పశ్చిమ ఆసియా దేశాలతో స్థానిక కరెన్సీలలో భారత్ వాణిజ్యం?

పశ్చిమ ఆసియా దేశాలతో స్థానిక కరెన్సీలలో భారత్ వాణిజ్యం?

పెరుగుతున్న చమురు ధరలు, క్షీణిస్తున్న రూపాయి వల్ల కలిగే ఆర్థిక ద్వంద్వ దెబ్బను తగ్గించే ప్రయత్నంలో భాగంగా కరెన్సీ మార్పిడి ఖర్చులను ఆదా చేయడం కోసం కూడా పశ్చిమ ఆసియా దేశాలతో స్థానిక కరెన్సీలలో వాణిజ్యం జరపడానికి భారత ప్రభుత్వం “ప్రయోగాలు” చేస్తోందని ప్రభుత్వంలోని  సీనియర్ అధికారులు తెలిపారు. ఇది విజయవంతమైతే, భారతదేశం తన చమురు దిగుమతులలో సుమారు 80% అమెరికా డాలర్‌కు బదులుగా స్థానిక కరెన్సీలలో చెల్లించేందుకు వీలవుతుంది. 

“జీసీసీ [గల్ఫ్ సహకార మండలి] దేశాల నుండి దిగుమతులకు స్థానిక కరెన్సీలలో చెల్లించేందుకు భారతదేశం ఒక యంత్రాంగాన్ని రూపొందిస్తోంది,” అని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు. చమురు ధరల పెరుగుదల, రూపాయి విలువ పతనం ఈ చర్యకు కారణాలని ఆయన వివరించారు.  ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఒమన్, దుబాయ్‌ల నుండి లభించే వివిధ రకాల చమురు, బ్రెంట్ క్రూడ్ ధరల సగటు అయిన ‘ఇండియన్ బాస్కెట్ ఆఫ్ ఆయిల్’ ధర ప్రస్తుతం బ్యారెల్‌కు $123.15గా ఉంది. ఫిబ్రవరి 2026లో బ్యారెల్‌కు సగటున 69 డాలర్లుగా ఉన్న ధర ఇప్పుడు పెరిగింది. 

ఈ వారం ప్రారంభంలో రూపాయి డాలర్‌కు రూ. 94.1 వద్ద సర్వకాలీన కనిష్ట స్థాయికి మారకం విలువ పడిపోయి, ఆ తర్వాత కొద్దిగా పెరిగింది. ఇరాన్ యుద్ధం ప్రారంభం కావడానికి ముందు మారకం రేటు డాలర్‌కు సుమారు రూ. 91.3 వద్ద ఉండేది. ఈ రెండు అంశాల కలయిక వల్ల, భారతీయ దిగుమతిదారులు అమెరికా. డాలర్‌లో జరిపే ప్రతి దిగుమతి లావాదేవీకి, ముఖ్యంగా చమురు విషయంలో, చాలా ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. 

వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని మరో అధికారి ప్రకారం, ఇటువంటి స్థానిక కరెన్సీ విధానం ద్వారా భారతదేశానికి లభించే మరో ప్రయోజనం, కరెన్సీ మార్పిడి ఛార్జీలలో గణనీయమైన తగ్గింపు.  ప్రధానంగా, పలు దశలలో కరెన్సీ మార్పిడి ఖర్చును ఆదా చేసుకోవడానికి. రూపాయిని డాలర్‌లోకి, డాలర్‌ను అక్కడి స్థానిక కరెన్సీలోకి, స్థానిక కరెన్సీని తిరిగి డాలర్‌లోకి, ఆపై డాలర్‌ను తిరిగి రూపాయిలోకి మార్చేటప్పుడు అయ్యే ఛార్జీలను ఆదాచేసేందుకు వీలవుతుంది. 

ప్రతి మార్పిడికి మొత్తం లావాదేవీ విలువలో సుమారు 1-2% ఖర్చవుతుంది. కాబట్టి మనం కేవలం స్థానిక కరెన్సీలలోనే లావాదేవీలు జరిపితే సుమారు 5-6% ఆదా అవుతుంది. అధిక విలువ కలిగిన లావాదేవీల విషయానికి వస్తే ఇది చాలా పెద్ద మొత్తం. భారతదేశం ప్రస్తుతం రష్యా చమురు కోసం ఇప్పటికే స్థానిక కరెన్సీలు, దిర్హమ్‌ల కలయికతో చెల్లిస్తోంది. 

ఏప్రిల్ 2025 నుండి జనవరి 2026 మధ్య కాలంలో భారతదేశం చమురు దిగుమతులలో 30.4% రష్యా నుండే జరిగాయి. గల్ఫ్ సహకార మండలి దేశాల వాటా మరో 49%. వీటన్నింటినీ కలిపి చూస్తే, అటువంటి స్థానిక కరెన్సీ ఒప్పందం వల్ల భారతదేశం చమురు దిగుమతులలో దాదాపు 80% అమెరికా డాలర్ కాకుండా ఇతర కరెన్సీలలో చెల్లించబడుతుంది.

అయితే, ఇంతటి అధిక విలువ కలిగిన లావాదేవీల కోసం డాలర్ వాడకాన్ని తగ్గించడం అమెరికన్ల ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం లేకపోలేదు. డాలర్‌కు ప్రత్యామ్నాయ కరెన్సీలను స్వీకరించాలని చూస్తున్న దేశాలపై 100% సుంకం విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో బెదిరించారు. అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఈ బెదిరింపును తొలగించి ఉండవచ్చు, కానీ సుంకాలను ఒక బలవంతపు సాధనంగా ఉపయోగించాలన్న ట్రంప్ పట్టుదల మాత్రం అలాగే ఉంది.