* మహిళల సాధికారికతకు అస్సాం బిజెపి పెద్ద పీట
అసోం 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార బీజేపీ 31 హామీలతో మ్యానిఫెస్టోను కేంద్రం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ సైకియా తదితరులు విడుదల చేశారు. మూడోసారి ఎన్నికైతే అసోం యాక్ట్ 1950 ప్రకారం రాష్ట్రం నుంచి బంగ్లాదేశీయులను తరిమేస్తామని సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు.
24 గంటల్లోగా జిల్లా అధికారులతో కలిసి బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన వారిని పంపించేస్తామని, ఒక్క అంగుళం భూమిని కూడా అసోం నుంచి వారికి ఇవ్వబోమని స్పష్టం చేశారు. అసోంలో ఉమ్మడి పౌరస్మృతి (యుసిసి), అమలు చేయడంతోపాటు, లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్‌ను అడ్డుకుంటామని హామీ ఇచ్చారు. సురక్షితమైన, అసోంను అభివృద్ధి పథంలో నడిపించడమే తమ లక్ష్యమని దిలీప్ సైకియా తెలిపారు.
ఐదేళ్లలో అసోంను వరదల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దటం, మొదటి రెండేళ్లలో వరదల నివారణ కోసం రూ.18,000 కోట్లు కేటాయింపు, యూసీసీకి సంబంధించి ఆరో షెడ్యూల్ ప్రకారం గిరిజన ప్రాంతాలను మినహాయింపు వంటి హామీలను చేర్చారు. ఇందులో మహిళల సాధికారతకు బిజెపి పెద్దపీట వేసింది. మహిళలకు ‘ఒరునోదోయ్’ పథకం కింద నగదు సహాయాన్ని రూ.3000కు పెంచుతామని హామీ ఇచ్చింది.
అలాగే, లఖ్పతి దీదీ పథకం ద్వారా 40 లక్షల మహిళలను లక్షాధికారులుగా తయారు చేసేందుకు రూ.25,000 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపింది. అసోంను అత్యంత ప్రకాశవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే బీజేపీ లక్ష్యమని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పాలనలో ఎన్నో అవాంతరాలు జరిగాయని, కేవలం 2007లోనే 474 దాడులు జరిగాయని, అందులో 287మంది పౌరులు మరణించారని గుర్తు చేశారు. కానీ, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గణనీయంగా మార్పులు వచ్చాయని, నేడు అసోంలో శాంతి పరిస్థితులు నెలకొన్నాయని ఆమె తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలు బృహత్తర స్థాయిలో అమలవుతున్నాయని చెప్పారు.
నేడు, అసోంలోని 81.65 శాతం గృహాలు ‘జల్ జీవన్ మిషన్’ తాగునీటి పథకం పరిధిలోకి వచ్చాయని, అలాగే అసోంలో కేవలం నాలుగేళ్లలోనే గణనీయమైన వృద్ధి నమోదు అయ్యిందని నిర్మలా పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రత్యేక దృష్టి పెట్టడం, ఐదేళ్లలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం, రాష్ట్రంలో ఉచిత విద్యను అందించడం, తేయాకు తోటల్లో పని చేసే కార్మికులకు రోజువారీ వేతనం రూ.500కు పెంచడం, రవాణా రంగానికి రూ.5 లక్షల కోట్లు కేటాయింపు వంటి హామీలు ఇచ్చారు. వన్ డిస్ట్రిక్, వన్ ఇనిస్టిట్యూషన్ మోడల్ కింద ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, ఒక యూనివర్సిటీ, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేస్తారు.

More Stories
భారత్‌కు వెళ్తున్న ఇరాన్ విమానంపై అమెరికా దాడి
ప్రైవేటు వ్యక్తులకు లక్షన్నర ఎకరాల ఆలయ భూములా?
డాలర్‌కు 95 మార్కును దాటిన రూపాయి .. నిర్మలా భరోసా