సోషల్ మీడియాపై పోలీసుల నిఘా.. నేరుగా కేంద్రమే నోటీసులు!

సోషల్ మీడియాపై పోలీసుల నిఘా.. నేరుగా కేంద్రమే నోటీసులు!

* అభ్యంతకర పోస్టులకు ఇక యూజర్లే బాధ్యులు!

మాటలతో రెచ్చగొట్టి సోషల్ మీడియా ద్వారా ప్రపంచ యుద్ధ వాతావరణాన్ని అవకాశంగా మార్చుకున్న అసాంఘిక శక్తులు గుట్టుగా గ్రూపులు నిర్వహిస్తున్నాయి. టెలిగ్రామ్, ఇన్‌స్టా వేదికగా విద్యార్థులు, నిరుద్యోగులను టార్గెట్ చేస్తున్నట్లు రాష్ట్ర నిఘా వర్గాలు గుర్తించాయి. హైదరాబాద్‌లో కొందరిని అదుపులోకి తీసుకుని పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. 

ఇటీవల విజయవాడలో ఉగ్ర లింకుల వ్యవహారం బయటపడటం హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్ అవడంతో ఇక్కడి పోలీసులు సైతం ప్రత్యేక నిఘా పెట్టారు. సామాజిక మాధ్యమాల వేదికగా యువతను రెచ్చగొట్టి తీవ్రవాదంపై ఆకర్షిస్తున్న అసాంఘికశక్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిఘా పెంచాయి.    ప్రస్తుతం ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్‌ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని అవకాశంగా మలచుకొని యువతను ఉగ్రవాదం వైపు మళ్లించేలా వీడియోలు రూపొందిస్తున్నట్టు నిఘావర్గాలు గుర్తించాయి. 

హైదరాబాద్‌కు చెందిన కొందరు విద్యార్థులు, నిరుద్యోగులతో టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా మంతనాలు సాగిస్తున్నట్లు గుర్తించి అప్రమత్తమయ్యారు. కొందరు యువకుల్ని అదుపులోకి తీసుకొని మందలించినట్టు తెలుస్తోంది. వీరి కదలికలపై నిఘా ఉంచాలని సంబంధిత పోలీస్‌స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. ఇటీవల చంచల్‌గూడకు చెందిన మహిళకు ఉగ్రలింకులతో సంబంధాలున్నట్టు విజయవాడ పోలీసులు గుర్తించారు. ఆమె నివాసంలో సోదాలు నిర్వహించి అరెస్ట్‌ చేయడం సంచలనంగా మారింది. 

గతేడాది లాలాగూడలోని యువకుడు దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్రపన్నిన కేసులో విజయనగరం పోలీసులు అరెస్ట్‌ చేశారు. సాధారణ జీవితం గడిపే వీరిద్దరూ సామాజిక మాధ్యమాల్లో ఏర్పడిన పరిచయాలతో ఉగ్రవాదం వైపు ఆకర్షితులైనట్టు దర్యాప్తులో గుర్తించారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన కొంతమంది యువకులు విదేశీ శక్తుల మాటల వలలో చిక్కినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. 

విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారనే అనుమానంతో వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించినట్టు విశ్వసనీయ సమాచారం. టెలిగ్రామ్‌ యాప్‌లోని గ్రూపులో జతకట్టిన అపరిచితుల మాటల ప్రభావంతో తప్పటడుగులు వేశామని మరోసారి తప్పు చేయమంటూ కాళ్లావేళ్లా పడినట్టు తెలిసింది. వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్‌ ఇచ్చినట్టు సమాచారం.

మరోవంక, ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌మీడియా వేదికల మీద ఇకపై ఏదైనా పోస్ట్‌ చేస్తే, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి ఇక నేరుగా నోటీసులు వచ్చే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌ వేదికలపై తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే యూజర్లను, కంటెంట్‌ క్రియేటర్లను, సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను కూడా న్యూస్‌ పబ్లిషర్లుగానే ఇకపై కేంద్రం చూడబోతున్నది. 

 
అభ్యంతరకరమైన పోస్టులు పెడితే, నేరుగా యూజర్లకే నోటీసులు పంపించనున్నది. ఈ మేరకు ఐటీ నిబంధనలు, 2021లో కొన్ని సవరణలు ప్రతిపాదిస్తూ సోమవారం ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది. దీనిపై ఏప్రిల్‌ 14 నాటికి అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా కోరింది. సోషల్‌మీడియాలో యూజర్లు ఏదైనా పోస్టు పెట్టినప్పుడు అభ్యంతరకరంగా ఉన్నదని కేంద్రం భావిస్తే, సదరు పోస్టును తొలగించాలంటూ ఆ పోస్టు ప్రచురితమైన ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌కు (మాతృసంస్థకు) ఇప్పటివరకూ కేంద్రం నోటీసులు జారీ చేసేది.
 
అయితే, తాజా సవరణలు అమల్లోకి వస్తే, ఇప్పుడు నేరుగా ఆ పోస్టును పెట్టిన లేదా షేర్‌ చేసిన యూజర్లకే ఆ నోటీసులు అందుతాయి. అంతేకాకుండా ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ జారీ చేసే సలహాలు, సూచనలు పాటించనటువంటి సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌లు తమకు ఇవ్వబడిన ‘చట్టాల నుంచి రక్షణ’ హోదాను కూడా కోల్పో యే ప్రమాదం ఉన్నది.