కేరళలో ఎన్డీఏ అధికారం చెప్పట్టబోతోంది 

కేరళలో ఎన్డీఏ అధికారం చెప్పట్టబోతోంది 
ఈసారి కేరళలో ఎన్డీఏ అధికారం చేపట్టబోతోందని  ప్రధాని నరేంద్ర మోదీ జోస్యం చెప్పారు. కేరళ పాలక్కాడ్‌ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోదీ, కేరళ దశాబ్ధాలుగా స్వార్థ రాజకీయాల మధ్య నలిగిపోతోందని విమర్శించారు.  కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు ‘బీ- టీమ్’ ఆరోపణలు చేసుకుంటూ, కేరళలో బీజేపీయే అసలైన పోటీదారు అని అంగీకరిస్తున్నాయని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. 

దశాబ్దాలుగా కుంభకోణాల మధ్య ఎల్‌డీఎఫ్, యుడీఎఫ్ అధికారాన్ని మార్చుకుంటూ వచ్చాయని, అయినా ఒకరిపై ఒకరు ఎన్నడూ చర్యలు తీసుకోలేదని మోదీ ఆరోపించారు.  కేరళలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ కలిసి ప్రభుత్వ నిధులను దోచేశాయని పేర్కొంటూ ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవినీతిపరులు దోచుకున్న డబ్బును తిరిగి వసూల్‌ చేసి కేరళ అభివృద్ధికి ఖర్చుచేస్తుందని స్పష్టం చేశారు. 

కేరళ ప్రజలు అధికార మార్పు కోరుకుంటున్నారని, రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం ఉందని చెబుతూ మార్పు సందేశం స్పష్టంగా కనిపిస్తోందని ప్రధాని పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తల అవిశ్రాంత కృషితో ఎన్‌డీయే ప్రభుత్వం కొలువుతీరుతుందని జోస్యం చెప్పారు. కేరళను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా బీజేపీ తీర్చిదిద్దుతుందని, మోదీ హామీల గ్యారెంటీలతో రాష్ట్రం ముందుకు సాగుతుందని ప్రధాని పేర్కొన్నారు.

“కేరళ ప్రభుత్వం ఇప్పుడు రూ. 5 లక్షల కోట్లకు పైగా రుణభారంతో సతమతమవుతోంది. ఈ అప్పు రెండేళ్లలో మూడింతలు పెరిగింది. రాష్ట్ర ఉద్యోగులకు సమయానికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఎన్డీఏ అధికారంలోకి వస్తే అవినీతిపరుల నుంచి డబ్బును రికవరీ చేసి రాష్ట్రాభివృద్ధికి ఖర్చు చేస్తాం” అని ప్రధాని హామీ ఇచ్చారు.  కాంగ్రెస్, వామపక్షాలు ఎక్కడ అధికారంలోకి వచ్చినా అంతా నాశనం చేస్తాయనే ట్రాక్ రికార్డ్ ఉందని చెబుతూ బెంగాల్, త్రిపురను కమ్యూనిస్టులు ఎలా నాశనం చేశారో దేశం మొత్తానికి తెలుసని ధ్వజమెత్తారు. 

అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య సంఘర్షణ కొనసాగుతున్న పశ్చిమ ఆసియా పరిస్థితిపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శిస్తూ, రాజకీయ ప్రయోజనాల కోసం గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల ప్రాణాలను ప్రమాదంలో పడేయాలని ఆ ‘చారిత్రక పార్టీ’ కోరుకుంటోందని మోదీ మండిపడ్డారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశంపై తక్కువ ఉండేలా కేంద్ర ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. 

యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచ నాయకులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నానని, భారతీయుల భద్రతకు అన్ని దేశాలు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయని ప్రధాని వివరించారు.