హైదరాబాద్‌పై ఆర్‌సీబీ ఘన విజయం

హైదరాబాద్‌పై ఆర్‌సీబీ ఘన విజయం

* ఐపిఎల్‌ సీజన్‌-19 ప్రారంభం

ఐపీఎల్‌ 19వ సీజన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ)కు అదిరిపోయే ఆరంభం. చిన్నస్వామి స్టేడియంలో ఉద్విగ్నభరిత క్షణాల మధ్య శనివారం జరిగిన లీగ్‌ తొలి పోరులో ఆర్‌సీబీ సత్తాచాటుతూ 6 వికెట్ల తేడాతో(26 బంతులు మిగిలుండగానే) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచిన ఆర్‌సీబీ కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ హైదరాబాద్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌(38 బంతుల్లో 80, 8ఫోర్లు, 5 సిక్స్‌లు) ధనాధన్‌ అర్ధసెంచరీతో హైదరాబాద్‌ 20 ఓవర్లలో 201/9 స్కోరు చేసింది. క్లాసెన్‌(31), అనికేత్‌(43) రాణించడంతో హైదరాబాద్‌ పోరాడే స్కోరు దక్కింది. అరంగేట్రం బౌలర్‌ జాకబ్‌ డఫీ(3/22), రొమారియో షెఫర్డ్‌(3/54) మూడేసి వికెట్లతో రాణించారు.  లక్ష్యఛేదనలో విరాట్‌కోహ్లీ(38 బంతుల్లో 69 నాటౌట్‌, 5ఫోర్లు, 5 సిక్స్‌లు), దేవదత్‌ పడిక్కల్‌(26 బంతుల్లో 61, 7ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో బెంగళూరు 15.4 ఓవర్లలో 203/4 స్కోరు చేసింది. డేవిడ్‌ పైన్‌(2/35)రెండు వికెట్లు తీశాడు. డఫీకి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది.

లక్ష్యఛేదనలో ఆర్‌సీబీ బ్యాటర్లు ధనాధన్‌ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. ఫామ్‌లేమితో సతమతమవుతున్న ఫిల్‌ సాల్ట్‌ నితీశ్‌కుమార్‌రెడ్డి బౌలింగ్‌లో బౌండరీలతో విరుచుకుపడ్డా అదే జోరు కొనసాగించలేకపోయాడు. ఉనద్కట్‌ రెండో ఓవర్‌లో భారీ షాట్‌ ఆడబోయిన సాల్ట్‌ మిడాఫ్‌లో క్లాసెన్‌ చేతికి చిక్కాడు. ఒకే క్యాచ్‌ కోసం ఇద్దరు ప్రయత్నించినా ఆఖరికి క్లాసెన్‌కే దక్కడంతో హైదరాబాద్‌ ఊపిరి పీల్చుకుంది. 

డఫీ స్థానంలో ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన దేవదత్‌ పడిక్కల్‌ క్రీజులోకి వచ్చి రావడంతోనే సిక్స్‌తో తన ఉద్దేశమేంటో చెప్పకనే చెప్పాడు. దేశవాళీ సీజన్‌లో సూపర్‌ ఫామ్‌ను ఐపీఎల్‌లో కొనసాగిస్తూ పడిక్కల్‌ అలవోకగా బౌండరీలు బాదడంతో స్కోరుబోర్డు ఊపందుకుంది. మరో ఎండ్‌లో కోహ్లీ కూడా బ్యాటు ఝులిపించడంతో పరుగుల రాక సులువైంది.

ఇషాన్‌ కిషన్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. సహచరులు విఫలమైన వేళ తన ఫామ్‌ను కొనసాగిస్తూ జట్టుకు భారీ స్కోరు అందించాడు. హెడ్‌(11), అభిషేక్‌(7) స్వల్ప స్కోర్లకే వెనుదిరుగగా, కిషన్‌ సాధికారిక ఇన్నింగ్స్‌ ఆడాడు. మిడిలార్డర్‌లో నితీశ్‌(1), సలీల్‌ అరోరా(9), హర్ష్‌దూబే(3) ఇలా వచ్చి ఆలా వెళ్లారు. క్లాసెన్‌తో కలిసి కిషన్‌ ఇన్నింగ్స్‌..హైదరాబాద్‌ 200ల స్కోరుకు కారణమైంది. దీనికి తోడు ఆఖర్లో అనికేత్‌ దూకుడుగా ఆడటం కలిసొచ్చింది.

ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఎలాంటి ప్రారంభోత్సవ వేడుకలు లేకుండా జనగనమనతో ఈ ఏడాది ఐపిఎల్‌ సీజన్‌ మొదలైంది. గత ఏడాది ఆర్సీబీ జట్టు కప్‌ గెలిచిన సందర్భంగా జరిగిన దుర్ఘటనలో 11మంది అభిమానులు మృతికి సంతాపంగా ఈ ఏడాది ఐపిఎల్‌ ప్రారంభోత్సవ వేడుకలను రద్దు చేస్తున్నట్లు బిసిసిఐ ప్రకటించింది.