ఖరీదైన టెక్నాలజీని కారు చౌకగా బదిలీ చేస్తున్న ఇస్రో

ఖరీదైన టెక్నాలజీని కారు చౌకగా బదిలీ చేస్తున్న ఇస్రో
* ఇస్రో, డీవోఎస్‌లపై పార్లమెంటరీ స్థాయీ సంఘం విమర్శలు

జాతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), దాని అనుబంధ ప్రభుత్వ సంస్థలు అభివృద్ధి చేసిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తక్కువ విలువకే ప్రైవేట్‌ సంస్థలకు బదిలీ చేస్తున్నారని పార్లమెంటరీ కమిటీ ఒకటి ఆందోళన వ్యక్తం చేసింది. ఉపగ్రహాలు, రాకెట్లు, రసాయనాలు, అధునాతన పదార్థాలు, ఉన్నత స్థాయి వ్యవస్థల్లో ఉపయోగించే ఉప భాగాలకు సంబంధించిన సాంకేతికతలను అత్యంత కారు చౌక ధరలకు బదిలీ చేస్తున్నట్లు కమిటీ పేర్కొంది.

సాంకేతికతలు తరచుగా ప్రైవేట్‌ సంస్థలకు తక్కువ విలువకే బదిలీ అవుతున్నాయని, దీనివల్ల ఆ భాగస్వాములు గణనీయమైన లాభాలు అర్జిస్తుండగా, వాటిని అందించిన సంస్థలు మాత్రం సృష్టించిన విలువలో కేవలం నామమాత్రపు వాటాను మాత్రమే పొందుతున్నాయని గమనించినట్లు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగంపై నియామకమైన స్టాండింగ్‌ కమిటీ తన నివేదికలో పేర్కొంది.

ప్రధాని కార్యాలయం ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేసే అత్యంత కీలకమైన అంతరిక్ష శాఖ(డీఓఎస్‌) పనితీరును కూడా కమిటీ సమీక్షించింది. ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేసిన సాంకేతికతలకు చెందిన నిజమైన వాణిజ్య విలువ, ప్రత్యేకత, సామాజిక ప్రభావాన్ని టెక్నాలజీ లైసెన్సింగ్‌ ఫీజులు సముచితంగా ప్రతిబింబించాలని కమిటీ సూచించింది. 

పైగా, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ ఖర్చులను నిర్ధారించడానికి స్పష్టమైన మార్గదర్శకాలను ఏర్పాటు చేయాలని, సాంకేతిక పరిజ్ఞాన రుసుములను మూల్యాంకనం చేయడానికి ఇన్ స్పాక్ ఈ  ఏర్పాటు చేసిన స్థాయీ కమిటీ ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా రుసుములను లెక్కించాలని కమిటీ సిఫార్సు చేసింది.  పారదర్శకత, జవాబుదారీతనం నిర్ధారించడానికి అన్ని టెక్నాలజీ బదిలీ ఒప్పందాలు కాలానుగుణంగా థర్డ్‌ పార్టీ ఆడిట్‌లకు లోబడి ఉండాలని కమిటీ సిఫార్సు చేసినట్లు వివిధ విపక్ష పార్టీలకు చెందిన 40 మంది ఎంపీల కమిటీ సలహా ఇచ్చింది.