ఇరాన్‌లోని కీలక అణు కేంద్రమైన ఇస్ఫహాన్‌లోని ఆయుధ డిపోను లక్ష్యంగా చేసుకుని అమెరికా-ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా జరిపిన వైమానిక దాడితో పట్టణంలో భారీ పేలుళ్లు సంభవించాయి. 1200 కిలోల ముందుగుండుతో ప్రయోగించిన బంకర్ బస్టర్ బాంబులు లోతైన భూగర్భంలో ఉన్న అణు ఆయుధ డిపోను లక్ష్యంగా చేసుకుని పేలుడు సృష్టించాయని అమెరికన్ అధికారి ఒకరు పేర్కొన్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది.
ఈ దాడి అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం తెల్లవారుజామున ఇస్ఫహాన్‌లోని ఆయుధ డిపోపై జరిగిన దాడి దృశ్యాల వీడియోను తన ట్రూత్ సోషల్‌లో షేర్ చేశారు. వరుస పేలుళ్లు, భారీగా మంటలు ఎగసిపడుతున్న దృశ్యాలు అందులో కనిపించాయి.
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో వాయువ్య ఇరాన్‌లో నలుగురు మరణించగా, 26 మంది గాయపడ్డారని, ఒక షియా ముస్లిం మసీదు, మతపరమైన ప్రదేశం దెబ్బతిన్నాయని ఇరాన్ మీడియా నివేదించింది. జంజాన్ నగరంలోని ఫెర్దోసి వీధిపై శత్రువులు ఉదయం జరిపిన దాడిలో షియా సమావేశాలు, సంతాప కార్యక్రమాలు నిర్వహించే ‘గ్రాండ్ హుస్సేనియా’ భవనం దెబ్బతిందని ప్రభుత్వ టెలివిజన్ తెలిపింది. “భవనం గోపురం, మినార్ల భాగాలు దెబ్బతిన్నాయి” అని కూడా అది పేర్కొంది.
కాగా, ఇరాన్ సుమారు 540 కిలోల యురేనియం నిల్వలను ఇస్ఫహాన్‌లో ఓ భూగర్భ కేంద్రానికి తరలించినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు.. తమతో ఒప్పందం కుదుర్చుకోకపోతే ఇరాన్‌లో భారీ విధ్వంసాన్ని సృష్టిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇక్కడ భారీఎత్తున దాడులు జరగుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కాగా, హొర్ముజ్ జలసంధిలోని ఇరాన్‌కు చెందిన ఖేష్మ్ దీవిలోని ఉప్పు నీటి శుద్ధీకరణ ప్లాంటు(డీశాలినేషన్)పై మంగళవారం వైమానిక దాడి జరిగినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. ఈ దాడి కారణంగా ప్లాంటు పూర్తిగా పనికిరాకుండా పోయినట్లు మీడియా పేర్కొంది. ఇరాన్ భూభాగంపై జరిగిన దాడులకు ప్రతీకారంగా అమెరికాకు చెందిన టెక్నాలజీ, పారిశ్రామిక కంపెనీలపై ఏప్రిల్ 1 నుంచి దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, ఇంటెల్, ఐబీఎం, టెస్లా, బోయింగ్ సహా 18 కంపెనీల పేర్లను ఐఆర్‌జీసీ పేర్కొంటూ ఈ కంపెనీల ప్రాంతీయ కార్యకలాపాలను స్తంభింపచేస్తామని హెచ్చరించింది. ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 28న దక్షిణ ఇరాన్‌లోని ఒక క్రీడా మందిరం, పాఠశాలపై దాడి చేసినప్పుడు, అమెరికా సైన్యం ‘ప్రెసిషన్ స్ట్రైక్ మిస్సైల్’ అనే కొత్త ఆయుధాన్ని తొలిసారిగా ప్రయోగించిందని ‘ది న్యూయార్క్ టైమ్స్’ తెలిపింది. స్థానిక అధికారుల ప్రకారం, ఈ దాడిలో వాలీబాల్ ఆడుతున్న బాలికలతో సహా కనీసం 21 మంది మరణించారు. ప్రెసిషన్ స్ట్రైక్ మిస్సైల్ ను అమెరికా సైన్యం తమ సరఫరా వ్యవస్థలో ఇంకా అధికారిక నమోదు చేర్చలేదు.

More Stories
హర్మూజ్ జలసంధిలో నౌకలకు ఇరాన్ టోల్ ఫీజు
పాలస్తీనియన్లు ఉగ్రదాడులకు పాల్పడితే మరణదండనే
ఇరాన్‌పై అణుదాడికి సన్నాహాలు.. ఐరాస దౌత్యవేత్త రాజీనామా