లైంగిక వేధింపుల కేసులో మాలీవుడ్ డైరెక్టర్, నటుడు రంజిత్ బాలకృష్ణన్ ను అరెస్ట్ చేశారు. ఓ మలయాళ యువ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేరళ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో ప్రవేశపెట్టగా మెజిస్ట్రేట్ 14 రోజుల జ్యూడిషల్ రేమండ్ విధించడంతో ఎర్నాకులం జైలుకు పంపారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఒక సినిమా సెట్‌లో రంజిత్ బాలకృష్ణన్ తనతో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఇటీవల సదరు నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇడుక్కి జిల్లాలో రంజిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఫిల్మ్ షూటింగ్ సమయంలో తనను కారవాన్‌కు రావాలని డైరెక్టర్ పిలిచారని, ఆ సమయంలో అతను లైంగిక దాడికి పాల్పడినట్లు ఆమె పేర్కొన్నది. కొచ్చి సిటీ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. రంజిత్ బాలకృష్ణన్ పై లైంగిక ఆరోపణలు రావడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలోనూ పలువురు నటీమణులు ఆయనపై ఇలాంటి ఫిర్యాదులు చేశారు. 2024 ఆగస్టులో శ్రీలేఖ మిత్రా అనే బెంగాలీ నటి కూడా ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. తనపై వచ్చిన ఆరోపణలను రంజిత్ ఖండించినప్పటికీ, కేరళ చలనచిత్ర అకాడమీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు తాజాగా ఆయనపై మరో నటి లైంగిక ఆరోపణలు చేయడం, ఆ కేసులో పోలీసులు అరెస్ట్ చేయడంతో దర్శకుడు చిక్కుల్లో పడ్డట్లయింది. రంజిత్ బాలకృష్ణన్ మూడున్నర దశాబ్దాలుగా మలయాళ చిత్ర పరిశ్రమలో ఉన్నారు. రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా రాణించారు. మాలీవుడ్ స్టార్ హీరోలతో ఎన్నో విజయవంతమైన సినిమాలు రూపొందించారు.ఓటీటీల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’, ‘వన్’, ‘ముకుందన్ ఉన్ని అసోసియేట్స్’, ‘తలవన్’ వంటి మలయాళ చిత్రాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు. గతేడాది ‘ఆరో – సమ్ వన్’ అనే షార్ట్ ఫిలిం డైరెక్ట్ చేశారు. ఆయన కెరీర్ లో 3 నేషనల్ ఫిలిం అవార్డ్స్ తో సహా ఎన్నో పురష్కారాలు అందుకున్నారు. మలయాళ సినీ ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి కేరళ సర్కార్ ‘హేమ కమిటీ’ని నియమించిన సంగతి తెలిసిందే. హేమా కమిటీ నివేదిక నేపథ్యంలో, రంజిత్ బాలకృష్ణన్ పై పోలీసులు రెండు లైంగిక వేధింపుల కేసులను నమోదు చేశారు. 2009లో ఆయన తీసిన ‘పలేరి మాణిక్యం: ఒరు పతిరకొలపాతకతింటే కథ’ మూవీ ఆడిషన్ సమయంలో ఎర్నాకుళంలోని ఒక ఫ్లాట్‌లో తనపై లైంగిక దాడికి ప్రయత్నించాడని శ్రీలేఖ మిత్రా ఆరోపణలపై నమోదు చేసిన కేసును తగిన ఆధారాలు లేవని 2025 అక్టోబర్ లో కేరళ హైకోర్టు కొట్టివేసింది.
More Stories
హింస మరింత సంఘర్షణకే దారితీస్తుంది.. దలైలామా హెచ్చరిక
చత్తీస్‌గఢ్ ఇక నక్సల్స్ రహిత రాష్ట్రం
బీజేపీలో చేరిన టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్