రేపే బీజేపీ ఆవిర్భావ దినోత్సవం .. ఇంటింటిపై పార్టీ జెండా 

రేపే బీజేపీ ఆవిర్భావ దినోత్సవం .. ఇంటింటిపై పార్టీ జెండా 

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం  సందర్భంగా పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి, ప్రజలు కూడా తమ ఇళ్లపై పార్టీ జెండాను ఎగురవేయాలని  రాష్ట్ర అధ్యక్షులు  ఎన్. రాంచందర్ రావు కోరారు. దీంతో జాతీయ గౌరవ భావన, ప్రజా భాగస్వామ్యం, పార్టీ పట్ల ప్రజల ఆత్మీయ అనుబంధం మరింత బలపడుతోందని తెలిపారు.   ప్రతి జిల్లాలో, ప్రతి ఇంట్లో, ప్రతి బూత్‌లో ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. 

ఈ సందర్భంగా తన నివాసంలో బూత్ నెం. 194 వద్ద బూత్ స్థాయి కార్యకర్తలతో కలిసి పార్టీ పతాకాన్ని ఆదివారం సగర్వంగా ఆవిష్కరించారు. బిజెపి కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, జాతీయ సేవ, జాతీయత, క్రమశిక్షణ, ప్రజల పట్ల నిబద్ధత అనే విలువలతో ముందుకు సాగే ఒక మహత్తర జాతీయ ఉద్యమం అని ఆయన స్పష్టం చేశారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి కార్యకర్త “దేశం ముందు – పార్టీ తర్వాత – స్వయం చివర” అనే భావంతో, పార్టీ సిద్ధాంతాలను మరింతగా ప్రజలకు చేరువ చేసే సంకల్పంతో ముందుకు సాగాలని పిలుపిచ్చారు.

45 సంవత్సరాలు పూర్తి చేసుకుని 46లోకి అడుగుపెడుతున్న బిజెపి ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా నిలవడం మనందరికీ గర్వకారణం అని చెప్పారు. ఒకప్పుడు జనసంఘ్‌గా ప్రారంభమైన ఈ ప్రయాణం, అనంతరం 1980లో ముంబైలో  అటల్ బిహారీ వాజపేయి  అధ్యక్షతన భారతీయ జనతా పార్టీగా రూపుదిద్దుకుని, తన సిద్ధాంతబలం, క్రమశిక్షణ గల కార్యకర్తల శ్రమ, జాతీయ సేవ పట్ల అచంచల నిబద్ధతతో ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిందని గుర్తు చేశారు.

విశాలమైన సభ్యత్వ బలం, దాదాపు 21 రాష్ట్రాల్లో ప్రభుత్వాలతో  పార్టీ భారతీయ రాజకీయాల్లో శక్తివంతమైన శక్తిగా అవతరించిందని చెప్పారు. ఈ అభివృద్ధి పార్టీపై, దాని నాయకత్వంపై దేశ ప్రజలు ఉంచిన విశ్వాసం, నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని తెలిపారు. ఈరోజు బీజేపీ కేవలం ఒక రాజకీయ సంస్థ మాత్రమే కాదని, దేశ భవిష్యత్తును మలిచే ఒక శక్తివంతమైన జాతీయ ఉద్యమంగా నిలిచిందని రామచందర్ రావు స్పష్టం చేశారు.

నిజానికి, వాజపేయి, నరేంద్ర మోదీ  దేశ ప్రధానమంత్రులైన తర్వాతనే భారత్ నిజమైన ఆర్థిక మార్పును, అభివృద్ధి   కొత్త యుగాన్ని చూడడం ప్రారంభించిందని తెలిపారు. వారి నాయకత్వం దేశానికి కొత్త దిశను చూపి, అభివృద్ధిని వేగవంతం చేసి, మరింత బలమైన, ఆత్మనిర్భరమైన, అభివృద్ధి చెందిన భారత నిర్మాణానికి పునాది వేసిందని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ భారతదేశ అభివృద్ధిని నిజమైన అర్థంలో ఆలోచించలేదని, అవినీతినే పాలనగా మార్చుకుందని ధ్వజమెత్తారు. 

అదే సమయంలో, పార్టీని మరింత బలపరచాలని, తెలంగాణలో మరింత అంకితభావంతో పనిచేసి పార్టీని అధికార దిశగా తీసుకెళ్లాలని మనం సంకల్పించాలని రామచందర్ రావు కోరారు. భారతీయ జనతా పార్టీ బలం కేవలం నాయకత్వంలోనే కాకుండా క్రమశిక్షణతో, అంకితభావంతో, అనేక సవాళ్లు, కష్టాలను ఎదుర్కొంటూ నిరంతరం శ్రమిస్తున్న కార్యకర్తల్లో ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు పార్టీ ఈ స్థాయిలో నిలవడానికి వారి కష్టం, త్యాగం, అచంచల నిబద్ధతే కారణమని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని కోరారు.ఈ సందర్భంగా పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ  సిద్ధాంతాలను, డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ   త్యాగాలను, ముఖ్యంగా కాశ్మీర్ కోసం ఆయన చేసిన త్యాగాన్ని మనం స్మరించుకుని ప్రేరణ పొందాలని సూచించారు