అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం

అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం
లోక్‌సభలో ఇప్పటికే ఆమోదం పొందిన అమరావతి చట్టబద్ధత బిల్లు (ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లు) కు గురువారం రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది.. దీంతో అమరావతికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి, చట్టపరమైన రక్షణ లభించినట్లయ్యింది.  మూజువాణి ఓటుతో రాజ్యసభ బిల్లును ఆమోదించింది. ఇక రాష్ట్రపతి ఆమోదం పొందగానే ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి రాజముద్ర పడటం లాంఛనమే కానుంది. 

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై రాజ్యసభలో సుదీర్ఘ చర్చ జరిగింది.సభ్యులందరి మద్దతుతో మూజువాణి ఓటు ద్వారా బిల్లు ఆమోదం పొందింది.మొత్తం 11 పార్టీలకు చెందిన 18 మంది ఎంపీలు ఈ చర్చలో పాల్గొన్నారు. ఇందులో 10 పార్టీలు బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.”అమరావతికి ఆ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఈ చట్టం ఏపీ అభివృద్ధికి నాంది పలకాలి” అని ఆయన ఆకాంక్షించారు. బిల్లుపై చర్చను కాంగ్రెస్ సభ్యురాలు రేణుకా చౌదరి ప్రారంభిస్తూ బిల్లు ప్రవేశపెట్టడం అమరావతి రైతుల త్యాగానికి దక్కిన గౌరవమని అభివర్ణించారు.

రాజధాని ఉద్యమ సమయంలో రైతులను, మహిళలను తీవ్రంగా హింసించారని గుర్తుచేశారు. రాజధానిపై అస్పష్టత వల్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లాయని పేర్కొన్నారు. దుగరాజ పట్నం, కడప స్టీల్‌ ప్లాంట్‌ను ముగిసిన అధ్యాయం చేశారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. “బిల్లు పెట్టడం కాదు. సకాలంలో రాజధాని పూర్తి చేసి చూపించాలి. జగన్‌ మూడు రాజధానుల పేరుతో రాజధాని లేకుండా చేశారు. రెండు రాష్ట్రాలతో కేంద్రం ఆటలు ఆడుతుంది. రూ. 1.47 లక్షల కోట్ల విలువైన ఆస్తుల పంపకాలు జరగలేదు” అంటూ ఆమె విచారం వ్యక్తం చేశారు.

తెలంగాణకు ఇచ్చిన హామీలు కూడా కేంద్రం నెరవేర్చలేదని పేర్కొంటూ  రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, ఎన్‌టిపిసి కూడా కేంద్రం ఇవ్వలేదని తెలిపారు. ఇప్పటివరకు హామీలు ఎందుకు నెరవేర్చలేదో కేంద్రం చెప్పాలని డిమాండ్ కోరారు. హామీలు అమలు చేయనందుకు రెండు రాష్ట్రాలకు పరిహారం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.  విభజన సమస్యల పాపం కాంగ్రెస్‌ పార్టీదేనని బీజేపీ సభ్యుడు డా. కె. లక్ష్మణ్‌ ఆరోపించారు. దూరదృష్టి గల నాయకుడిగా ఆనాడు హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు అమరావతి రాజధాని సంకల్పం తీసుకున్నారని లక్ష్మణ్‌ ప్రశంసించారు