భారత్ కు మరో రెండు ఎల్‌పీజీ నౌకలు

భారత్ కు మరో రెండు ఎల్‌పీజీ నౌకలు
భీకర దాడులతో అట్టుడుకుతున్న హార్ముజ్ జలసంధి గుండా భారత జెండాతో ఉన్న మరో రెండు ఎల్‌పీజీ కార్గో నౌకలు సురక్షితంగా బయటపడ్డాయి. దేశంలో ఒక రోజుకు సరిపడా వంటగ్యాస్‌ను ఈ నౌకలు మోసుకొస్తున్నాయి. రాబోయే రెండు, మూడు రోజుల్లో ఇవి భారత్‌కు చేరుకోనున్నాయి. సుమారు 94 వేల టన్నుల ఎల్‌పీజీ కార్గోతో వస్తున్న బిడబ్ల్యు టైర్‌, బిడబ్ల్యు ఈఎల్ఎం అనే రెండు భారతీయ నౌకలు తాజాగా జలసంధిని సురక్షితంగా దాటాయి. 

ఇందులో  బిడబ్ల్యు టైర్‌  మార్చి 31 నాటికి ముంబయికి,  బిడబ్ల్యు ఈఎల్ఎం  ఏప్రిల్ 1న మంగళూరుకు చేరుకోనున్నాయి. ఈ రెండు నౌకల కంటే ముందే నాలుగు భారత ఎల్‌పీజీ ట్యాంకర్లు సురక్షితంగా మన దేశానికి చేరుకున్నాయి.  92 వేల టన్నులకు పైగా వంటగ్యాస్‌తో వచ్చిన పైన్ గ్యాస్, జగ్ వసంత్ నౌకలు ఇప్పటికే భారత పోర్టులను చేరుకున్నాయి. జగ్‌ వసంత్‌ ఎల్పీజీ ట్యాంకర్‌ శుక్రవారం రాత్రి 8గంటలకు గుజరాత్‌లోని వాదినార్‌ ఓడరేవుకు చేరినట్లు, అందులో 47వేల టన్నుల ఎల్పీజీ ఉన్నట్లు తెలిపారు.

రెండో ట్యాంకర్‌ పైన్‌ గ్యాస్‌ శుక్రవారం రాత్రి భారత సముద్రజలాల్లోకి ప్రవేశించినట్లు అధికారులు చెప్పారు.  ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌కు చెందిన ఈ నౌక ఏప్రిల్‌ 2న ఒడిశాలోని ధమ్రా ఓడరేవుకు చేరుకుంటుందని తెలిపారు. అంతకుముందు మార్చి మూడో వారంలో ఎంటి శివాలిక్, ఎంటి నందా దేవి, అలాగే యూఏఈ నుంచి ముడిచమురుతో వచ్చిన జగ్ లాడ్కి నౌకలు ముంద్రా, కాండ్లా పోర్టులకు చేరుకున్నాయి.  పశ్చిమాసియాలో యుద్ధం మొదలయ్యే నాటికి హర్మూజ్ జలసంధిలో 28 భారతీయ నౌకలు ఉండగా వాటిలో కొన్ని సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నాయి. 

ఇంకా పశ్చిమ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో 485 మంది భారతీయ నావికులతో కూడిన 18 నౌకలు ఉన్నట్లు సమాచారం. జగ్ విక్రమ్, గ్రీన్ ఆశా, గ్రీన్ సాన్వి వంటి ఎల్‌పీజీ నౌకలు ఇంకా అక్కడే ఉన్నాయి.  అటు భారత్ తన వార్షిక ఎల్‌పీజీ డిమాండ్‌లో 60 శాతాన్ని దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. అందులో 90 శాతం కేవలం పశ్చిమాసియా నుంచే వస్తుంది. 

ఈ నేపథ్యంలో గల్ఫ్‌లో చిక్కుకున్న నావికుల భద్రత కోసం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ కంట్రోల్ రూమ్ 24 గంటలూ పనిచేస్తుంది.  సత్వర చర్యల ద్వారా ఇప్పటివరకు 942 మంది భారతీయ నావికులను ప్రభుత్వం సురక్షితంగా స్వదేశానికి రప్పించింది. హర్మూజ్ జలసంధిలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ, భారతీయ నౌకలు సురక్షితంగా బయటపడుతుండటం భారత్‌-ఇరాన్ మధ్య భాగస్వామ్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు.