* న్యూ మెక్సికో జ్యూరీ మెటా, గూగుల్ లకు భారీ జరిమానాలు
పిల్లలను ఆన్‌లైన్ ప్రమాదాల నుంచి కాపాడటంలో మెటా (ఫేస్‌బుక్ మాతృ సంస్థ) విఫలమైందని అమెరికాలోని న్యూ మెక్సికో జ్యూరీ చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. అశ్లీల వీడియోలు, ఫొటోలు, అక్రమ చర్యలకు ప్రేరేపణ, మానవ అక్రమ రవాణా లాంటి ప్రమాదాల నుంచి పిల్లలను రక్షించడంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ విఫలమయ్యాయని జ్యూరీ అభిప్రాయపడింది.
ఈ కారణంగా మెటాకు రూ.3,161 కోట్ల భారీ జరిమానా విధించింది. మరో కేసులో కేజీఎం అనే యువతి కుంగుబాటు, ఆందోళనకు మెటా, గూగుల్‌ను కాలిఫోర్నియా జ్యూరీ బాధ్యులుగా చేసింది. తాను బానిసగా మారేలా కావాలనే కొన్ని ఉత్పత్తులను సదరు సంస్థలు ప్రచారం చేశాయని ఫిర్యాదీదారు ఆరోపించారు. ఈ కేసులో మెటాకు రూ.20 కోట్లు, గూగుల్‌కు రూ.8 కోట్ల భారీ జరిమానాను కోర్ట్ విధించింది.
ఈ వారంలో అమెరికా కోర్టులో మెటాకు ఎదురుదెబ్బ తగలడం ఇది రెండోసారి. అమెరికాలో సోషల్ మీడియా దుష్ప్రభావాలపై రెండు వేలకు పైగా దావాలు ఫెడరల్ కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. తాము ఉంచుతున్న కంటెంట్ హానికరమైనది తెలిసినా సోషల్ మీడియా సంస్థలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. దీంతో పలు దేశాలు టీనేజీ లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించే ప్రయత్నాలు చేస్తున్నాయి.
ప్రస్తుతం 20 ఏండ్ల వయసున్న కేజీఎం తాను ఆరేండ్ల వయసులో యూట్యూబ్, తొమ్మిదేండ్ల వయసులో ఇన్‌స్టాగ్రామ్ చూడటం మొదలుపెట్టానని, వాటి వల్ల తనకు తప్పనిసరి వినియోగ పద్ధతులు అలవడ్డాయని, అందులో భాగంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క రోజులో 16 గంటల వరకు గడిపానని, ఆ ప్లాట్‌ఫామ్‌ల డిజైన్ ఫీచర్లే తనలో ఆందోళన, డిప్రెషన్, బాడీ డిస్మోర్ఫియా (తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్య), ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలకు ప్రేరేపించాయని ఆమె వాదించారు.
ప్రాజెక్ట్ మిస్ట్ అనే మెటా అంతర్గత అధ్యయనాన్ని ఆమె తరఫు న్యాయవాది లార్క్ లేనియర్ కోర్టులో ఉటంకించారు. ఈ అధ్యయనం ప్రకారం ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొన్న పిల్లలు ఇన్‌స్టాగ్రామ్‌కు బానిసలయ్యే అవకాశం ఎక్కువగా ఉందని, ఆ వ్యసనాన్ని ఆపడం తల్లిదండ్రుల వల్ల కూడా కాదని తేలిందని న్యాయవాది తెలిపారు. అయితే, మెటా తరఫు న్యాయవాది వాదిస్తూ కేజీఎం ఆరోగ్య సమస్యలకు ఆమె కుటుంబ పరిస్థితులే కారణమని, వాస్తవానికి ఇంట్లో ఇబ్బందులు ఎదుర్కొన్నపుడు సోషల్ మీడియా ఆమెకు ఆరోగ్యకరమైన ఉపశమనాన్ని అందించి ఉండవచ్చని వాదించారు.
కాగా కేజీఎం కేసుపై న్యాయస్థానం వెలువరించిన తీర్పు వ్యసనం వల్ల కలిగే దుష్ప్రభావాలకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుంచి నష్టపరిహారం కోరే ఇతర కేసులకు మార్గం సుగమం చేస్తుంది.
More Stories
నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ అరెస్ట్
నేపాల్ ప్రధానిగా బాలేంద్ర షా ప్రమాణ స్వీకారం
అమెరికా ప్రభుత్వం, గూగుల్‌పై ఎప్స్టీన్ బాధితులు దావా