యుద్ధ ప్రభావం ప్రజలపై పడకుండా చూడాలి

యుద్ధ ప్రభావం ప్రజలపై పడకుండా చూడాలి
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రభావం ప్రజల మీద పడకుండా అన్ని స్థాయిల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని, మంత్రులను ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన ‘భద్రతా వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ’ (సీసీఎస్‌) యుద్ధం నేపథ్యంలో కేంద్రప్రభుత్వ మంత్రిత్వశాఖలు, విభాగాలు తీసుకుంటున్న చర్యలను సమీక్షించింది. 
 
ఇంధనం, వ్యవసాయం, పౌర విమానయా నం, సరఫరాలు తదితర రంగాల్లో తదుపరి చేపట్టాల్సిన పనులపై చర్చించింది. ఎటువంటి అవాంతరా లు లేకుండా ఎల్‌పీజీ, ఎల్‌ఎన్‌జీ సరఫరా ప్రక్రియ కొనసాగేలా చూడటం, వాటి దిగుమతులకు కొన్ని దేశాల మీదే ఆధారపడకుండా పలు దేశాల నుంచి దిగుమతి చేసుకోవటంపై క్యాబినెట్‌ కార్యదర్శి ఈ సమావేశంలో వివరణ ఇచ్చారు. 
ఈ సందర్భంగా ఖరీఫ్‌, రబీ సీజన్లలో రైతులకు ఎరువుల సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ప్రధాని నిర్దేశించారు. తప్పుడు ప్రచారాలు, వదంతులు వ్యాప్తి కాకుండా ఎప్పటికప్పుడు కచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు అందించాలని స్పష్టం చేశారు. “పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాను, ముఖ్యంగా ఎల్ఎన్జీ/ఎల్‌పీజీ  సరఫరాను, అలాగే తగినంత విద్యుత్ లభ్యతను నిర్ధారించడానికి తీసుకున్న చర్యల గురించి క్యాబినెట్ కార్యదర్శి వివరించారు,” అని సమావేశం అనంతరం విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. 
 
“వివిధ దేశాల నుండి కొత్త వనరుల ద్వారా ఎల్‌పీజీ సేకరణకు సంబంధించిన వనరులను వైవిధ్యపరుస్తున్నారు. ఎల్ఎన్జీ వివిధ దేశాల నుండి సేకరిస్తున్నారని, అలాగే గృహ వినియోగదారులకు ఎల్‌పీజీ  ధరలు సంక్షోభానికి ముందు ఉన్న స్థాయిలోనే కొనసాగుతున్నాయి” అని క్యాబినెట్ కార్యదర్శి  మోదీకి తెలియజేశారు. నిత్యావసరాల ధరలు పెరగకుండా కట్టుదిట్టమైన చ ర్యలు తీసుకోవాలని, బ్లాక్‌మార్కెటింగ్‌పై ఉక్కుపా దం మోపాలని పునరుద్ఘాటించారు. ఈ మేరకు కఠిన చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు సూచించారు. దిగుమతులకు ఇబ్బంది తలెత్తకుండా హొర్ముజ్‌ జలసంధి గుండా భారత నౌకలు సురక్షితంగా వచ్చేలా చూడటంపై సమీక్ష జరిపారు.