ఇరాన్, అమెరికా – ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ఇంధన సంక్షోభంతో పాటు ఎరువుల సంక్షోభం కూడా ఏర్పడుతుంది. భారతదేశ వ్యవసాయ రంగానికి అత్యంత కీలక ఎరువైన యూరియా సరఫరాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. భారత్ వినియోగించే యూరియాలో దాదాపు 46 శాతం ఒమన్ దేశం నుంచే వస్తుంటుంది. యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియాలు కూడా మన దేశానికి యూరియాను విక్రయిస్తుంటాయి.
ప్రస్తుతం ఇరాన్ పరిధిలోని హర్మూజ్ జలసంధి మీదుగా నౌకల రాకపోకలు స్తంభించడంతో గల్ఫ్ దేశాల నుంచి భారత్‌కు యూరియా సరఫరా ఆగిపోయింది. యూారియాను తయారు చేయాలంటే సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ) అవసరం. ఎల్‌ఎన్‌జీ సరఫరా ఆగిపోవడంతో ప్రస్తుతం భారత్‌లోని యూరియా తయారీ ప్లాంట్లు సగం సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. దీంతో యూరియా ధరలు ఇప్పటికే 19 నుంచి 28 శాతం పెరిగాయి.
గత నెలరోజులుగా జరుగుతున్న ఈ యుద్ధం వల్ల భారత్‌కు యూరియా, పొటాష్ (మ్యూరియేట్ ఆఫ్ పొటాష్), ఫాస్ఫరస్ ఆధారిత ఉత్పత్తులు, నైట్రోజన్ – ఫాస్పరస్ – పొటాషియం (ఎన్‌పీకే) ఫార్ములేషన్ల సప్లైలలో చాలావరకు ఆగిపోయింది. దీంతో మార్కెట్‌లో ఎరువుల ధరల పెరుగుదల మొదలైంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో యూరియా ధర 50 శాతం మేర పెరిగి టన్నుకు 720 డాలర్లకు, అమోనియా ధర టన్నుకు రూ.56,910 (600 డాలర్ల)కు చేరింది.డై అమ్మోనియం ఫాస్ఫేట్ (డిఎపి) వంటి సంక్లిష్ట ఎరువుల ధరలు టన్నుకు రూ.94,850 (1,000 డాలర్ల)కు చేరొచ్చని మార్కెట్ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. రాబోయే కొన్ని నెలల్లో యూరియా ధరలు రూ.94,850 (1,000 డాలర్ల)ను దాటొచ్చని వారు అంచనా వేస్తున్నారు.
2022లో ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలయ్యాక కూడా, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి. 2022-2023 మధ్యకాలంలో రష్యా నుంచి ఎరువుల సరఫరాలో జరిగిన జాప్యం ప్రభావంతో చాలా దేశాలలో వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. ఆ సంక్షోభం నుంచి పూర్తిగా బయటపడకముందే, ఇరాన్-అమెరికా యుద్ధం రూపంలో మరో సంక్షోభం భారత వ్యవసాయ రంగాన్ని, ఎరువుల పరిశ్రమలను ముసురుకుంది.
భారత్‌లో పెద్దసంఖ్యలో యూరియా తయారీ ప్లాంట్లు ఉన్నాయి. యూరియా తయారీ కోసం ప్రధానంగా ఎల్ఎన్‌జీ కావాలి. భారత్ వినియోగించే ఎల్‌ఎన్‌జీలో దాదాపు 70 శాతం ఖతార్, సౌదీ అరేబియాల నుంచే వస్తుంటుంది. ఇప్పటికిప్పుడు ఆ దేశాల నుంచి భారీ మోతాదులో భారత్‌కు ఎల్‌ఎన్‌జీ సప్లై జరిగే అవకాశాలు కనిపించడం లేదు. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభం కాగానే, భారత్‌లోని యూారియా ప్లాంట్లు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని 70శాతానికి తగ్గించాయి. ఇప్పుడవి కేవలం సగం సామర్థ్యంతోనే పనిచేస్తున్నాయి. బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లలో ఇప్పటికే చాలా యూారియా ప్లాంట్లు తన కార్యకలాపాలను ఆపేశాయి.

More Stories
రైల్వేలో మద్యం, పొగాకు ప్రకటనలపై నిషేధం
భారత్ కు మరో రెండు ఎల్పీజీ నౌకలు
రేమండ్ గ్రూప్ చైర్మన్ విజయ్‌పత్ సింఘానియా మృతి