భావజాలం వైపు తీసుకెళ్తున్నట్లు హైదరాబాద్ సిటీ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారని చెప్పారు.   విశ్వవిద్యాలయంలో మను చరిత్ర తగలబెట్టించడం, భరతమాత చిత్రపటాన్ని తగలబెట్టించడం, అధ్యాపకులపై భౌతిక దాడి చేయించడం, అధ్యాపకులపై నిరాధార ఆరోపణలు చేయించడం, వీసీ,రిజిస్ట్రార్ వంటి ఉన్నతాధికారులను బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడం చేస్తున్నారని సైతం మహేష్ వివరించారు.