None
మరోవైపు, తమ దేశ సైనిక బలం, విస్తృతమైన వ్యూహాత్మక సామర్థ్యాల గురించి ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరాన్కు చెందిన అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలు, వ్యూహాత్మక క్షిపణులు, ప్రత్యేక ఆయుధాల ఉత్పత్తి కేంద్రాలతోపాటు సైనిక మౌలిక సదుపాయాలు, సుదూర లక్ష్యాలను ఛేదించే డ్రోన్లను ధ్వంసం చేశామని ట్రంప్ ఇదివరకే పేర్కొన్నారు.
అయితే ఆ వాదనలను ఇరాన్ ఖండించింది. అదేవిధంగా, ఇరాన్‌ను రాతియుగంలోకి పంపిస్తామని ట్రంప్ చేసిన వ్యాఖ్యలపైనా తీవ్రంగా విరుచుకుపడింది. రాతియుగం నాటి నేరాలను ఆధునిక యుగానికి అమెరికా తీసుకొస్తోందని విమర్శించింది. చిన్నారుల హత్యలు, మానవత్వానికి మచ్చతెచ్చే నేరాలను ఆధునిక ప్రపంచంలోకి తెస్తోందని మండిపడింది.
‘‘మేం అమెరికా బాంబుల కారణంగా రాతియుగంలోకి వెళ్లడం లేదు. మాకు 7,000 ఏళ్ల నాగరిక చరిత్ర ఉంది. చరిత్రకు ఈ విషయం తెలుసు. అమాయకులైన పిల్లల్ని చంపి, అమానవీయ నేరాలు చేస్తున్న మీరు రాతియుగాన్ని ఆధునిక ప్రపంచంలోకి తెచ్చారు అనేది స్పష్టం’’ అని తేల్చి చెప్పింది. ఇరాన్‌తో యుద్ధంపై బుధవారం రాత్రి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేస్తూ తాము ఇరాన్‌పై చేస్తున్న యుద్ధం కారణంగా ఆ దేశం రాతియుగంలోకి వెళ్తుందని పేర్కొన్నారు.
ఇరాన్ సైన్యం, నేవీ పూర్తిగా బలహీనపడిపోయాయని చెప్పారు. యుద్ధాన్ని రెండు, మూడు వారాల్లో ముగిస్తామని తెలిపారు. అయితే, ఇరాన్ మిలిటరీ మాత్రం ట్రంప్ ప్రకటనకు ధీటుగా స్పందించింది. అమెరికాకు తీవ్ర అవమానం జరిగే వరకు యుద్ధాన్ని వదలేది లేదని, అమెరికా పశ్చాత్తాప పడి, లొంగిపోయే వరకు తమ దాడులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. అమెరికా తమను తక్కువగా అంచనా వేసిందని ఇరాన్ సైనిక ప్రతినిధి ఒకరు చెప్పారు.
తమ దేశం దగ్గరున్న సైనిక శక్తి, మిస్సైళ్ల తయారీ గురించి అమెరికా ఇంటెలిజెన్స్‌కు సరిగ్గా తెలియదని పేర్కొంటూ లాంగ్ రేంజ్ అటాక్ మిస్సైల్స్ డ్రోన్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్, స్పెషలైజ్డ్ ఎక్విప్‌మెంట్ వంటివి తమ దేశం దగ్గరున్నాయని ఇరాన్ ప్రతినిధి మీడియాతో తెలిపారు.

More Stories
హోర్ముజ్‌ను తిరిగి తెరవాలని 60 దేశాల పిలుపు
కేరళలో తీవ్రమైన త్రిముఖ పోటీ
కాల్పుల విరమణకై పాక్ మధ్యవర్తులతో జెడి వాన్స్ మంత్రాంగం