తెలంగాణలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత లేదు

తెలంగాణలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత లేదు
ఆయిల్ కంపెనీల అధికారులు ఇప్పటికే స్పష్టం చేసినట్లుగా, తెలంగాణలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత ఏమీ లేదని, దేశవ్యాప్తంగా సరఫరాలు సక్రమంగా కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఎల్‌పీజీ సరఫరా, లభ్యత, ప్రస్తుత పరిస్థితులపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, డీలర్స్ అసోసియేషన్స్‌తో కలిసి చర్చించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ  ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. 

తెలంగాణలో గత వారం రోజులుగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ సరఫరాలపై ప్రజల్లో ఒక రకమైన ఆందోళన నెలకొందని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ పంపుల్లో ఇంధనం లేదని చెప్పడం, కొంతసేపు పంపులను మూసివేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొంటూ 
ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన యుద్ధ వాతావరణం, అంతర్జాతీయ ఉద్రిక్తతలు వంటి కారణాల వల్ల ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. 

పెట్రోలియం ఉత్పత్తుల విషయంలో మనం ఇతర దేశాలపై ఆధారపడుతున్నామని, అందువల్ల ప్రపంచ పరిస్థితుల ప్రభావం మన దేశంపైన కూడా పడుతుందని స్పష్టం చేశారు.  ఇలాంటి పరిస్థితుల్లో కూడా భారత ప్రభుత్వం సమర్థవంతంగా చర్యలు తీసుకుంటోందని హామీ ఇచ్చారు. 
దేశంలో అంతర్గతంగా జరుగుతున్న ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచుతూ, అవసరమైన ఇంధనాన్ని దేశంలోనే అందించే దిశగా కృషి జరుగుతోందని,  అంతేకాకుండా విదేశాల నుండి రావాల్సిన పెట్రోలియం ఉత్పత్తులను కూడా విజయవంతంగా దిగుమతి చేసుకునే విధంగా ముందుకు సాగుతోందని వివరించారు.

దేశానికి అవసరమైన ఇంధనం కొరత లేకుండా ఉండేందుకు, ఇతర దేశాలు నిర్ణయించిన ధరలను చెల్లించి అయినా సరే, పెట్రోల్, డీజిల్ వంటి ఉత్పత్తులను దేశానికి తీసుకురావడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి భరోసా వ్యక్తం చేశారు. పైగా, మన దేశంలో వాహనాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని, ప్రజల అవసరాలు కూడా పెరుగుతున్నాయని గుర్తు చేశారు. 

ఈ పరిస్థితుల్లో మనం ఇంధన వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి సూచించారు. అందుకే ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తూ, దేశవ్యాప్తంగా రైల్వేలను విద్యుదీకరణ చేస్తూ, పెట్రోల్ వినియోగాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు.  సోషల్ మీడియా విషయానికి వస్తే, ఇది సమాచారం పంచుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో తప్పుడు ప్రచారం ప్రజల్లో భయాందోళనలను పెంచుతోందని విచారం వ్యక్తం చేశారు. పెట్రోల్ కొరత ఉందనే వదంతులు అనవసరమైన రద్దీకి దారి తీసాయని తెలిపారు.