కేటీఆర్ తో రేవంత్ రెడ్డి కుమ్మక్కు

కేటీఆర్ తో రేవంత్ రెడ్డి కుమ్మక్కు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుమ్కక్కు ఆయ్యారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. అందుకే కేటీఆర్ పైనున్న అవినీతి కేసుల జోలికి పోవడం లేదని చెప్పారు. కల్వకుంట్ల కవిత, కేటీఆర్ సయోధ్య కుదుర్చేందుకు రేవంత్ రెడ్డి మధ్యవర్తి పాత్ర పోషిస్తున్నరని తెలిపారు. 
 
కేవలం హరీష్ రావును మాత్రమే టార్గెట్ చేస్తూ కాళేశ్వరంలోని కొంత భాగం అవినీతిపై మాత్రమే మాట్లాడుతున్నారని చెప్పారు.  కాళేశ్వరంలో జరిగిన రూ.లక్ష కోట్ల అవినీతిపై విచారణ జరిపితే మొత్తం బండారం బయపటపడుతుందనే భయంతోనే సుందిళ్ల, మేడిగడ్డ అవినీతిపైనే విచారణకు పరిమితం అయ్యారని ఆరోపించారు.  హరీష్ రావుతో జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ కు సీఎం సలహా ఇస్తున్నారని,  కాళేశ్వరంపై హరీష్ పై ఉన్నంత పగ కేటీఆర్ పై రేవంత్ కు లేదని స్పష్టం చేశారు.
ఎందుకంటే ఈ ఫార్ములా కేసు, డ్రగ్స్, ఫాంహౌజ్ కేసులపై మాట్లాడటం లేదని తెలిపారు.  కేసీఆర్ పై ఉన్న కోపం కూడా రేవంత్ కు పోయిందని, ఇద్దరి మధ్య డీల్ కుదిరిందని, అందుకే హరీష్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారే తప్ప కేటీఆర్ గురించి మాట్లాడటం లేదని సంజయ్ స్పష్టం చేశారు.  అందుకే హరీష్ రావు కేటీఆర్, రేవంత్ రెడ్డి ఒక్కటా? కాదా? తేల్చుకోవాలని హితవు చెప్పారు.

కాళేశ్వరంపై మాత్రమే సీబీఐ విచారణ జరపాలని రేవంత్ రెడ్డి కోరుతున్నారని పేర్కొంటూ మరి మిగితా అవినీతి కేసుల పరిస్థితి ఏంది? అని ప్రశ్నించారు. పోనీ కాళేశ్వరంపై విచారణ జరపాలని భావిస్తే లక్ష కోట్ల రూపాయలకుపైగా అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డే చెప్పారు కదా? అని విస్మయం వ్యక్తం చేశారు.  మరి సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డకు సంబంధించి రూ.9 వేల కోట్ల అవినీతిపైనే సీబీఐ విచారణ జరపాలని ఎందుకు పట్టుపడుతున్నట్లు? అని నిలదీశారు.

కాగా, బీఆర్ఎస్, బీజేపీ పొత్తు జరగని పని అని స్పష్టం చేస్తూ కుటుంబ పాలనకు బీజేపీ వ్యతిరేకం అని సంజయ్ స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డబ్బులు సమకూరుస్తున్నదే రేవంత్ రెడ్డి అని ఆయన ఆరోపించారు. ఈసారి కర్ణాటక నుండి డబ్బులు వెళ్లడం లేదని, డీకే శివకుమార్ డబ్బులు పంపడం లేదని చెప్పారు.