అస్సాంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చొరబాటుదారులకు రక్షణ కల్పించేందుకు చట్టాన్ని తీసుకు వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. అయితే అటువంటి పరిస్థితిని బిజెపి, దాని మిత్రపక్షాలు అనుమతించవని స్పష్టం చేశారు. అస్సాంలో ధేమాజీ జిల్లాలోని గోగాముఖలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొంటూ ‘మెజారిటీ వర్గాన్ని మైనారిటీగా మార్చి, చొరబాటుదారుల శాశ్వత ఓటు బ్యాంకును సృష్టించడమే కాంగ్రెస్ లక్ష్యం’ అని ధ్వజమెత్తారు.
అస్సాంలో చొరబాటుదారులకు రక్షణ కల్పించేందుకు కొత్త చట్టం తీసుకువస్తామని కాంగ్రెస్ నేతలు బహిరంగంగా చెబుతూ, వారికి మద్దతు ఇస్తున్నారని ప్రధాని ఆరోపించారు. దేశ విభజన సమయంలో ముస్లిం లీగ్ చేసిన విధంగానే, ఆ పురాతన పార్టీ కూడా దేశాన్ని విభజించడానికి ప్రయత్నిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
“2014కి ముందు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం మత హింసపై ఒక బిల్లును తీసుకురావడానికి ప్రయత్నించింది. ఓ నిర్దిష్ట ఓటు బ్యాంకును సంతృప్తి పరచడమే ఈ బిల్లు లక్ష్యం. ఈ బిల్లు హింసకు పాల్పడిన వారిలో మెజారిటీ వర్గాన్ని దోషులుగా, మైనారిటీలను బాధితులుగా చిత్రీకరిస్తుంది. ఇది విభజనవాద బిల్లు. బీజేపీ దీనిని వ్యతిరేకించింది” అని ప్రధాని గుర్తు చేశారు.
ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పొంది ఉంటే సమాజంలోని మెజారిటీ వర్గం ఎంతటి వేధింపులను ఎదుర్కొని ఉండేదో ఊహించండని ఆయన కోరారు. ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అసోంలో అలాంటి బిల్లునే తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని హెచ్చరించారు. ఎన్నికల్లో గెలవడానికే కాంగ్రెస్ నాయకులు ఈ విషయాన్ని బహిరంగంగా చెబుతున్నారని ఆయన మండిపడ్డారు.
బాబా సాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని కూడా కాంగ్రెస్ ఛిద్రం చేసిందని చెబుతూ బిజెపి తిరిగి అధికారంలోకి వస్తే, అస్సాం గుర్తింపు కాపాడటానికి ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తుందని, ఆరవ షెడ్యూల్ కింద గిరిజనులకు రక్షణ కల్పిస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు. బిజెపి హయాంలో పదేళ్ల ప్రభుత్వ పాలన సేవ- సుపరిపాలన యుగంగా ఆయన అభివర్ణించారు.
తొలుత సర్బానంద సోనోవాల్ నాయకత్వంలో, ఆ తర్వాత బిస్వా శర్మ మార్గదర్శకత్వంలో గత పదేళ్లలో అస్సాం సేవ, సుపిపాలనలో ఒక కొత్త శకానికి సాక్ష్యంగా నిలిచిందని ప్రధాని చెప్పారు. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం, అభివృద్ధి చెందిన అస్సాంను నిర్మించే ఎన్నికలే ఈ అస్సాం ఎన్నికలు అని తెలిపారు. ఈసారి, బిజెపి-ఎన్‌డిఎ ప్రభుత్వానికి హ్యాట్రిక్ ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. =
అలాగే కాంగ్రెస్‌కు హ్యాట్రిక్ పరాజయమే కాకుండా వారి ‘యువరాజు’ ఓటముల్లో సెంచరీని పూర్తి చేసుకోబోతున్నారని మోదీ ఎద్దేవా చేశారు. గత పదేళ్ల కాలంలో అసోంకు చెందిన వేలాది మంది యువత తుపాకులను పక్కన పెట్టి భవిష్యత్తుపై దృష్టిసారించారని తెలిపారు. కాంగ్రెస్ తన పాలనలో మౌలిక సదుపాయాల లోపాలను సరిదిద్దడంలో విఫలమైందని ఆరోపించారు. ఈ పర్యటన సందర్బంగా మోదీ టీ తోటలకు వెళ్లి మహిళలతో ముచ్చటించారు. ఫొటోలకు ఫోజులిచ్చారు.

More Stories
ఇరాన్లో రివల్యూషనరీ గార్డ్ స్వాధీనంలో ప్రభుత్వం?
యుద్ధ ప్రభావం ప్రజలపై పడకుండా చూడాలి
హర్మూజ్‌ను తెరిచేందుకు 35 దేశాలతో బ్రిటన్ దౌత్య సదస్సు