జనాభా నియంత్రణ వల్ల దక్షిణాది రాష్ట్రాలు లోక్‌సభలో సీట్లు కోల్పోతాయని వస్తున్న వాదనలలో వాస్తవం లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శనివారం కేరళలోని పథనంథిట్ట తిరువళ్ల మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో ఆయన పాల్గొంటూతమ జనాభాను స్థిరీకరించుకున్న రాష్ట్రాలు తమ లోక్‌సభ స్థానాలను కోల్పోవు; అంతేకాకుండా, సభ సభ్యుల సంఖ్యను పెంచాలన్న ప్రతిపాదన ద్వారా అన్ని రాష్ట్రాలూ ప్రయోజనం పొందుతాయని ప్రధాని స్పష్టం చేశారు.
జనాభా స్థిరీకరణ సాధించిన రాష్ట్రాల లోక్‌సభ ప్రాతినిధ్యం తగ్గిపోతుందేమోనన్న ఆందోళనలపై మోదీ తొలిసారిగా స్పందిస్తూ ఈ ఆందోళనలను పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. “కేరళ, తమిళనాడు లేదా ఇతర రాష్ట్రాలు కావచ్చు—జనాభా నియంత్రణ రంగంలో కొన్ని రాష్ట్రాలు అత్యంత ఆదర్శప్రాయమైన పనిని చేశాయి. అయితే, ఆయా రాష్ట్రాల్లో జనాభా వృద్ధి మందగించిన కారణంగా, వాటికి కేటాయించిన పార్లమెంటు స్థానాల సంఖ్య తగ్గిపోతుందంటూ కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారాన్ని సాగిస్తున్నారు” అని ప్రధాని విమర్శించారు.
ఈ పార్లమెంటు సమావేశాల సమయంలోనే, ఈ విషయమై సభలో ఒక స్పష్టమైన హామీని ఇవ్వాలని సంకల్పించిన్నట్లు వెల్లడించారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గోవా లేదా తెలంగాణ—ఏ రాష్ట్రంలోనూ లోక్‌సభ స్థానాల సంఖ్య తగ్గకుండా ఉండేలా చూస్తూ, ఒక చట్టం ద్వారా ఈ హామీని అధికారికంగా ధ్రువీకరించాలని ఆశిస్తున్నామని తెలిపారు.
కేరళలో ఎల్డిఎఫ్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని స్పష్టం చేశారు. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ అధికారంలోకి రావడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. “నేను ఇంతకు ముందు కూడా ఇక్కడికి వచ్చాను. కానీ ఈసారి మార్పు గాలులు మరో దిశలో వీస్తున్నాయి. కేరళ ప్రజల మూడ్ మారినట్టు కనిపిస్తోంది. కేరళలో అతిపెద్ద మార్పు జరగబోతోంది. ఏప్రిల్ 9న పోలింగ్ జరుగుతుంది. మే 4న దశాబ్దాల దుష్పరిపాలన అంతం కానుంది” అంటూ ప్రధాని జోస్యం చెప్పారు.
తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈశాన్య రాష్ట్రాల్లో మాదిరిగా అభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతామనని హామీ ఇచ్ఛారు. కేరళ అభివృద్ధికి అవినీతి, మతతత్వం రెండు అతిపెద్ద అవరోధాలని ఈ సందర్భంగా చెప్పారు. ఎల్డీఎఫ్-యూడీఎఫ్ ప్రభుత్వాలు ఎప్పుడూ ఈ ప్రాంతం గురించి పట్టించుకోలేదని, రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని, చాలా ఏళ్లుగా ఒక్క ప్రధాన బ్రిడ్జి కూడా నిర్మించ లేదని, మెడికల్ కాలేజీ పరిస్థితి దయనీయంగా ఉందని విమర్శించారు. కనీస మౌలిక సదుపాయాలు లేకుండా జీవన ప్రమాణాలు ఏ స్థాయిలో ఉంటాయనేది ఎవరైనా ఊహించవచ్చని తెలిపారు.
