ప్రపంచంలో ఉత్తమ రాజధానిగా తీర్చిదిద్దుతాం

ప్రపంచంలో ఉత్తమ రాజధానిగా తీర్చిదిద్దుతాం
తెలుగు జాతి గుండె, జాతి గౌరవం అమరావతి అని, ఆంధ్రుల ఏకైక ప్రజా రాజధాని అమరావతే అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రపంచంలో ఉత్తమ రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతామన్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లుకు ఆమోదం పొందిన తర్వాత గురువారం రాత్రి రాజధాని గ్రామాల్లో రైతులు సంబరాలు చేసుకున్నారు. 
 
ఈ సంబరాలకు సిఎం చంద్రబాబుతో సహా ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రులు పి.నారాయణ, అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్‌, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, రాజధాని రైతులు పాల్గొన్నారు. రాజధానికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయుని పాలెం వద్ద రైతులతో కలిసి దీప హారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.  ఆ వేదిక వద్ద వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ సాష్టాంగ ప్రణామం చేశారు.
 
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అమరావతిలో ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మిస్తామని, రాష్ట్రంలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని, అమరావతి సాక్షిగా ప్రజలకు హామీ ఇస్తున్నానని ప్రకటించారు. తిరుపతి, విశాఖపట్నం నగరాలను కూడా అమరావతితో సమానంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.  అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో తిరుగులేని శాసనం చేశామని, ఇది ప్రజా సంకల్పానికి దక్కిన గౌరమని తెలిపారు.
అనేక కుట్రలను ఎదుర్కొని రాజధానిని దక్కించుకున్నామని, రాజధానిని స్మశానం అన్న వారు నేడు అడ్రస్‌ లేకుండా పోయారని వైసిపినుద్దేశించి ఎద్దేవా చేశారు.  రైతులు, రైతు కూలీలు, ప్రజల ఐక్యమత్యం వల్లే ఈ విజయం సాధించుకున్నామని చెప్పారు. “ఒక్క వైసిపి మినహా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు అమరావతికి అండగా నిలబడ్డాయి. ప్రజలు శాశ్వతంగా వైసిపిని మర్చిపోవాలి” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై తీర్మానం పెడితే ఆ పార్టీ అసెంబ్లీకి కూడా హాజరు కాలేదని, పార్లమెంటులో చట్టం చేస్తుంటే వాకౌట్‌ చేసిందని ధ్వజమెత్తారు. వాకౌట్‌ చేసిన ఆ పార్టీని ప్రజలు బ్లాక్‌ అవుట్‌ చేయాలని కోరారు. మావిగన్‌ అంటూ జగన్‌ ఓ కొత్త ప్రతిపాదన చేశారని చెబుతూ డిక్షనరీలో వెతికినా అర్ధం దొరకలేదని ఎద్దేవా చేశారు.