పశ్చిమాసియాలో యుద్ధం గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్లక్ష్యపు వ్యాఖ్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మియామిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్ నాయకత్వం మొత్తాన్ని తాము తుడిచిపెట్టామని చెబుతూ ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కూడా చనిపోయే ఉంటాడని, లేదంటే చావుబతుకుల్లో ఉండి ఉంటాడని తెలిపారు.
ఇరాన్ దేశపు అత్యున్నత నాయకత్వం, మిలిటరీ శక్తి ధ్వంసమైందని, వారి ముఖ్య నాయకులు మరణించారని, ఆ దేశానికి ఇప్పుడు సుప్రీం లీడరే లేరని ట్రంప్ పేర్కొన్నారు. మొజ్తాబా ఖమేనీ నుంచి ఎలాంటి ప్రకటనలు రావట్లేదు కాబట్టి ఆయన చనిపోయి ఉండాలని, లేకపోతే ఆయన పరిస్థితి విషమంగానైనా ఉండాలని అని అంచనా వేశారు.
అమెరికా అధ్యక్షుడు మీడియాతో మాట్లాడుతూ ‘‘ఇరాన్ అగ్ర నాయకత్వం, సైనిక శక్తి నాశనమైంది. ఇరాన్ నౌకాదళం అంతమైపోయింది. అదంతా అఖాతపు అడుగున మునిగిపోయింది.. వారి నాయకులు చనిపోయారు. వారి సుప్రీం నాయకుడు (ఆయతుల్లా అలీ ఖమేనీ) చనిపోయారు. కొత్త సుప్రీం లీడర్ అయిన ఆయన కుమారుడు నుంచి ఎలాంటి ప్రకటనలు రావడం లేదంటే అతడు చనిపోయి ఉండాలి లేదా పరిస్థితి విషమంగానైనా ఉండాలి’’ అని తెలిపారు.
గతంలో కూడా మొజ్తాబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై అనుమానం వ్యక్తం చేశారు. మార్చి 16న జరిగిన ఓ వైమానిక దాడిలో ఆయన గాయపడ్డారన్న వార్తల నేపథ్యంలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఇంకా బతికే ఉన్నారా? లేదా? అనేది అస్పష్టంగా ఉందని పేర్కొన్నారు. ‘‘ఆయన చనిపోయారో లేదో మాకు తెలియదు. నేను చెప్పేదేమిటంటే, ఆయన్ని ఎవరూ చూడలేదు, ఇది అసాధారణం’’ అని వైట్‌హౌస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ట్రంప్ పేర్కొన్నారు.
పశ్చిమాసియాలో భీకర యుద్ధం కొనసాగుతుండగా సుప్రీం లీడర్‌గా ఎన్నుకున్న తర్వాత మోజ్తాబా ఖమేనీ బయట ప్రపంచానికి కనిపించడం లేదు. ఆయన పేరుతో మీడియాలో ప్రకటనలు మాత్రం చదివి వినిపిస్తున్నారు. దీంతో ఇరాన్ నూతన సుప్రీం లీడర్ ఆరోగ్యంపైనా పలు వదంతలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో ఆయన కూడా తీవ్రంగా గాయపడ్డారని, ప్రస్తుతం రష్యాలో చికిత్స పొందుతున్నారనే ప్రచారం కూడా జరిగింది. దీనిని ఇరాన్ ఖండించినా ఆయన ఎక్కడున్నారనేది మాత్రం బయటపెట్టలేదు.
ఇదిలా ఉండగా, ఇరాన్‌పై యుద్ధం చేస్తోన్న ట్రంప్ తాను రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత నుంచి ఇప్పటి వరకూ ఎనిమిది యుద్ధాలు ఆపానంటూ మళ్లీ అదే పాట పాడారు. అంతేకాదు, తనను తాను శాంతిదూతగా ట్రంప్ కితాబిచ్చుకున్నారు. “ఇప్పుడు నేను శాంతిదూతగా అనిపించకపోవచ్చు కానీ, శాంతిదూతనే” అంటూ చెప్పుకొచ్చారు.

More Stories
ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసారాలకు బాంగ్లాదేశ్ గ్రీన్ సిగ్నల్
నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ అరెస్ట్
పిల్లలను ఆన్లైన్ ప్రమాదాల నుంచి కాపాడటంలో మెటా విఫలం