ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు బ్రిటన్ నడుం బిగించింది. హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచే అంశంపై త్వరలోనే ప్రపంచ దేశాలతో దౌత్యపరమైన సదస్సు నిర్వహించనున్నట్లు యూకే ప్రధాని కీర్ స్టార్మర్ వెల్లడించారు. ఈ సదస్సుకు బ్రిటన్ విదేశాంగ మంత్రి నాయకత్వం వహించనున్నట్లు తెలిపారు.
ఇందుకోసం అందుబాటులో ఉన్న ప్రతి దౌత్యమార్గాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. అయితే ఇరాన్ యుద్ధంలోకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దిగబోమని తేల్చిచెప్పారు. హర్మూజ్ జలసంధి గుండా భద్రతను బలోపేతం చేయడంతో పాటు నిత్యావసర వస్తువుల రవాణాను పునరుద్ధరించేందుకు 35 దేశాలు తమతో కలిసి పని చేసేందుకు ముందుకు వచ్చాయని ఆయన తెలిపారు. అందుకు సంబంధించిన ప్రకటనపై ఆయా దేశాలు సంతకాలు చేశాయని వెల్లడించారు.
‘‘నౌకాయాన స్వేచ్ఛను పునరుద్ధరించడం, చిక్కుకుపోయిన నౌకలు, నావికుల భద్రతకు హామీ ఇవ్వడం, కీలకమైన వస్తువుల రవాణాను పునఃప్రారంభించడం కోసం తీసుకోగలిగే అన్ని ఆచరణీయమైన దౌత్య, రాజకీయ చర్యలను ఈ సమావేశం అంచనా వేస్తుంది’’ అని స్టార్మర్ పేర్కొన్నారు. ‘‘ఆ సమావేశం అనంతరం యుద్దం ముగిశాక మన సామర్థ్యాలను ఎలా సమీకరించుకోవాలి, జలసంధిని ఎలా అందుబాటులోకి తీసుకురావాలి. సురక్షితంగా మార్చాలి అనే విషయాలను పరిశీలించడానికి మా సైనిక వ్యూహకర్తలతో సమావేశం ఏర్పాటుచేస్తాం’’ అని ఆయన వెల్లడించారు.
ఒప్పందంపై సంతకం చేసిన దేశాలలో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, నెదర్లాండ్ ఉన్నాయి. యుద్ధ ప్రభావం ఒక తరాన్ని వెనక్కి నెట్టేస్తుందని, 1970లలో ఇంధన సంక్షోభం మాదిరిగా ఉండొచ్చని బ్రిటిష్ ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ యుద్ధంలోకి తాము దిగమని స్పష్టం చేసిన స్టార్మర్, అమెరికా చేస్తున్న యుద్ధం వల్ల బ్రిటన్‌పై తీవ్ర ప్రభావం పడుతోందని పేర్కొన్నారు.
చర్చలు సఫలం అయ్యేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని స్టార్మర్ వెల్లడించారు. హర్మూజ్ జలసంధి విషయంలో తన మాట వినని యూకేకు అమెరికా సాయం చేయబోదన్న ట్రంప్ హెచ్చరికలపై స్టార్మర్ స్పందిస్తూ ఎవరు ఎంత ఒత్తిడి తీసుకువచ్చినా బ్రిటిష్ జాతీయ ప్రయోజనాల కోసమే ఆలోచిస్తానని స్పష్టం చేశారు.
అది తమ యుద్ధం కాదని, అందువల్లే అందులోకి వెళ్లదలుచుకోలేదని స్పష్టంచేశారు. ప్రస్తుత సంఘర్షణలతో యూకే భవిష్యత్తుపై గణనీయమైన ప్రభావం పడుతోందని, ఇంధన సరఫరాకు అంతరాయం కలగడంవల్ల జీవన వ్యయం పెరుగుతుందని ఆయన తెలిపారు. అయినప్పటికీ ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి దేశం సిద్ధంగా ఉందని స్టార్మర్ చెప్పారు. ప్రస్తుత సమయంలో అమెరికాతో కంటే సహచర ఐరోపా దేశాలతో బలమైన సంబంధాలు కలిగి ఉండటమే బ్రిటన్‌కు ప్రయోజనకరమని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శల నేపథ్యంలో కీర్ స్టార్మర్ నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. ఇరాన్‌పై యుద్ధంలో తమకు సహకరించని దేశాలను ఉద్దేశించి ట్రంప్ ఘాటుగా స్పందిస్తూ హర్మూజ్ జలసంధి మూసివేతతో ఇంధనం దొరక్క ఇబ్బంది పడుతున్న బ్రిటన్ వంటి దేశాలు రెండే ఆప్షన్లు ఉన్నాయని, ఒకటి అమెరికా దగ్గర పుష్కలంగా ఉన్న ఇంధనం కొనుగోలు చేయడం, రెండు ధైర్యం చేసి హర్మూజ్ వద్దకు వెళ్లి తెచ్చుకోవడం అంటూ ఎద్దేవా చేశారు.
ఈ సంఘర్షణ కారణంగా అట్లాంటిక్ ఆవలి సంబంధాలు క్షీణిస్తున్న తరుణంలో ఇరాన్‌పై యుద్ధంలో చేరడానికి నిరాకరించిన ఐరోపా దేశాలు, ముఖ్యంగా బ్రిటన్, ఫ్రాన్స్‌లపై ట్రంప్ విమర్శలు గుప్పిస్తున్నారు. రెండు బ్రిటిష్ స్థావరాల నుంచి ఇరాన్‌పై దాడులకు అమెరికా చేసిన అభ్యర్థనను స్టార్మర్ మొదట తిరస్కరించారు. ఆ తర్వాత రక్షణాత్మక చర్యలకు అనుమతించడానికి అంగీకరించారు. ఇది ట్రంప్‌ను తీవ్ర అసహనానికి గురిచేసింది.

More Stories
ఇరాన్లో రివల్యూషనరీ గార్డ్ స్వాధీనంలో ప్రభుత్వం?
కాంగ్రెస్ వస్తే చొరబాటుదారులకు రక్షణగా చట్టం
హఫీజ్ సయీద్ కొడుకుతో పాక్ ప్రధాని సలహాదారు!