ప్రస్తుతం హైదరాబాద్ అభివృద్ధి నిలిచిపోయింది

ప్రస్తుతం హైదరాబాద్ అభివృద్ధి నిలిచిపోయింది
ప్రస్తుతం హైదరాబాద్ అభివృద్ధి నిలిచిపోయిందని, ఇది ప్రజల్లో ఆందోళనకు దారి తీస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు తెలిపారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో, ప్రస్తుత కాంగ్రెస్ పరిపాలనలో నిజమైన మార్పు ఎందుకు రాలేదు అనే ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమవుతోందని చెప్పారు.  దిల్‌సుఖ్‌నగర్‌లో బిజెపిలో పెద్దఎత్తున యువత, ప్రజల చేరికల కార్యక్రమంలో మాట్లాడుతూ జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు ఈ విధంగా వివిధ వర్గాల ప్రజలు, వివిధ పార్టీలకు చెందిన వారు బీజేపీలో చేరడం రానున్న రాజకీయ మార్పుకు సంకేతం అని పేర్కొన్నారు. 
 
హైదరాబాద్ నగరం నిర్లక్ష్యానికి గురైందని, అభివృద్ధి కూడా ఆగిపోయిందని చెబుతూ ప్రస్తుతం కనిపిస్తున్న కొద్దిపాటి అభివృద్ధి కూడా బిజెపి కార్పొరేటర్లు చురుకుగా పనిచేస్తున్న ప్రాంతాల్లోనే కనిపిస్తోందని స్పష్టం చేశారు.  రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, మేధావులు, యువత, మహిళలు ముందుకు వచ్చి ఈ ప్రజా ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని  పిలుపునిచ్చారు. తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికల్లో ప్రతి వర్గం చురుకుగా పాల్గొనాల్సిన అవసరం ఉందని చెప్పారు.

హైదరాబాద్‌లో గతంలో జరిగిన అభివృద్ధి కూడా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలో, అప్పటి ఎన్డీయే-టీడీపీ ప్రభుత్వ కాలంలో రూపొందించిన ప్రణాళికలు, కార్యక్రమాల ఆధారంగానే జరిగిందని తెలిపారు. కానీ బీఆర్‌ఎస్ గాని, ఇప్పుడు కాంగ్రెస్ గాని హైదరాబాద్ అభివృద్ధికి గణనీయంగా చేసిందేమీలేదని ధ్వజమెత్తారు.

హైదరాబాద్ పరిసరాల్లో నిర్మించబడిన అనేక జాతీయ రహదారులు, కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు.. ఇవన్నీ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రధాన కృషి అని చెప్పారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సెల్‌ఫోన్ తయారీ పరిశ్రమలు, రక్షణ రంగానికి చెందిన పరిశ్రమలు వంటి అనేక పరిశ్రమలు స్థాపిస్తున్నారని గుర్తు చేసారు.  కేంద్ర ప్రభుత్వ పథకాలు అయిన మేక్ ఇన్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా వంటి కార్యక్రమాల ఫలితంగా వస్తున్నాయని, ఈ పథకాల ద్వారా పరిశ్రమలు ఏర్పడుతూ, యువతకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు.

తెలంగాణలో ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓంకారేశ్వర ఆలయం నిర్మాణం గురించి మాట్లాడుతుంటారని, మరోవైపు హిందూ దేవతలను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేస్తారని ధ్వజమెత్తారు. ఒకవైపు ఆలయాల పేరుతో భక్తి చూపిస్తున్నట్టు నటిస్తూ, మరోవైపు “ముస్లిం కాంగ్రెస్… కాంగ్రెస్ ముస్లిం” అంటూ మత రాజకీయాలను ప్రోత్సహించడం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు.