హార్ముజ్ జలసంధి మూసివేతతో ఏప్రిల్లో చమురు సరఫరాలో అంతరాయం రెట్టింపు కానుందని, ఐరోపాపై కూడా తీవ్ర ప్రభావం పడనుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఇఎ) అధ్యక్షుడు ఫతిహ్ బిరోల్ పేర్కొన్నారు. ఎల్ఎన్జి నష్టానికి అదనంగా, ఏప్రిల్లో చమురు నష్టం మార్చి కన్నా రెట్టింపు కానుందని తెలిపారు. ప్రస్తుతం ప్రధానంగా జెట్ ఇంధనం, డీజిల్ కొరత ఆసియాదేశాల్లో చూస్తున్నామని, ఏప్రిల్ లేదా మేలో ఈ సంక్షోభం ఐరోపాను కూడా చుట్టుముట్టనుందని స్పష్టం చేశారు.
నార్జెస్ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సిఇఓ నికోలాయ్ టాంగెన్తో ఒక పాడ్కాస్ట్లో పాల్గొన్న బిరోల్ మాట్లాడుతూ పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇప్పటివరకు రోజుకు 12 మిలియన్ బ్యారెళ్ల చమురు సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. యుద్ధంతో మధ్యప్రాచ్యంలో సుమారు 40 కీలక ఇంధన వనరులు దెబ్బతిన్నాయని చెప్పారు. జెట్ ఇంధనం, డీజిల్ కొరత ప్రస్తుతం ఉన్న అతిపెద్ద సమస్యలని, ఒక వేళ ముడి చమురు సంక్షోభం ఏర్పడితే ఐఇఎ జోక్యం చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఇంధన కొరతను, ధరల పెరుగుదలను భర్తీ చేసేందుకు వ్యూహాత్మక నిల్వల నుండి రికార్డు స్థాయిలో చమురు నిల్వలను విడుదల చేసేందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ ఇరాన్ బలగాలు హర్మూజ్ జలసంధిలో తమ ఆధిపత్యం చాటుకునేందుకు బలప్రదర్శనకు దిగుతూ వస్తున్నాయి. దాదాపు పాతిక వరకూ సరుకు నౌకలపై దాడికి దిగారు.
ఇక పలు దేశాలు కలిసికట్టుగా హర్మూజ్ నుంచి రాకపోకల ప్రారంభానికి ఒత్తిడి తీసుకువస్తామని చెపుతున్నప్పటికీ ఇప్పటి యుద్ధ పరిస్థితిలో ఈ విషయంలో అడుగు ముందుకు పడలేదు. అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పుడు ముడి చమురు ధరలు బ్యారెల్కు 108 డాలర్లు స్థాయికి చేరింది. యుద్ధం ఆరంభం అయిన ఫిబ్రవరి 28 నుంచి చూస్తే ఇప్పుడు ఇది 50 శాతం పెరుగదలను చవిచూసింది.
భారత్ సహా కొన్ని అత్యంత సన్నిహిత మిత్రదేశాలకు తప్పితే మిగిలిన దేశాల చమురు నౌకలకు ప్రవేశం లేదని ఇరాన్ హెచ్చరిస్తూనే ఉంది. అయితే భారత్ చమురు నౌకల రాకపోకలు కూడా ఈ ప్రాంతం నుంచి చాలా జాప్యం అవుతున్నాయి.

More Stories
దేశంలో ఇంధన కొరత లేదు
వచ్చే 3 ఏళ్లలో 80 శాతం మంది ఐటీ ఉద్యోగులకు ఏఐ ముప్పు!
ఐప్యాక్ కార్యాలయాలలో ఈడీ సోదాలు