లక్నోలో ఉగ్ర కుట్ర భగ్నం.. నలుగురు ఉగ్రవాదుల అరెస్టు

లక్నోలో ఉగ్ర కుట్ర భగ్నం.. నలుగురు ఉగ్రవాదుల అరెస్టు

ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన నలుగురు ఉగ్రవాదుల ముఠాను ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్‌) అరెస్టు చేసింది. ఏటీఎస్ తెలిపిన వివరాల ప్రకారం వీరికి పాకిస్తాన్‌ ఉగ్రవాద ముఠాలతో సంబంధం ఉంది. వీరిలో మీరట్‌కు చెందిన సాకిబ్ అలియాస్ డెవిల్ ప్రధాన నిందితుడు.  సాకిబ్‌తోపాటు అతడి అనుచరులు లక్నోతోపాటు దేశంలో పలు ఉగ్రవాద, జాతి వ్యతిరేక కార్యకలాపాలకు ప్లాన్ చేశారు.

వీరు టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ యాప్స్ ద్వారా పాకిస్తాన్‌ ఉగ్రముఠాలతో సంప్రదింపులు జరిపేవారు. ఈ నలుగురు ఉగ్రవాదుల ముఠా దేశంలో భారీ విధ్వంసానికి ప్లాన్ చేసింది.  రైల్వే సిగ్నల్ బాక్స్‌ల ద్వారా రైళ్లను ఆపి భారీగా దాడులు చేయడం, ప్రముఖ సంస్థలు, సిలిండర్ గ్యాస్‌ తీసుకెళ్లే ట్రక్కులు, ప్రభుత్వం సంస్థలు, కీలక ప్రదేశాల్ని వీరు లక్ష్యంగా ఎంచుకున్నారు.

పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు పంపిన గూగుల్ ఫొటోస్, లొకేషన్స్ ఆధారంగా ఇక్కడి కొందరు రాజకీయ నేతలు, ప్రముఖ సంస్థలపై నిఘా పెట్టి, వాటి సమాచారాన్ని సేకరించారు.  ఈ సమాచారాన్ని పాకిస్తాన్ చేరవేశారు. ఘజియాబాద్, అలీఘడ్, లక్నోలో రైల్వే స్టేషన్ వంటి పలు ప్రాంతాల్ని సర్వే చేశారు. ఏప్రిల్ 2న లక్నో రైల్వేస్టేషన్ వద్ద పేలుడుకు కుట్ర పన్నుతుండగా పక్కా సమాచారంతో ఘటనా స్థలానికి వెళ్లి వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

వీరిపై బీఎన్ఎస్, ఉపా చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి పేలుడు పదార్థాలు, ఏడు స్మార్ట్ ఫోన్లు, 24 కరపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ నిందితులు కొన్ని ప్రదేశాల్లో చిన్నపాటి పేలుళ్లకు పాల్పడ్డారని, దాన్ని వీడియో తీసి ఉగ్రసంస్థలకు పంపారని పోలీసులు తెలిపారు. దాని ద్వారా క్యూఆర్ కోడ్ల ఉగ్రసంస్థల నుంచి నిధులు సేకరించారని పేర్కొన్నారు. వీరంతా సోషల్ మీడియాను ఉపయోగించి యువతను తీవ్రవాదం వైపు ఆకర్షించే ప్రయత్నం చేశారని తెలిపారు.

అలాగే, రైల్వే ఆస్తుల్ని, ట్రాకులు, సిగ్నల్ వ్యవస్థను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు.  అయితే, సరైన సమయంలో ఏటీఎస్ స్పందించి ఉగ్రవాద నిందితుల్ని అరెస్టు చేసింది. నిందితులు సాకిబ్, వికాస్ గెహ్లావత్ అలియాస్ రౌనక్, లోకేష్ అలియాస్ పాప్లా పండిట్ అలియాస్ బాబు అలియాస్ సంజు, అర్బాబ్‌గా గుర్తించారు. వీరి దగ్గరి నుంచి కొన్ని పేలుడు పదార్థాలు, ఏడు సెల్‌ఫోన్లు వంటివి స్వాధీనం చేసుకున్నారు. దేశంలో భయోత్పాతం సృష్టించడానికి నిందితులు ప్రయత్నిస్తున్నట్లు ఏటీఎస్ అధికారులు తెలిపారు.