శబరి రైలు ప్రాజెక్టును ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఆలస్యం చేయడంతో తిరువళ్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ప్రధాని ఆరోపించారు. కేరళకు అపారమైన సామర్థ్యం ఉన్నప్పటికీ, అభివృద్ధి పరుగులో ఇతర రాష్ట్రాల కంటే వెనుకబడి ఉందని పేర్కొన్నారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ప్రభుత్వాలు సరైన శ్రద్ధ చూపకపోవడం వల్ల కేరళ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు అధ్వాన్నంగా ఉన్నాయని మోదీ ఆరోపించారు.
కేరళలో శబరిమల రైల్వే ప్రాజెక్టు కొత్త అవకాశాలను తీసుకురాగలదని ప్రధాని చెప్పారు. ఇది శబరిమలకు ప్రత్యక్ష అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని, స్థానిక వ్యాపారాలకు కొత్త ఊపు ఇస్తుందని, యువతకు కొత్త ఉపాధి మార్గాలను తెరుస్తుందని వివరించారు. బిజెపి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అధికారంలో వస్తే ఇలాంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కంటే ఎన్డీఏ ప్రభుత్వం కేరళ అభివృద్ధి కోసం ఐదు రెట్లు అధికంగా నిధులు ఖర్చు చేసిందని వివరించారు.
తనను రాజకీయంగా దెబ్బతీయడం కోసం, పశ్చిమాసియా దేశాలతో భారత్‌కు ఉన్న సంబంధాలను చెడగొట్టేలా కాంగ్రెస్ రెచ్చగొట్టే వ్యాఖ్యుల చేస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు కేవలం ఎన్నికల్లో గెలవడం తప్ప మరో ధ్యాస ఉందని విమర్శించారు. “నేను ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలని అనుకుంటున్నాను. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ భారతీయుల రక్షణ, ముఖ్యంగా పశ్చిమాసియాలో ఉన్న కేరళ ప్రజల భద్రత మా ప్రథమ ప్రాధాన్యత. వారిని రక్షించే బాధ్యతను నేను తీసుకుంటాను” అని ఎన్డీఏ ర్యాలీలో ఆయన స్పష్టం చేశారు.
గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న లక్షలాది మంది కేరళ ప్రజలతోపాటు, యుద్ధం కారణంగా ఇరాన్ సహా ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన గోవా, తమిళనాడు సహా ఇతర రాష్ట్రాల మత్స్యకారుల గురించి కూడా మోదీ ప్రస్తావించారు. “మేము వారందరినీ సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీకి దీని గురించి పట్టదు. పశ్చిమాసియా దేశాలతో భారత సంబంధాలు దెబ్బతీసేలా, అనవసర భయాందోళనలను సృష్టించేలా కాంగ్రెస్ ప్రకటనలు చేస్తోంది” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
“ఇదంతా కేవలం నాపై రాజకీయ దాడులు చేయడానికే. వారికి కేవలం రాజకీయం, అధికారం మీదే కాంక్ష ఉంది. భారత ప్రజల పట్ల వారికి ఎలాంటి పట్టింపు లేదు. వాళ్లు కేరళ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారు. దీనికి వాళ్లు కేరళ ప్రజలకు, దేశానికి క్షమాపణ చెప్పాలి” అని మోదీ మండిపడ్డారు. ఎన్డీయే విధానాలతో ప్రతి ఒక్క వర్గానికి, ముఖ్యంగా మహిళలు ఎంతో లబ్ధి పొందుతున్నారని ప్రధాని చెప్పారు. వలస కార్మికులకు ఉద్యోగాలు కల్పన కేరళలో అతిపెద్ద సమస్యగా ఉందని, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సమస్యలను పరిష్కరిస్తామని, ఇది మోదీ ఇచ్చే హామీ అని ప్రధాని భరోసా ఇచ్చారు.
More Stories
ప్రొఫెసర్ సూరేపల్లి సుజాతతో ప్రాణహాని.. రక్షణ కల్పించండి
రేపే బీజేపీ ఆవిర్భావ దినోత్సవం .. ఇంటింటిపై పార్టీ జెండా
రూ. 225 కోట్లతో బాసర దేవస్థానం అభివృద్ధి