కాల్పుల విరమణకై పాక్ మధ్యవర్తులతో జెడి వాన్స్ మంత్రాంగం 

కాల్పుల విరమణకై పాక్ మధ్యవర్తులతో జెడి వాన్స్ మంత్రాంగం 
 
ఇరాన్ వివాదంపై పాకిస్తానీ మధ్యవర్తులతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ రహస్య సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. టెహ్రాన్ కీలకమైన అమెరికన్ షరతులను అంగీకరిస్తే కాల్పుల విరమణకు వాషింగ్టన్ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టమైన సందేశం పంపారు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ఆరవ వారంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. త్వరలో ఈ విషయమై జెడి వాన్స్ ఇస్లామాబాద్ సందర్శింపగలరని భావిస్తున్నారు. 
 
ఈ సంఘర్షణలో ఇరాన్‌లో ఇప్పటికే 200 మందికి పైగా పిల్లలతో సహా 1,600 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్‌తో 900 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్న పాకిస్తాన్, ఇరు పక్షాల మధ్య ప్రధాన వారధిగా నిలిచింది. సైన్యాధిపతి జనరల్ అసిమ్ మునీర్ వాన్స్‌తో నిరంతరం ప్రత్యక్ష సంబంధాలు కొనసాగిస్తున్నారు.  
ట్రంప్ సహనంగా లేరని, టెహ్రాన్ ఒప్పందానికి అంగీకరించకపోతే ఇరాన్ మౌలిక సదుపాయాలపై ఒత్తిడి పెరుగుతుందని హెచ్చరిస్తూ వాన్స్ ఒక “కఠినమైన సందేశం” కూడా ఇచ్చారని అధికార  వర్గాలు ఈ సందర్భంగా తెలిపాయి. 
 
ఈ యుద్ధానికి ముగింపు పలికేందుకు చర్చలు జరిపే ప్రయత్నాల్లో వాన్స్ ఇప్పుడు మరింత కీలక పాత్ర పోషిస్తున్నారు. 2028 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు వారసుడిగా నిలిచే అవకాశం ఉన్న వ్యక్తిగా విస్తృతంగా పరిగణించబడుతున్న వాన్స్, ఈ సంఘర్షణ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.విదేశాల్లో అమెరికా సైనిక ప్రమేయం దీర్ఘకాలం కొనసాగడం పట్ల తనకు ఎప్పటినుంచో ఉన్న సందేహాలను ఆయన వైఖరి ప్రతిబింబిస్తోంది.
 
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టమైన ఆదేశం మేరకు, ఇరాన్ చర్చలకు అతీతమైన డిమాండ్లను, ముఖ్యంగా హోర్ముజ్ జలసంధిని తక్షణమే తిరిగి తెరవడాన్ని అంగీకరిస్తే, అమెరికా కాల్పుల విరమణను అంగీకరించగలమని వాన్స్ సంకేతాలు ఇచ్చారు. ప్రపంచ సరఫరాలో 20 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తూ, సాధారణంగా రోజుకు 21 మిలియన్ బ్యారెళ్ల చమురును రవాణా చేసే ఈ ఇరుకైన జలమార్గంలో, మార్చి ఆరంభంలో ఇరాన్ దాడులు మొదలైనప్పటి నుండి రవాణా చాలా వరకు తగ్గిపోయింది. 
 
యుద్ధానికి ముందు బ్యారెల్‌కు 72 డాలర్లుగా ఉన్న బ్రెంట్ క్రూడ్ ధరలు, 40 శాతం పెరిగి 106 డాలర్లను దాటాయి. అదే సమయంలో, ద్రవీకృత సహజ వాయువు ధరలు దాదాపు 60 శాతం పెరిగాయి. ఈ అంతరాయం వల్ల 2026 నాటికి ప్రపంచ జీడీపీ వృద్ధి 0.3 శాతం తగ్గవచ్చని, ఐరోపా పూర్తి ఒక శాతం సంకోచాన్ని ఎదుర్కోవచ్చని, కువైట్, ఖతార్ వంటి గల్ఫ్ దేశాలు 14 శాతం జీడీపీ సంకోచానికి సిద్ధం కావాల్సి ఉంటుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.
 
ఇస్లామాబాద్ ద్వారా పంపిన 15-సూత్రాల అమెరికా ప్రతిపాదనలో అణ్వాయుధాల ఉపసంహరణ చర్యలు, బాలిస్టిక్ క్షిపణులపై పరిమితులు, ప్రాంతీయ ప్రాక్సీలకు మద్దతు నిలిపివేయడం, గల్ఫ్‌లో సముద్ర రవాణాను పూర్తిగా పునరుద్ధరించడం వంటివి ఉన్నాయి. ఈ ప్యాకేజీ మితిమీరినదని ఇరాన్ బహిరంగంగా తిరస్కరించినప్పటికీ, పాకిస్తానీ మార్గాల ద్వారా పరోక్ష సమాలోచనలు కొనసాగుతున్నాయని దౌత్య వర్గాలు ధృవీకరిస్తున్నాయి. 
 
మధ్యవర్తిగా పాకిస్తాన్ ఆవిర్భవించడం ఇస్లామాబాద్‌కు ఒక వ్యూహాత్మక మలుపు. ఇది టెహ్రాన్‌తో తనకున్న దీర్ఘకాల సంబంధాలను ఉపయోగించుకోవడంతో పాటు, ట్రంప్ పరిపాలనతో సంబంధాలను మెరుగుపరుచుకుంటుంది. సురక్షిత ప్రయాణానికి హామీ ఇచ్చేందుకు, పలు దేశాలతో కూడిన హోర్ముజ్ నిర్వహణ కన్సార్టియం ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ గత వారం ఇస్లామాబాద్‌లో ప్రవేశపెట్టి, ప్రాంతీయ శక్తులకు ఆతిథ్యం ఇచ్చారు.
 
మరోవంక,  చైనా, పాకిస్తాన్ విదేశాంగ మంత్రులు సంయుక్తంగా తక్షణమే కాల్పుల విరమణ జరపాలని, నౌకాయానాన్ని పునరుద్ధరించాలని పిలుపునిచ్చారు. తద్వారా ఇస్లామాబాద్ చొరవకు బీజింగ్ మద్దతును స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఐదు అంశాల ప్రతిపాదనలు చేశారు.