హర్మూజ్ జలసంధిలో నౌకలకు ఇరాన్ టోల్ ఫీజు

హర్మూజ్ జలసంధిలో నౌకలకు ఇరాన్ టోల్ ఫీజు
ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాకు అత్యంత కీలకమైన  హర్మూజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా తమ ఆధీనంలోకి   తీసుకుంటోంది. తాజాగా, ఆ మార్గంలో ద్వారా ప్రయాణించే నౌకల నుంచి టోల్‌ రుసుం వసూలకు ఇరాన్‌ పార్లమెంట్‌ భద్రత కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో ఆ జలసంధి మీదుగా ప్రయాణించే నౌకల నుంచి ఇరాన్ ఇకపై అధికారికంగా టోల్‌ ఫీజు వసూలు చేయనుంది. 
 
ఈ మేరకు హర్మూజ్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాన్‌కు పార్లమెంట్ కమిటీ అనుమతించింది. ఒక్కో ఆయిల్ ట్యాంకర్‌పై గరిష్ఠంగా రూ.18.90 కోట్లు ఫీజు వసూలు చేయనున్నట్టు ఇరాన్ అధికారిక మీడియా ఐఆర్‌ఐబీ వెల్లడించింది. ఈ మొత్తాన్ని తమ కరెన్సీ రియాల్‌లోనే చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. హర్మూజ్ జలసంధిపై తమ సార్వభౌమత్వాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఇరాన్ స్పష్టం చేసింది.

వీటిలో జల సంధిని పరిరక్షించే భద్రతా ఏర్పాట్లు, సముద్రయాన భద్రత, ఆర్థిక నిబంధనలు, అమెరికా, ఇజ్రాయెల్‌ ట్యాంకర్ నౌకలపై నిషేధం వంటివి ఉన్నాయని తెలిపింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) నిర్దేశించిన టోల్‌ ఫీజు నిబంధనల అమల్లోకి వచ్చిన తర్వాత 26 నౌకలు రుసుం చెల్లించి హర్మూజ్‌ను దాటినట్లు పేర్కొంది. ఇందుకోసం ఆయా ట్యాంకర్లు అవసరమైన పత్రాలను సమర్పించి, క్లియరెన్స్‌ కోడ్‌లు పొందినట్లు వివరించింది. 

 
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడి తర్వాత ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ)హర్మూజ్ జలసంధిని పాక్షికంగా మూసివేసింది. ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే చమురు రవాణా మార్గాలలో ఒకటైన ఈ జలసంధి ద్వారా ప్రపంచంలోని దాదాపు 20% చమురు, లిక్విడ్ నేచురల్ గ్యాస్ రవాణా జరుగుతుంది. ఇది ప్రపంచ ఇంధన సంక్షోభానికి దారితీసి, చమురు, గ్యాస్ ధరల పెరుగుదలకు కారణమైంది. 

కాగా, హర్మూజ్‌ జల సంధి విషయంలో ఇరాన్‌ తీసుకున్న నిర్ణయంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలాలపై ఇరాన్ నియంత్రణను ప్రపంచ దేశాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోవని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. ఇతర దేశాలనే కాకుండా అంతర్జాతీయ జలమార్గాలను కూడా ఆక్రమించుకుని, అవి తమవిగా చెప్పుకునే కొత్త సంప్రదాయం మొదలైందని ఆయన విమర్శించారు.
 
ఇక, హర్మూజ్‌లో నౌకలపై టోల్‌ ఫీజు విధింపు నిర్ణయాన్ని జీ7 దేశాలు తప్పుబట్టాయి. స్వేచ్ఛాయుత నౌకాయానం పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని తెలిపాయి. కాగా, భారత్ సైతం హర్మూజ్‌లో టోల్ ఫీజు విధింపుపై ముందు నుంచే అభ్యంతరం చెప్పింది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఆ జల సంధిలో నౌకల రవాణకు ఎలాంటి సుంకం లేదా రుసుము విధించలేరని పేర్కొంది.